Mohan Babu : పేర్ని ఫ్రెండ్- రాజకీయాలకు దూరం-చంద్రబాబు, జగన్ బంధువులే-మోహన్ బాబు కామెంట్స్
ఏపీలో టాలీవుడ్ సమస్యలపై వైసీపీ ప్రభుత్వంతో చర్చించే విషయంలో నెలకొన్న వివాదాలు టాలీవుడ్ ను ఇంకా వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా చిరంజీవి అండ్ కో సీఎం జగన్ తో భేటీ అయి చర్చలు జరిపి వెళ్లాక సినిమాటోగ్రోఫీ మంత్రి పేర్నినాని హైదరాబాద్ లో నటుడు మోహన్ బాబు ఇంటికెళ్లడం విమర్శలకు తావిచ్చింది. జగన్ తో టాలీవుడ్ చర్చల వివరాలు పేర్నినాని మోహన్ బాబుకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విమర్శలు వినపించాయి. దీనిపై ఇవాళ మోహన్ బాబు స్పందించారు.
పేర్నినానితో భేటీపై వస్తున్న విమర్శలపై స్పందించిన మోహన్ బాబు... ఆయన తనకు మంచి స్నేహితుడన్నారు. మంత్రి బొత్స కుమారుడి పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చిన మంత్రిని తాను ఇంటికి ఆహ్వానించానన్నారు. దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేయొద్దన్నారు. అలాగే చిరంజీవి టీమ్ జగన్ తో జరిపిన చర్చల వివరాలు కూడా తాను తెలుసుకోలేదన్నారు. పేర్నినానితో భేటీ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి మోహన్ బాబు తిరిగి అడుగుపెడతారన్న చర్చ జరుగుతోంది దీన్ని మోహన్ బాబు కొట్టిపారేశారు. తనకు ఆ ఉద్దేశం లేదన్నారు. సినిమాలు, విద్యాసంస్ధలు తప్ప మరో ఆలోచన లేదన్నారు. మరోవైపు సీఎంలు, గవర్నర్లు సైతం తన ఇంటికి అతిధులుగా వస్తారని మోహన్ బాబు వెల్లడించారు. అలాగే జగన్, చంద్రబాబు ఇద్దరూ తను బంధువులేనని, వారిద్దరి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశానన్నారు.

మరోవైపు మంత్రి పేర్నినాని, హైదరాబాద్ లో మోహన్ బాబు ఇంటికెళ్లి కలిసిన సందర్భంగా మాటల్లో తనను ఎవరూ వైఎస్ జగన్ తో భేటీకి ఆహ్వానించలేదన్నారు. అంతే కాదు ఈ విషయాన్ని నేరుగా జగన్ కు చెప్పాలని కూడా మంత్రి పేర్నినానికి ఆయన సూచించారు. దీంతో ఈ వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది.