
Tirumala: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం - భక్తులకు శుభవార్త..!!
Tirumala Srivari Darshanam: ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో ఆదాయంలో రికార్డు కొనసాగుతోంది. వరుసగా 9వ నెలలోనూ శ్రీవారి హుండి ఆదాయం 100 కోట్ల మార్క్ దాటింది. ముగిసిన నవంబర్ నెలలో భక్తులు హుండీ కానుకగా శ్రీవారికి రూ 127.3 కోట్లు సమర్పించారు. మార్చి నెల నుంచి వరుసగా ప్రతీ నెలా శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్ల రూపాయలు దాటుతోంది. ఈ ఏడాది జూలై 4వ తేదీన శ్రీవారికి ఒక్క రోజులోనే అత్యధికంగా రూ 6.14 కోట్లు భక్తులు సమర్పించారు. జూలై నెలలో రూ 139.35 కోట్ల మేర శ్రీవారి హుండీకి ఆదాయం వచ్చింది.

వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు
వచ్చే నెలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఈ సారి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ సారి గతంలో అనుసరించిన విధానాన్నే కొనసాగిస్తూనే..మరింత ఎక్కువ సాధారణ భక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రోజుకు 25 వేలు చొప్పున 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. అదే విధంగా.. ఆన్లైన్ లో రోజుకు 50వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు తిరుపతిలో కౌంటర్ల ద్వారా మంజూరు చేయడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది.
గతం కంటే దర్శనం టికెట్ల పెంపు
హిందువులు వైకుంఠ ఏకాదశిని పవిత్రం భావిస్తారు ఈరోజున వైష్ణవ ఆలయాలకు భక్తులు పోతెట్టుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులు బారులు తీరటం సాధారణంగా ప్రతీ ఏటా కనిపిస్తుంది. గతంలో రోజుకు 20 వేల మందికి టికెట్లు జారీ చేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను రోజుకు 25వేలకు పెంచారు. పది రోజుల పాటు భక్తులు స్వామి వారిని దర్శించుకొనే వెసులుబాటు కలిగించారు. టికెట్లు ఉన్న వారినే దర్శనంకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేసారు. టికెట్లు లేని వారిని తిరుమలకు అనుమతించినా..దర్శనంకు మాత్రం అవకాశం ఉండదని స్పష్టం చేసారు. సర్వ దర్శనం టికెట్లు ఆఫ్ లైన్ లోనూ 50 వేల వరకు అందుబాటులో ఉంచుతామని చెబుతున్నారు.
