మనోభావాలు దెబ్బతిన్నాయ్- భూమనపై కేసు
TTD Goshala: ప్రపంచంలోనే అత్యంత పవిత్రక్షేత్రమైన తిరుమలలో వరుస అపచారాలు చోటుచేసుకుంటోండటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తిరుమల లడ్డూపై దుష్ప్రచారంతో ఆరంభమైన ఈ ఉదంతాలు.. చివరికి శ్రీవారి ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించేంత వరకు చేరాయంటూ మండిపడుతోంది.
తిరుపతి లడ్డూ కౌంటర్ల వద్ద తొక్కిసలాట, గోశాలలో గోవుల మృత్యువాత వంటి ఘటనలు సంభవిస్తోన్నాయని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యలో కొనసాగుతున్న గోశాలలో మూడు నెలల్లోనే వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయంటూ టీటీడీ పాలకమండలి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించడం మరింత కలకలం రేపింది. ఇది రాజకీయ రంగు పులుముకుంటోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత వరుసగా జరుగుతున్న ఈ గోమరణాలను టీటీడీ ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. దేశంలో గోవును అత్యంత పవిత్రమైన జంతువుగా హిందువులు పూజిస్తుంటారని, సకల దేవతల స్వరూపిణీ అయిన గోమాతకు టీటీడీ గోశాలలో దారుణమైన పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించడం, సవాల్ విసరడం.. ఈ ఉదంతం మొత్తం మరో మలుపు తిరగడానికి కారణమైంది. గోవుల మరణంపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించడానికి గోశాలకు రావాలంటూ సవాల్ విసిరారు పల్లా శ్రీనివాస్.
దీనికి స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వెళ్లడానికి సిద్ధపడినప్పటికీ- పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్‌లో ఉంచడం కలకలం రేపింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేశారాయన. పల్లా శ్రీనివాస్ విసిరిన సవాల్‌ను స్వీకరించి గోశాలకు వెళుతున్న తనను గృహనిర్భందం ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్థరాత్రి నుంచే తనతో పాటు తిరుపతి మేయర్, ఇతర వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్భందంలోకి తీసుకున్నారని భూమన ఆరోపించారు. 50 మందికి పైగా పోలీసులు, ముగ్గురు సీఐలు, చంద్రగిరి డీఎస్పీ కూడా తన ఇంటి వద్దే పోలీస్ పహారాలో ఉన్నారని విమర్శించారు.
ఈ వ్యవహారం మొత్తంపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, తిరుపతికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందినట్లు భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం, అర్థరహిత ఆరోపణలు చేశారని తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.
టీటీడీ గోశాలపై అసత్య ప్రచారం చేయడం ద్వారా కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని భానుప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై భారత న్యాయసంహిత లోని సెక్షన్లు 353 (1), 299, ఐటీ చట్టంలోని సెక్షన్ 74 కింద కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications