వైసీపీలోకి ముగ్గురు మాజీ కేంద్రమంత్రులు ? ఒకేసారి టీడీపీ, బీజేపీలకు షాక్ తప్పదా ?
ఏపీలో కరోనాలోనూ వైసీపీలో చేరికల పర్వం నిరాటంకంగా సాగిపోతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీకి మద్దతు ప్రకటిస్తుండగా... తాజాగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరిపోయారు. త్వరలో మరో ముగ్గురు మాజీ కేంద్రమంత్రులు అదే బాట పట్టవచ్చని ప్రచారం సాగుతోంది. జిల్లాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే వీరి చేరిక లాంఛనమే అని తెలుస్తోంది.
మాజీ మంత్రి పీ నారాయణ దారెటు? వైసీపీ వైపా..బీజేపీలోకా: మేకపాటి మంత్రాంగం ఏం చెబుతోంది?

త్వరలో మరో భారీ ఆకర్ష్....
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నేతలను వైసీపీలోకి చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సీఎం జగన్... టీడీపీ, బీజేపీలోని సీనియర్లపై దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. వైసీపీలో వీరి చేరిక వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే వరుస చేరికలను ప్రోత్సహించడం ద్వారా విపక్ష టీడీపీ, బీజేపీలను పూర్తిగా నిర్వీర్వ్యం చేయాలన్న లక్ష్యం కనిపిస్తోంది. ఇదే కోవలో తాజాగా ఆయా పార్టీలకు చెందిన మాజీ మంత్రులపై వైసీపీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

త్వరలో ముగ్గురు మాజీ కేంద్రమంత్రులు...
గతంలో యూపీఏ హయాంలో ఓ వెలుగు వెలిసిన కేంద్రమంత్రులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, కావూరి సాంబశివరావులను వైసీపీలోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే మరో వారం రోజుల్లోనే వీరు వైసీపీలోకి చేరిపోవడం ఖాయమంటున్నారు. గతంలో వీరంతా సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంపీ పదవులు దక్కించుకుని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారే. వీరిలో కోట్ల మినహాయిస్తే మిగతా ఇద్దరికీ వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్నాయి.

వలస నేతలకు ఆఫర్స్ ఇవే...
ప్రస్తుతం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి టీడీపీలో ఉండగా.. కావూరి బీజేపీలో ఉన్నారు. వీరు ముగ్గురూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన వారే. వీరు గనక వైసీపీలోకి వస్తే నామినేటెడ్ పదవులు కానీ, టీడీడీ బోర్డు సభ్యత్వాలు కానీ ఆఫర్ చేసే అవకాశముందని చెబుతున్నారు. రాజ్యసభ సీట్లకు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. రాజ్యసభ కుదరకపోతే 2024 ఎన్నికల్లో ఎంపీ టికెట్లు ఇచ్చేలా హామీ ఇస్తారని కూడా చెబుతున్నారు. వైసీపీలో ఉంటే కేంద్రంలో బీజేపీతో కూడా సత్సంబంధాలు నెరిపే అవకాశం ఉండటంతో వీరు చేరికలకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ బాటలోనే జగన్...
2014 ఎన్నికల్లో తెలంగాణలో అత్తెసరు మెజారిటీతో విజయం సాధించిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన కేసీఆర్... దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. విపక్షాలను వీలైనంతగా బలహీనం చేయడం ద్వారా భవిష్యత్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలన్నదే దాని వెనుక ఉద్దేశం. సరిగ్గా ఇదే వ్యూహాన్ని జగన్ కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే విపక్ష పార్టీలో అంతగా బలం లేని నేతలను కూడా పార్టీలో చేర్చకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే భవిష్యత్తులో టీడీపీ, బీజేపీలకు మరిన్ని షాక్ లు తప్పవని అర్ధమవుతోంది.