• search
  • Live TV
విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శ్రీకాకుళంలో విషాదం... సముద్రంలో బోటు బోల్తా... ముగ్గురు మత్స్యకారుల గల్లంతు...

|

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరగా... మరో ముగ్గురి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒడిశాలో బోటు కొనుక్కుని సముద్ర మార్గంలో తిరిగి వస్తుండగా... బారువ సమీపంలో అలల తాకిడికి బోటు బోల్తా పడినట్లు చెబుతున్నారు.

ఈ ఘటనలో క్షేమంగా ఒడ్డుకు చేరిన ముగ్గురు మత్స్యకారులను వంకా చిరంజీవులు, కొండా భీమారావు, తెలకల పాపారావుగా గుర్తించారు. స్వల్ప గాయాలతో ఉన్న వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైనవారి కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఎదురుచూస్తూ రోధిస్తున్నారు.

three fishermen drowned in the sea after boat capsize off

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.దీని ప్రభావంతో భావనపాడు, నౌపాడ ప్రాంతాల్లో పలు చెట్లు నేల కూలాయి. జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను అధికారులు నిలిపివేశారు.

గులాబ్ తుఫాన్‌పై ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్, విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సమీక్ష నిర్వహించారు. తుపాను తీరం దాటే సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలోని 15 మండలాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి అందజేస్తూ సీఎస్‌ అదిత్య నాథ్‌ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్, ఎనిమిది ఎస్టీఆర్ఎఫ్ బృందాలను, అధికారులు, సిబ్బందిని మోహరించారు.

తీరాన్ని తాకిన తుఫాన్ :

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుఫాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైంది.ఈ ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవనుంది. ప్రస్తుతం గులాబ్‌ తుఫాను కళింగపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది.

తుఫాన్ ప్రభావంతో ప్రస్తుతం తీర ప్రాంతంలో 75 కిలోమీటర్ల నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలుల వేగం క్రమంగా 95 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గోపాల్‌పూర్, కళింగపట్నం మధ్య తీరాన్ని తాకుతుందని తెలిపింది.

గులాబ్ తుఫాన్ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పనరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.ఇప్పటికే వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని 182 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 73 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఫిర్యాదులు,అత్యవసర సాయం కోసం కలెక్టరేట్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557,ఎస్పీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబర్ 6309990933లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

రెండు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ :

తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. గులాబ్ తుఫాను వల్ల పశ్చిమ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే హెచ్చరికలు చేసింది.ఈ క్రమంలో తొలుత ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ దాన్ని రెడ్ అలర్ట్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ ఒకరు వెల్లడించారు.

English summary
Six fishermen from Manchinillapeta village in Vajrapukottur mandal of Srikakulam district have drowned in the sea. Three of them reached the shore unharmed ... The search for the other three is currently underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X