అధికారం శాశ్వతం అనుకోవడం మూర్ఖత్వం: వైఎస్ షర్మిల చురకలు ఎవరికి: తెలంగాణ ప్రజల సేవకే
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ కేంద్రబిందువుగా మారారు. ఎవ్వరైనా ఎక్కడైనా.. రాజకీయ పార్టీ పెట్టొచ్చంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి..చర్చనీయాంశం అయ్యాయి. వైఎస్ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యల చుట్టూ ఏపీ, తెలంగాణల్లో పెద్ద ఎత్తున డిబేట్స్ నడుస్తోన్నాయి. దీనిపై వైఎస్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

పార్టీపై మరోసారి క్లారిటీ..
తన అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీలోనూ వైఎస్ఆర్టీపీని నెలకొల్పే అవకాశాలు లేకపోలేదంటూ మీడియాలో కథనాలు సైతం వెలువడుతోన్నాయి. ఈ పరిణామాల మధ్య వైఎస్ షర్మిల.. తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మరోసారి స్పష్టత ఇచ్చేే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్టీపీ తరఫున రూపొందించిన కొత్త సంవత్సరం క్యాలెండర్‌ను ఈ సాయంత్రం ఆమె ఆవిష్కరించారు.

పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో..
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ఏపీలోనూ వైఎస్ఆర్టీపీని విస్తరించే అవకాశాలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు విస్పష్టంగా సమాధానాలను ఇచ్చారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు.. ఇది వాస్తవమే కదా?..అదే కదా నేనూ చెప్పింది.. అని అన్నారు.

తెలంగాణతో ముడిపడి ఉందంటూ..
తన బతుకు తెలంగాణతో ముడిపడి ఉందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణ తనకు మెట్టినిల్లు అని పేర్కొన్నారు. తాను తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నానని, ఈ గడ్డ మీదే పిల్లలను కన్నాననీ అన్నారు. తెలంగాణలోనే జీవిస్తున్నానని గుర్తు చేశారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అమితంగా ప్రేమించిన తెలంగాణ ప్రజలకు.. ఆయన అమితంగా ప్రేమించిన తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికే వైఎస్ఆర్టీపీ పుట్టిందని చెప్పారు.

వైఎస్ఆర్టీపీని స్థాపించింది అందుకే..
వైఎస్ఆర్టీపీని స్థాపించింది తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికేనని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడటానికి, వారి తరఫున పోరాడటానికేనని అన్నారు. తెలంగాణ ప్రజలు అధికారాన్ని అందుకునే అవకాశాన్ని ఇచ్చిన రోజున..వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తానని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఎంత నమ్మకంగా సేవ చేశారో.. అంతే విశ్వాసంతో తానూ పని చేస్తానని అన్నారు.

అధికారం శాశ్వతం అనుకోవడం మూర్ఖత్వం..
అందుకే తెలంగాణలో పార్టీ పెట్టానని వైఎస్ షర్మిల వివరించారు. రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని ఆమె పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవాడు.. ఎప్పుడూ తానే అధికారంలో ఉంటానని అనుకోవడం మూర్ఖత్వం అవుతుందని విమర్శించారు. అధికారం అనేది శాశ్వతం కాదని చురకలు అంటించారు. అధికారం లేని వాడు.. తాను ఎప్పటికీ అధికారంలోకి రాలేను అనుకోవడం కూడా పొరపాటే అవుతుందని వైఎస్ షర్మిల చెప్పారు.

చురకలు ఎవరికి..?
అలా అనుకుంటే ఎప్పటికీ అధికారంలోకి రాలేమని వ్యాఖ్యానించారు. రాజకీయాలు అంటేనే ఎత్తుపళ్లాలు అని.. రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు.. నెవర్ సే నెవర్ అంటూ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అధికారంలో శాశ్వతం కాదంటూ వైఎస్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీసేలా కనిపిస్తోన్నాయి. ఆమె ఈ వ్యాఖ్యలను ఎవరిని ఉద్దేశించి చేశారనేది హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గురించే అనుకున్నా- ఏపీలో స్వయానా ఆమె అన్న వైఎస్ జగన్ సీఎంగా ఉండటం చర్చకు దారి తీసింది.