జగన్ కు జంపింగ్ ఎమ్మెల్యేల చికాకు-ముందస్తు ఊహాగానాల వేళ-అడకత్తెరలో వంశీ, కరణం!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవాలన్న విషయంలో జగన్ పూర్తి క్లారిటీతో ఉండేవారు. ఇతర పార్టీల్లో నుంచి వైసీపీలోకి రావాలంటే తమ సొంత పార్టీకి రాజీనామా చేస్తే కానీ వైసీపీలోకి రానిచ్చేవారు కాదు. అలాంటిది అధికారంలోకి వచ్చాక ఏకంగా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో అనధికారికంగా చేరిపోయారు. ఇన్నాళ్లూ వైసీపీ ఎమ్మెల్యేలుగానే చెలామణి అయ్యారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో వారి పరిస్ధితి అగమ్యగోచరంగా మారిపోయింది.

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు
2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో విజయం సాధించిన తర్వాత ఆ పార్టీకి ఇతర పార్టీల నుంచి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎమ్మెల్యేలను ఆకర్షించాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే జగన్ మాత్రం అలా అనుకోలేదు. అప్పటికే 23 సీట్లకే పరిమితమైన విపక్ష టీడీపీని మరింత బలహీనం చేసే క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలను సొంత నియోజకవర్గాల్లో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
కేసుల భయంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేశ్ వైసీపీలోకి ఫిరాయించారు. కండువాలు మాత్రం కప్పుకోలేదు కానీ మిగతా అన్ని విషయాల్లోనూ వారు వైసీపీ ఎమ్మెల్యేలుగానే చెలామణి అవుతూ వస్తున్నారు.

ముందస్తు ఎన్నికల కలకలంతో
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వైసీపీ సిద్దపడుతోందన్న ఊహాగానాల నేపథ్యంలో ఇలా గతంలో వైసీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు అప్రమత్తమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయా నియోజవర్గాల్లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన లేదా వైసీపీని ముందునుంచీ అంటిపెట్టుకుని ఉన్న లేదా జగన్ హామీ ఇచ్చిన నేతలు తిరిగి గళం విప్పడం మొదలుపెట్టడమే. దీంతో సదరు ఎమ్మెల్యేలకు చికాకు మొదలైంది. అదే సమయంలో వారిని తిరిగి ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్లు ఇవ్వాలనుకుంటున్న పార్టీ అధిష్టానానికీ, జగన్ కూ తలనొప్పి మొదలైనట్లయింది.

గన్నవరంలో వంశీ, చీరాలలో కరణం
గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి అప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ పాత కాపులు దుట్టా రామచంద్రరావు వర్గంతో పాటు యార్లగడ్డ వెంకట్రావు వర్గంతోనూ పోరు మొదలైంది. ఈ పోరు కాస్తా ఇప్పుడు ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో మరింత ముదిరింది. దీంతో గన్నవరంలో వంశీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
నిన్న సీఎం జగన్ ఈ రెండు వర్గాల్ని పిలిపించి సజ్జలతో మాట్లాడించినా ఎలాంటి ఫలితం రాలేదు. అలాగే ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరఫున గెలిచిన కరణం బలరాం కూడా వైసీపీలోకి వచ్చాక ఎక్కువగా కనిపించడం లేదు. అయినా ఆయన నియోజకవర్గం చీరాలలో మాజీ ఎమ్మెల్యే అయిన వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ తో ఆయనకు పొసగడం లేదు. దీంతో ఆయన కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్ధితి. మధ్యలో సీఎం జగన్ జోక్యం చేసుకుని ఆమంచిని పర్చూరు పంపాలని భావించినా ఆయన మాత్రం చీరాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో కరణం వర్సెస్ ఆమంచి పోరు చీరాలలో కొనసాగుతోంది.

మళ్లీ టీడీపీ గూటికి వంశీ, కరణం ?
వైసీపీ గాలిని తట్టుకుని టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కరణం బలరాం, వల్లభనేని వంశీ ఇప్పుడు అదే పార్టీలో చేరినా ఉక్కిరిబిక్కిరి కాక తప్పడం లేదు. అదే సమయంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో వంశీతో పాటు కరణం కూడా పునరాలోచనలో పడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో తమకు ఇదే ప్రతిఘటన కొనసాగితే ఎన్నికల నాటికి తిరిగి తమ సొంత పార్టీ టీడీపీలోకి వీరిద్దరూ వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదని వారు అనుచరులు చెప్తున్నారు. దీంతో వంశీ, కరణం వ్యవహారాల్ని చక్కదిద్దేందుకు జగన్ వరుస భేటీలు ఏర్పాటు చేయిస్తున్నారు. చివరిగా తాను వీరిద్దరితో మాట్లాడి పరిస్దితుల్ని చక్కదిద్దాలని జగన్ భావిస్తున్నారు. ఇవేవీ ఫలించకపోతే మాత్రం వంశీ, కరణం తిరిగి సొంతగూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది.