భువనేశ్వర్ లో శ్రీవారి ఆలయం : కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు
ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వరలోని టిటిడి కళ్యాణ మండపం ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరి ఆలయాన్ని రూ 4.19 కోట్లతో నిర్మించేందుకు సంబంధించిన టెండర్లను టిటిడి పాలక వర్గం ఆమోదించింది. అన్నమయ్య భవన్ లో జరి గిన టిటిడి పాలన మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా టిటిడిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్..కాంట్రాక్టు ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ అందించాలని తీర్మానించారు. ఇక, నూతన బూందీ కాంప్లెక్స్ తో పాటుగా ఆవిలాల చెరువ సుందరీకరణ పనుల కోసం 42.71 కోట్ల రూపాయలతో టెండర్లను సమావేశంలో ఖరారు చేసారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టిటిడి కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. టిటిడి లో పని చేసే అన్ స్కిల్డ్ ఉద్యోగులకు 7, 500 నుండి గ్రేడ్ల వారీగా 11, 000 రూపాయల వరకు ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా..సెమీ స్కిల్డ్ ఉద్యోగులకు 9,500 రూపాయల నుండి 12 వేల వరకు ఇవ్వనున్నారు. ఇక, స్కిల్డ్ ఉద్యోగులకు 11 వేల రూపాయాల నుండి గ్రేడ్ల వారీగా 13 వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లా నారాయణవనం లోని శ్రీ అవనాక్షమ్మ వారి ఆలయం లో రూ. 2.50 కోట్ల తో ప్రాకారం, గోపురం, పోటు ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఆమోదించారు. తిరుమల బైపాస్ రోడ్డు లోని తుడా జంక్షన్ రోడ్డ వద్ద శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి గుర్తింపు కోసం రూ. 28 లక్షల వ్యవయంతో ఆర్చి నిర్మాణానికి పాలక వర్గం ఆమోద ముద్ర వేసింది.

తిరుమల లోని శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటుకు..సుందరీకరణ పనులకు రూ. 3.77 కోట్లతో చేపట్టబోయే పనులకు సంబంధించిన టెండర్లను సమావేశంలో ఆమోదించారు. తిరుమలలో బూందీ పోటు పక్కన నూతన బూందీ కాంప్లెక్స్ నిర్మించేందుకు రూ .21.75 కోట్లు మంజూరు చేసారు. ఆవిలాల చెరువు సుందరీకరణ లో భాగంగా మొదటి దశ లో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు రూ. 42.71 కోట్లతో టెండర్లకు ఆమోద ముద్ర వేసారు. ఒడిశా లోని భువనేశ్వర్ లో టిటిడి కళ్యాణ మండపం ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని రూ. 4.19 కోట్లతో నిర్మించేందుకు టెండర్ల ను పాలక మండలి సమావేశంలో ఖరారు చేసారు.