Tirupati ఉపఎన్నిక: కమలం పార్టీలోకి ఆ హీరోయిన్స్.. రోజాను ఢీ కొట్టేందుకు బీజేపీ ప్లాన్..!
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు కులపరమైన రాజకీయాలే చూసిన ఏపీ ప్రజలు తాజాగా మతపరమైన రాజకీయాలను కూడా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల ధ్వంసం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే అంశం చుట్టూ ఏపీ రాజకీయాలు కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆలయాల ధ్వంసం అజెండాతోనే తిరుపుతి ఉపఎన్నిక కూడా జరగనుంది. ముఖ్యంగా బీజేపీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తిరుపతి ఉపఎన్నికలో సీటు గెలవాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాలను రచిస్తోంది. అంతేకాదు తిరుపతి ప్రచారంకు సినిమా గ్లామర్‌ను కూడా అద్దాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం వెండితెరపై ఒకప్పుడు తళుక్కుమన్న తారలను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు తెరవెనక నుంచి బీజేపీ చేస్తున్నట్లు సమాచారం

బీజేపీలోకి వాణీ విశ్వనాథ్, ప్రియా రామన్
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్లో సత్తా చాటిన బీజేపీ అదే జోష్‌ను ఏపీలో కూడా కొనసాగించాలని భావిస్తోంది. తిరుపతిలో ఉపఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో అలనాటి హీరోయిన్లను పార్టీలో చేర్చుకుని తిరుపతి ఉపఎన్నిక ప్రచార బాధ్యతలు వారికి కూడా అప్పగించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అప్పటి హీరోయిన్లు అయిన వాణీ విశ్వనాథ్, ప్రియారామన్‌లను రంగంలోకి దించేందుకు కమలనాథులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ నేతలు వారిద్దరిని చెన్నైలో కలిసి ఒప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

తిరుపతి ప్రచారం కోసం బరిలోకి హీరోయిన్లు
తిరుపతి ఉపఎన్నిక కోసం ఇప్పటి నుంచే బీజేపీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఆ పార్టీ నాయకులు కొన్ని రోజులుగా తిరుపతిలోనే టెంటు వేసుకుని పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా సొంత జిల్లా కావడంతో ఆమెకు ధీటుగా వాణీ విశ్వనాథ్, ప్రియా రామన్లను ప్రచార బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే వారిని ఏపీ బీజేపీ నాయకులు కలిసినట్లు సమాచారం. వారిని ఒప్పించి అధికారికంగా కాషాయం కండువా కప్పేందుకు ఏపీ బీజేపీ నాయకులు సిద్ధమైపోయారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. వెంటనే తిరుపతికి వెళ్లి ప్రచారం కూడా ప్రారంభించాలని నేతలు వాణీ విశ్వనాథ్, మరియు ప్రియా రామన్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

టీడీపీలో చేరాలని భావించిన వాణీ విశ్వనాథ్
ఇక 2019లోనే వాణీ విశ్వనాథ్ టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా కొనసాగింది. ఆ సమయంలో ఆమె విజయవాడలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు కూడా. రోజాపై నగరి నుంచి టీడీపీ తరపున వాణీ విశ్వనాథ్‌ను బరిలోకి దింపాలని టీడీపీ భావించింది. అయితే స్పష్టమైన హామీ రాకపోవడంతో వాణి విశ్వనాథ్ టీడీపీలో చేరలేదు. ఇక ఇప్పుడు తిరుపతి ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో వాణీ విశ్వనాథ్‌ను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఆ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోను జారవిడుచుకోవద్దని భావిస్తోంది. రోజాకు సరైన కౌంటర్ ఇచ్చేందుకు వాణీ విశ్వనాథ్, ప్రియా రామన్లను బరిలోకి దింపాలనే కృత నిశ్చయంతో కమలం పార్టీ ఉంది. ఇప్పటికే బీజేపీ నుంచి మరో మహిళా నేత సాదినేని యామిని ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతూ అధిష్టాన దృష్టిని ఆకట్టుకుంటున్నారు.

రోజాను ఢీ కొట్టగలరా..?
తిరుపతి ఉపఎన్నిక కోసం ఆ జిల్లాకే చెందిన మహిళా ఎమ్మెల్యే రోజాకు వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మామూలుగానే టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఇక ఉపఎన్నిక బాధ్యతలు అప్పగిస్తే ఓ ఆటఆడేసుకుంటుందని వైసీపీ భావిస్తోంది. అందుకే రోజాను అడ్డుకోవాలంటే మహిళా నేతలు దించాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే టీడీపీలో దివ్యవాణి ఉండగా ఆమె చేసే హంగామాతో టీడీపీ నాయకులే విసిగిపోతున్నారు. ఆమెవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని టీడీపీనే భావిస్తోంది. అయితే బీజేపీ ఒక్క అడుగు ముందుకు వేసి వాణీ విశ్వనాథ్‌ను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధం కాగా... వాణీ విశ్వనాథ్ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతుందా అనే అంశం కూడా కమలనాథులను కలవరపెడుతోంది.
యువ తార సందీప ధార్ బ్యూటిఫుల్ ఫోటోలు..

జనసేనకు బీజేపీ మళ్లీ హ్యాండిస్తోందా..?
తిరుపతి ఉపఎన్నిక ఈ సారి చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. తిరుపతి నుంచి బీజేపీనే బరిలోకి దిగుతుందనే సమాచారం ఢిల్లీ నుంచి వస్తోంది. అదే సమయంలో జనసేనకు ఈ సారి కూడా హ్యాండ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. తిరుపతి ఉపఎన్నికలో జనసేన పోటీ చేయాలని భావించింది. అంతే కాదు ఆ పార్టీ బలమైన కోరిక కూడా అదే. కానీ వారి ఆశలపై బీజేపీ మరోసారి నీళ్లు చల్లినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తిరుపతి ఉపఎన్నికల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం నిర్వహిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక తిరుపతి ఉపఎన్నిక నుంచి జనసేన దాదాపుగా తప్పుకున్నట్లు అనే ప్రచారం జరుగుతోంది. కేవలం ప్రచారం వరకు మాత్రమే జనసేన పరిమితం అయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి కమలం పార్టీలో కొత్త గ్లామర్ వస్తుండటంతో ఆ పార్టీలో జోష్ పెరుగుతోంది. మరి వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను వాణీ విశ్వనాథ్, ప్రియారామన్ ఏమేరకు నిలువరించగలరో వేచి చూడాల్సిందే.