బీజేపీ భారీ స్ట్రోక్: పవన్, జగన్‌కు షాక్ -దాసరికే తిరుపతి టికెట్! -పనబాకకు చంద్రబాబు ఝలక్?
ప్రాంతీయ పార్టీలే అధికారంలో కొనసాగుతోన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఖతమైపోవడం.. ఏపీలో టీడీపీ స్లోడౌన్ కావడంతో ఆ స్పేస్ కోసం బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏపీ, తెలంగాణలో పొలిటికల్ నెరేషన్లను వేటికవే భిన్నం అయినప్పటికీ.. దుబ్బాక ఫలితం, జీహెచ్ఎంసీ ఎన్నికల పోరాట నేపథ్యంలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఉంటుందని కమలనాథులు చెబుతున్నారు. బీజేపీని రాజకీయ ప్రత్యర్థిగా చూడకుండా ఇన్నాళ్లూ కేసీఆర్ చేసిన పొరపాటునే ఏపీలో జగన్ కూడా కొనసాగిస్తున్నారు కనుక తిరుపతిలో జరగబోయేది అన్ని పార్టీలకూ అనూహ్య పాఠం కానుంది. ఆ క్రమంలో..
షాకింగ్: ఆస్పత్రిలో ఎంపీ రఘురామ -గుండెలో బ్లాక్స్ -ముంబైలో చికిత్స -ప్రవీణ్, సాయిరెడ్డిపై ఫైర్

బరిలో బీజేపీనే..
నాలుగు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో వాటితోపాటే మూడు పార్లమెంట్ స్థానాల ఉప ఎన్నికలనూ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. కర్ణాటకలోని బెల్గాం, తమిళనాడులోని కన్యాకుమారి సీట్లతోపాటు ఏపీలోని తిరుపతి లోక్ సభ స్థానానికి అతి త్వరలోనే షెడ్యూల్ విడుదలకానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారాన్ని చేపట్టి ఏడాదిన్నర పూర్తయిన తర్వాత, ఏపీలో జరుగనున్న తొలి ఉప ఎన్నిక కావడంతో తిరుపతిపై అందరూ ఫోకస్ పెంచారు. పనబాక లక్ష్మిని తమ అభ్యర్థిగా టీడీపీ ఇప్పటికే ఖరారు చేయగా, వైసీపీ అభ్యర్థిగా ఫిజియోథెరపిస్టు గురుమూర్తి పేరును లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. ఇక, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీలో పడిగాపులు కాస్తోంటే, బీజేపీ మాత్రం తిరుపతిలో బరిలోకి దిగబోయేది తామేనని ప్రకటనలు చేస్తోంది. అంతేకాదు, అభ్యర్థిని కూడా..

మాజీ ఐఏఎస్‌కు బీజేపీ టికెట్
ఎస్సీ రిజర్వుడు స్థానమైన తిరుపతి లోక్ సభకు త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలో బీజేపీ తరఫున మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా కాలంగా బీజేపీలో క్రియాశీలక సభ్యుడిగా కొనసాగుతోన్న దాసరికి తిరుపతి టికెట్ హామీ ఈనాటిదేమీ కాదు. అయితే, గరిష్ట సానుకూలత లభించిన తర్వాతే ఆయన పేరును అధికారికంగా ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. ఆ సానుకూలతలను చక్క బెట్టే పని కోసం బీజేపీ తమ కీలక నేతలను ఇప్పటికే తిరుపతిలో మోహరించింది. ఏపీకి అన్యాయం చేసిన పార్టీలుగా కాంగ్రెస్ తో సమానంగా నిందలపాలైన, జనాగ్రహానికి గురైన బీజేపీ.. ఏ తిరుపతి సాక్షిగానైతే గతంలో ‘ఏపీకి ప్రత్యేక హోదా' ప్రకటన ద్వారా చేసిన రాజకీయ తప్పిదాలను మళ్లీ అదే తిరుపతి నుంచి సరిదిద్దుకుని, కొత్త పొలిటికల్ నెరేషన్ తో సాగాలని వ్యూహాలు పన్నుతోంది.

బీజేపీ-జనసేనకు అంత సీనుందా?
గత లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లొచ్చాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, జనసేనలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను రాబట్టుకోలేకపోయారు. అలాంటిది, తిరుపతి లోక్ సభ స్థానంపై బీజేపీగానీ, జనసేనగానీ ఆశలెలా పెట్టుకున్నాయి? పైగా, టికెట్ కోసం పవన్ కల్యాణ్ ఏకంగా ఢిల్లీ వెళ్లి లొల్లి చేయడమేంటని వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ మాదిరిగా ఏపీలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిన దాఖలాలు లేకున్నా, తిరుపతి కోసం పాకులాడుతోందంటే కచ్చితంగా లోపాయికారి ఒప్పందాలేవో జరిగి ఉండొచ్చని సాక్ష్యాత్తూ జగన్ మీడియానే ఆరోపిస్తున్నది. దుబ్బాకలో సోలిపేట కుటుంబానికి టికెట్ ఇవ్వడం ద్వారా టీఆర్ఎస్ కు భారీ నష్టం వాటిల్లగా, తిరుపతిలో వైసీపీ ఆ పొరపాటుకు తావు లేకుండా, సమర్థుడైన అభ్యర్థిని బరిలోకి దింపాలనుకుటుండటం కూడా ముందు చూపులో భాగమేనని తెలుస్తోంది.

పనబాకకు చంద్రబాబు షాక్
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించి 10 రోజులైనా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చర్చనీయాంశమైంది. తాను బీజేపీలో చేరాలనుకుంటుండగా, కనీసం మాటైన చెప్పకుండా టీడీపీ టికెట్ ఖరారు చేశారని పనబాక తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు వైసీపీ అనుకూల మీడియా కథనాల్లో పేర్కొన్నారు. పనబాకతో మాట్లాడేందుకు చంద్రబాబు.. సోమిరెడ్డిని రంగంలోకి దింపగా.. ఆమె కొన్ని డిమాండ్లను టీడీపీ హైకమాండ్ ముందుంచారని, వాటిని ఆమోదించాలా? వద్దా? అనే సందిగ్ధంలో చంద్రబాబు ఉన్నారనీ చెప్పారు. అంతటితో ఆగకుండా.. ప్రస్తుత పరిస్థితిలో వైసీపీని నిలువరించాలంటే బీజేపీకి సహకరించాలని చంద్రబాబు భావిస్తున్నారని, బీజేపీ అభ్యర్థిగా పనబాక కాకుండా, దాసరి శ్రీనివాసులు అయితే టీడీపీ మద్దతు ఇస్తుందనే లోపాయికారి ఒప్పందానికి ప్రయత్నిస్తున్నారని సదరు కథనాల్లో పేర్కొన్నారు. మరోవైపు..

తిరుపతిలో కీలక నేతల మకాం..
లోక్‌సభ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అసంతృప్తి నేతలకు గాలం వేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన విష్ణుకుమార్ రెడ్డి కొద్ది రోజులుగా తిరుపతిలోనే మకాం వేసి గరిష్ట సానుకూలత కోసం ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. టీడీపీలో కీలక నేతలుగా గుర్తింపు పొంది, గత ఏడాదిన్నర కాలంగా వివిధ కారణాలతో సైలెంట్ అయిపోయిన, ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తులతో విష్ణు వరుస మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తిరుపతిలో బీజేపీకి మద్దతిచ్చేలా లేదా పార్టీలనే చేరేలా అంగీకారం తెలిపిన నేతలతో తర్వాతి దశలోనే సోము వీర్రాజు కూడా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదేకాదు,

డాక్టర్ వర్సెస్ మాజీ ఐఏఎస్
తిరుపతి లోక్ సభ సీటు చాలా కాలంగా నాన్ లోకల్స్ కు కేరాఫ్ గా ఉండింది. దివంగత బల్లి దుర్గాప్రసాద్, అంతకు ముందు ఎంపీ వరప్రసాద్ లు ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందినవారే. అయితే, వైసీపీ అనుకూల మీడియా కథనమే నిజమై, టీడీపీ గనుక బీజేపీకి మద్దతిస్తే, 2020 ఉప ఎన్నిక మాత్రం ఇద్దరు స్థానికుల మధ్య పోటీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ ప్రాబబుల్ దాసరి శ్రీనివాసులు తిరుపతిలోనే పేరెన్నికగల సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దళిత వర్గాలకు చేదోడుగా ఉంటూనే, ఆలయాల అభివృద్ధికీ కృషి చేశారు. ఇక వైసీపీ ప్రాబబుల్ గురుమూర్తి స్వస్థలం.. తిరుపతి పార్లమెంట్ పరిధిలో భాగమైన శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్, ఏర్పేడు మండలం మన్నసముద్రం. తిరుపతి స్విమ్స్‌లోనే ఫిజియోథెరపీ పూర్తిచేసిన గురుమూర్తి స్థానికంగా ఉంటూ శ్రీసాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ మాజీ అధికారులు, ఉన్నత విద్యావంతులు తరచూ గెలుపొందే తిరుపతిలో ఈసారి పోరు రసవత్తం కానుంది.
చంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రం