కొడాలి 100 తప్పలు కాస్తాం: జీవీఎల్ -జెరుసలేంకు భార్యతోనే వెళ్లారుగా: స్వామి -నాని కన్నీటిపర్యంతం
తిరుమలలో హిందువేతరుల డిక్లరేషన్ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్లపై దుమారం కొనసాగుతున్నది. డిక్లరేషన్ విధానం అవసరమా? అనే చర్చ జరగాల్సిందేనంటోన్న మంత్రి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను ప్రస్తావిస్తూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ శ్రేణులు, హిందూ సంస్థలు బుధవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను చేపట్టాయి. ఈ క్రమంలో పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుమల: మంత్రి కొడాలి నాని బిగ్ బాంబ్ - మోదీని భార్యతో వెళ్లమనండి - వీర్రాజుకు పదవి తర్వాతే దాడులు

కొడాలి కలియుగ శిశుపాలుడు..
ఏపీలో ఆలయాలపై దాడులు, తిరుమల డిక్లరేషన్ అంశంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, పీఠాధిపతులు సైతం మంత్రిని తప్పుపడుతున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మంత్రి అహంకారంతో దేవుళ్లను దూషిస్తూ, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ‘‘కొడాలి నాని కలియుగశిశుపాలుడు. వందసార్లు మోదీని దూషించే దాకా ఓపికపడతాం. చంద్రబాబులా జగన్ తన పతనాన్ని కోరి తెచ్చుకుంటారో, లేక తప్పులు గుర్తించి వెంటనే నానిని తొలగిస్తారో వేచి చూడాలి'' అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

అసలు నాని ఏమన్నారంటే..
డిక్లరేషన్ వివాదంపై టోన్ పెంచిన బీజేపీ, టీడీపీ నేతలు.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ తన సతీమణితో కూడా రావాలని డిమాండ్ చేయగా, మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అయోధ్య రామమందిరం శంకుస్థాపనకు ప్రధాని మోదీ భార్యతోనే కలిసి వెళ్లారా? ప్రతినిత్యం ఆలయాలకు వెళ్లే యోగి ఆదిత్యనాథ్ ఎవరిని వెంటపెట్టుకెళ్లాలి? భార్యభర్తలు కలిసే గుడికి వెళ్లాలంటే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ మాటేంటి? అసలు ఏ శాస్త్ర ప్రకారం బీజేపీ, టీడీపీ వాళ్లు విమర్శలు చేస్తున్నారు? అని మంత్రి ఎదురు ప్రశ్నించారు. సన్యాసి యోగి, చిన్నతనంలోనే కుటుంబాన్ని వదిలేసిన మోదీలను ఉద్దేశించి నాని అనుచితంగా మాట్లాడారని కాషాయశ్రేణులు మండిపడుతున్నాయి.
జగన్ జీ.. మీ వల్ల చాలా సంతోషం - వార్డు సచివాలయాలు భేష్ - ఏపీ సీఎంకు ప్రధాని మోదీ కితాబు

జెరుసలేంకు భార్యతోనే వెళ్లారుగా..
తాజా వివాదాలపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీ సైతం అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం పట్టువస్త్రాలు సమర్పించడంతో హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కనీసం తాను శారదపీఠం అధిపతి సమక్షంలో హిందువుగా మారానన్న విషయాన్నైనా సీఎం అంగీకరించాలి. జెరుసలేం కు వెళితే జగన్ తన భార్యాబిడ్డల్ని తీసుకెళతారు కాదా, వాళ్లు తిరుమలకు కూడా రావాలని అడగటంలో తప్పేముంది? కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఇతర మంత్రులు వెంటనే స్పందించాలి'' అని సరస్వతి స్వామి అన్నారు.

కన్నీరు పెట్టిన కొడాలి నాని..
డిక్లరేషన్ అంశంపై తాను చేసిన కామెంట్లపై దుమారం రేగుతుండటం, బీజేపీ, టీడీపీలు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటంపై మంత్రి కొడాలి నాని భావోద్వేగానికి గురయ్యారు. ఎవరైనా సరే నమ్మకం లేకుండా కొండపైకి రాలేరని, మతాలు వేరైనా మనసు మంచిదైతే అలాంటివాళ్లను ఏడుకొండలస్వామి అనుగ్రహిస్తారని నాని అన్నారు. ‘‘నాడు వైఎస్సార్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తే, నేడు ఆయన తనయుడు జనగ్ కు అంత గొప్ప అదృష్టం దక్కింది. దేవుడి దయ లేనిదే ఇలా జరగదు కదా. వైఎస్ కుటుంబంపై వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉన్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? అయినా ఎవరిచేత వస్త్రాలు పెట్టించుకోవాలో భగవంతుడికి తెలీదా?'' అంటూ నాని కన్నీళ్లు పెట్టుకున్నారు. మంగళవారం ఓ చానెల్ తో మాట్లాడుతూ నాని కన్నీటిపర్యంతమైన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. శ్రీవారి ఆశీస్సులతో జగన్ తాను నడిచే దారిలో చంద్రబాబు, బీజేపీ నేతల్ని నిమ్మకాల్ని నలిపేసినట్లుగా ముందుకు సాగుతారని మంత్రి వ్యాఖ్యానించారు.