సీఎం జగన్ పక్కా ప్లాన్: నిమ్మగడ్డ తొలగింపు వెనక ఏం జరిగింది..? చట్టం ఏం చెబుతోంది..?
అమరావతి: తమను ధిక్కరించిన వారి విషయంలో ఉపేక్షించేది లేదని సీఎం జగన్ మరోసారి తేల్చి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌నే తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు లేకుండా కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయడాన్ని ప్రభుత్వానికి రుచించలేదు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి నేరుగా గవర్నర్‌కు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌పై ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కమిషనర్‌పై విరుచుకుపడ్డారు.
నిమ్మగడ్డ లేఖ వివాదంపై కేంద్రం తేల్చేసింది: అందుకే భద్రత కల్పించాం : ఇప్పుడు జగన్ నిర్ణయమేంటి...!
చంద్రబాబు కోసమే ఇదంతా చేస్తున్నారంటూ సామాజిక వర్గం సైతం ప్రస్తావించారు సీఎం జగన్. ఆ నాటి నుంచే రమేష్ కుమార్‌ను ఎలాగైనా ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించకూడదని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీనికి సంబంధించి న్యాయపర అంశాలను లోతుగా అధ్యయనం చేసింది. కరోనా తీవ్రత కారణంగా ఆ అంశంపైనే ఫోకస్ పెట్టిన ప్రభుత్వం... రహస్యంగా రమేష్ కుమార్ ఉద్వాసన ప్రక్రియను పూర్తి చేసింది. అసలు రమేష్ కుమార్ తొలగింపు వెనక ఏం జరిగింది.. ప్రభుత్వ నిర్ణయం న్యాయపరంగా నిలుస్తుందా... రమేష్ కుమార్ ఏం చేయబోతున్నారు.

నాడే నిర్ణయం.. అంతా రహస్యం
కరోనా తీవ్రత రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదానికి గత నెల 27న ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది. అందులో మూడు నెలల కాలానికి బడ్జెట్‌ను ఆమోదించడంతో పాటు కరోనా చర్యలపైన చర్చ జరిగింది. కేబినెట్‌లో ఈ రెండు అంశాలపైనే చర్చ జరిగినట్లుగా బయటకు చెప్పారు. కానీ ఆ రోజే ఏపీ ఎన్నికల కమిషనర్ అర్హతలను మార్చాలని దాని ద్వారా నిమ్మగడ్డకు చెక్ పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అదే రోజు కేబినెట్‌లో ఆర్డినెన్స్ తెచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ సమావేశంలోనే ఆర్డినెన్స్ ఆమోదించినా విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. గవర్నర్ సీఎం భేటీల్లో అదే చర్చ.

గవర్నర్ భేటీలో సీఎం జగన్ ఏం చెప్పారు..?
కేబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్‌తో పాటుగా ప్రభుత్వం ఆమోదించినట్లుగా చెబుతున్న ఎన్నికల కమిషనర్ నియామక అర్హతల మార్పు ఆర్డినెన్స్‌ను సైతం గవర్నర్‌కు ప్రభుత్వం నివేదించింది. బడ్జెట్‌కు వెంటనే ఆమోదం తెలిపిన గవర్నర్ ఎన్నికల కమిషనర్ ఆర్డినెన్స్ పై మాత్రం వివరణ కోరినట్లు సమాచారం. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ వద్దకు వెళ్లారు. కరోనాపై చర్చకోసమని అంతా భావించారు. అయితే ముఖ్యమంత్రి తాము తీసుకున్న నిర్ణయం గురించి గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. ఆ సమయంలో ఆర్టికల్ 243 (k) ప్రకారం ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలు ,జీతభత్యాలు లాంటి వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం ద్వారా ఖరారు చేయవచ్చనే విషయాన్ని వివరించినట్లు తెలిసింది. ఆ ఆర్డినెన్స్‌లోనే ఏపీ ఎన్నికల కమిషనర్ అర్హత హైకోర్టు జడ్జి స్థాయికి కేటాయిస్తూ ఆర్డినెన్స్‌లో పేర్కొన్నట్లు స్పష్టమైన సమాచారం. దీంతో గవర్నర్ సైతం సీఎం వివరణ, న్యాయనిపుణుల అభిప్రాయంతో ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేశారు.

రహస్య జీవోలు.. ఇక లీగల్ వార్
గవర్నర్ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేయడంతో ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నియామక అర్హతలను సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ద్వారా ఎన్నికల కమిషనర్‌ను తాజా అర్హతల మేరకు నియమించుకునే అధికారం సంక్రమించింది. ఆ వెంటనే ప్రభుత్వం ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డను తప్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం న్యాయపరంగా చిక్కులకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటే హైకోర్టు జడ్జి అభిశంసన తరహాలోనే తొలగించాల్సి ఉంటుంది. పార్లమెంటులో మూడొంతుల మెజార్టీతో మాత్రమే అది సాధ్యమవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని రెట్రాస్పెక్టివ్‌గా పాత నిర్ణయాలకు వర్తింప చేయగలుగుతుందా లేదా అనేది ప్రధాన సంశయం. ఈ వ్యవహారం మీద న్యాయ పోరాటానికి నిమ్మగడ్డ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ఆయన తొలగింపు పై కోర్టు తుది నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. అప్పటివరకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయే అవకాశాలున్నాయి. ఇక ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ వార్ లీగల్ ఫైట్‌గా మారబోతోంది.