• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మిలటరీ మాధవరం.. దేశానికి 2 వేల మంది సైనికుల్ని ఇచ్చిన చిన్న గ్రామం

By BBC News తెలుగు
|

మిలటరీ మాధవరంలో స్మారక చిహ్నం

ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్క గ్రామం వందల మంది సైనికులకు పుట్టినిల్లుగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆ ఊరి పేరు కూడా మిలటరీతో ముడిపడి ఉంది. మాధవరం అంటే చాలామందికి తెలియకపోవచ్చు, మిలటరీ మాధవరం అంటే మాత్రం పొరుగు రాష్ట్రాల వారికి కూడా తెలుసు అనడంలో ఆశ్చర్యం లేదు. సుమారు 2వేల మంది సైనికులు పుట్టిన ఆ గడ్డపై వర్తమాన పరిస్థితులపై కొంత కలవరం కనిపిస్తోంది.

మిలటరీ మాధవరం-సుదీర్ఘ చరిత్ర

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలంలో ఉన్న మాధవరం గ్రామానికి, రక్షణ దళాలకు సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉంది. ప్రస్తుతం దేశంలోని దాదాపు ప్రతీ రెజిమెంట్‌లోనూ ఈ ఊరికి చెందిన ఒక్కరైనా ఉండొచ్చు అని గ్రామస్తులు అంటారు.

గ్రామంలో ప్రతీ కుటుంబానికి త్రివిధ దళాల నేపథ్యం ఉంటుంది. ఇంటికి ఒక్కరైనా దేశ రక్షణ విభాగాల్లో పని చేసి లేదా చేస్తూ ఉంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ప్రస్తుతం ఈ గ్రామానికి చెందిన దాదాపు 340 మంది సర్వీసులో ఉన్నారు.

దేశం కోసం పని చేయడంలో ఉన్న సంతృప్తి ఇంకెక్కడా ఉండదని సుబేదార్‌గా పని చేసి రిటైర్ అయిన బట్రెడ్డి రాజారావు చెబుతున్నారు. 1975 నుంచి 23 ఏళ్ల పాటు ఆయన ఆర్మీలో పని చేశారు. ఆయన సోదరులు ఇద్దరూ, వారి తండ్రి, పిన తండ్రితో పాటు తాతలు కూడా మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో దేశం తరపున పోరాడిన చరిత్రను సొంతం చేసుకున్నారు.

మిలటరీ మాధవరం గ్రామం

రెండు ప్రపంచ యుద్ధాల్లో 12మంది మరణం

బ్రిటిష్ ఇండియాలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల్లో కూడా ఈ గ్రామ వాసులు పాల్గొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒకరు మరణిస్తే, రెండో ప్రపంచ యుద్ధంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ గ్రామం నుంచి 1100 మంది పాల్గొన్నారని బట్రెడ్డి రాజారావు చెబుతున్నారు.

"మా తాతలు, తండ్రుల కాలం నుంచి సైన్యంలో పనిచేయడం వారసత్వంగా వస్తోంది. శ్రీకృష్ణ దేవరాయలు, తర్వాత చోళులు, రెడ్డి రాజులు ఇలా వివిధ రాజ్యాల్లో సైనికులుగా మా పూర్వికులు పనిచేశారని చెబుతారు. ప్రపంచ యుద్ధాల్లో బ్రిటిష్ తరుపున పోరాడారు. నైజాం నవాబు సైన్యంలో కూడా మా ఊరి వాసులు పని చేశారు. రక్షణ రంగంలో పని చేయడం వల్ల ఉపాధి, దేశ సేవ అనే తృప్తి కలుగుతాయి" అని తెలిపారు.

ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వారి జ్ఞాపకార్ధం గ్రామంలో యుద్ధ స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ యుద్ధాల్లో మరణించిన వారి పేర్లను ఆ స్థూపంపై నమోదు చేశారు. ఏటా జరిగే స్వాతంత్ర్య , గణతంత్ర దినోత్సవ సమయాల్లో వారికి నివాళులు అర్పిస్తారు. ప్రతి సంవత్సరం జులై 27న కార్గిల్ దివస్ కూడా జరువుతామని గ్రామస్థులు తెలిపారు.

మిలటరీ మాధవరం గ్రామం

వ్యవసాయ గ్రామమే గానీ.. రక్షణ రంగంవైపే మొగ్గు

మాధవరం ప్రధానంగా విలువైన వ్యవసాయ భూములు కలిగిన ప్రాంతం. నిత్యం నీటితో కళకళలాడే చెరువులు, ఎర్ర కాలువ నీటితో వివిధ పంటలు సాగు చేస్తారు. అయినా అందరూ రక్షణ దళాల్లో పని చేయాలని ఆశిస్తూ ఉంటారని ప్రస్తుతం మిలటరీ మాధవరం ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న బొల్లం వీరయ్య తెలిపారు. ఆయన శ్రీలంకలో భారత శాంతి దళాల తరుపున ఎల్టీటీఈతో పోరాడిన బృందంలో ఉన్నారు. మద్రాస్ రెజిమెంట్‌లో 1980 నుంచి 2008 వరకూ పని చేశారు.

"చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలనే ఆసక్తి మొదలవుతుంది. తాతలు, తండ్రులు సైన్యంలో ఉండడం వల్ల పిల్లలు కూడా అలాంటి ఆలోచనకు వస్తారు. పెద్దలు కూడా ప్రోత్సహిస్తారు. కుటుంబాలకు కుటుంబాలే ఆర్మీలో ఉంటాయి. ఇప్పుడు మా అబ్బాయి సర్వీసులో ఉన్నాడు. ఇప్పుడు మా ఊరి నుంచి జీవించి ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్, సర్వీస్‌లో ఉన్నవారు కలిపితే 1860 మంది ఉన్నారు. ఊర్లో ఒక లైబ్రరీ నడుపుతున్నాం. స్వతంత్ర్యానికి పూర్వమే అది ప్రారంభించారు. ఒక కల్యాణ మండపం నిర్మాణంలో ఉంది"అని తెలిపారు.

మిలటరీ మాధవరంలో రెండో ప్రపంచయుద్ధ స్మారక చిహ్నం

ఒకే కుటుంబంలో పది మంది సైనికులు

ప్రస్తుతానికి రెండు దేశాల సైనికులు వివాదాస్పద ప్రాంతం నుంచి వెనక్కి వచ్చినప్పటికీ చర్చల ద్వారా ఈ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో అరికడతారని అశిస్తున్నట్టు మాజీ సైనికుడు ఎల్ నాగేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన సోదరులు నలుగురు, కొడుకు, అల్లుడు కూడా సైన్యంలో పని చేశారు. వారి తండ్రి సోదరులు నలుగురు సైన్యంలోనే ఉండేవారు. నాగేశ్వరరావు కమ్యూనికేషన్ విభాగంలో పనిచేశారు.

ఒకే కుటుంబానికి చెందిన సుమారు పది మంది సైనికులు ఉండడం విశేషమే. ఆయన బీబీసీతో మాట్లాడుతూ " గల్వాన్ లోయలో పని చేశాను. లెహ్, లద్దాక్ అన్నీ తిరిగాము. కానీ ఇప్పుడున్న ఉద్రిక్తత వాంఛనీయం కాదు. కాలుదువ్వితే అందరికీ నష్టమే. సామరస్యంగా వారికి బుద్ధి చెప్పాలి. కల్నల్ సంతోష్ బాబు మృతి కలచివేసింది. ఆయన విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. సైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు అవసరం" అని తెలిపారు.

'సరిహద్దుల్లో బంధువులు ఉన్నప్పుడు మాకు టెన్షన్ తప్పదు..’

విధి నిర్వహణలో దేశ సరిహద్దుల్లో ఉన్న సమయంలో ఇంట్లో వాళ్ళకి చాలా టెన్షన్ ఉంటుందని మాధవరం మాజీ సర్పంచ్ కె పరిమళ అన్నారు. ఆమె భర్త 20 ఏళ్ల పాటు ఆర్మీలో పని చేశారు. "మా వారు బోర్డర్లో ఉన్నప్పుడు చాలా ఆందోళన ఉండేది. అయినా దేశం కోసం సేవ చేస్తున్నారనే ధైర్యం ఉంటుంది. గతంలో సెలవులు తక్కువగా ఉండేవి. ఇప్పుడు కొంత ఫర్వాలేదు. మావారు సైన్యం నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యంతో మరణించారు. ప్రస్తుతం మా అబ్బాయిని డిఫెన్స్ అకాడమీలో చదివిస్తున్నాము. గతంలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉండేవి. ఇటీవల నియామకాలు తగ్గినట్టు కనిపిస్తోంది" అని తెలిపారు.

రికార్డుల్లో 'మిలటరీ' చేర్చాలని ప్రయత్నం

ప్రభుత్వ రికార్డుల్లో ఈ గ్రామం పేరు మాధవరంగా ఉంది. కానీ అందరూ మిలటరీ మాధవరం అని పిలుస్తారు. ఊర్లో కొన్ని బోర్డులపై కూడా అలానే రాసుకున్నారు. దాంతో అధికారికంగా గ్రామం పేరుకి ముందు మిలటరీ చేర్చాలనే ప్రయత్నం కూడా జరిగింది. అయితే రక్షణ దళాలతో ముడిపడిన అంశం కావడంతో దానికి అనుమతి రాలేదని మాజీ సర్పంచి పరిమళ తెలిపారు. అందరూ కోరుకుంటున్నప్పటికీ కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయని అధికారులు చెప్పినట్టు ఆమె వివరించారు. దాంతో వాడుకలో ఉన్న 'మిలటరీ’ మాధవరం రికార్డుల్లో మాత్రం సాధ్యం కాలేదు అని, ప్రభుత్వం దీనిని పరిశీలించాలని ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ కోరుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Madhavaram village of West Godavari district had given 2000 soldiers to the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X