నిమ్మగడ్డ లీగల్ ఫైట్‌లో భారీ ట్విస్ట్: ఆ ఎన్నికలకు ఆయనే కొనసాగుతారా..? ఇరకాటంలో ప్రభుత్వం..?
విజయవాడ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టులో కొత్త వాదన తెరమీదకొచ్చింది. నిమ్మగడ్డ తొలగింపు సరైన విధానం కాదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపైన నిమ్మగడ్డతో పాటుగా కొత్తగా ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ కనగరాజ్ సైతం ఇంప్లీడ్ అయ్యారు. గతవారం వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసిన హైకోర్టు ఈ రోజు రెండు పక్షాల వాదనలు నేరుగా విన్నది. మరి కొంతమంది తమ వాదనలు వినిపించాల్సి ఉండటంతో రేపటికి కేసును వాయిదా వేసిన హైకోర్టు.. అదే సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వానికి ఇరకాటంగా మారినట్లు కనిపిస్తున్నాయి.
మళ్లీ తెరపైకి నిమ్మగడ్డ లేఖ: ఆ ముగ్గురిపైనే విజయసాయిరెడ్డి అనుమానం: విచారణ జరిపించాలంటూ..!

హైకోర్టు ఊహించని ట్విస్ట్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ను తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించిందో ఇప్పుడు హైకోర్టులో అదే అంశంపై సాగుతున్న వాదోపవాదనలు అంతే ఆసక్తికరంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికల సంఘంలో సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఎన్నికల కమిషనర్ పదవీ కాలం మూడేళ్లకు కుదించింది. కొత్తగా నియమితులయ్యే ఎన్నికల కమిషనర్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి అయి ఉండాలని నిర్దేశించింది. నేరుగా రమేష్ కుమార్‌ను తొలగిస్తున్నట్లుగా కాకుండా ఆయన పదవీకాలం ముగిసిందని కొత్త కమిషనర్‌గా రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించాలని జారీ చేసింది.

ఇంప్లీడ్ అయిన కొత్త కమిషనర్ కనగరాజ్
ఆసమయంలో పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఎన్నికల కమిషనర్ నియామక విధానాల్లో మార్పులు తెచ్చింది. ఆకస్మికంగా తమిళనాడుకు చెందిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జీవో జారీ అయిన గంటలోగానే కనగరాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డను తప్పించడంపైన పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిమ్మగడ్డను తప్పించిందని తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెల్లదంటూ 11 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఇదే కేసులో నిమ్మగడ్డతో పాటుగా కొత్త కమిషనర్ సైతం తమ వాదనలను కోర్టు ముందు నివేదించారు. వీటిపైన ఇప్పటిదాకా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసిన కోర్టు.. ఈరోజు ప్రత్యక్ష విచారణ నిర్వహించింది. ఆ సమయంలో కోర్టు చేసిన కామెంట్స్ ప్రభుత్వ వాదనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పిటిషనర్ తరపున న్యాయవాదులు చెబుతున్నారు.

మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డే ఉంటారా..?
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలు మార్పు చేసింది. దాని ద్వారా పరోక్షంగా నిమ్మగడ్డ పదవి నుంచి తప్పుకోవాలని సూచించింది. దీనిపైన ఈ రోజు కోర్టులో ఐదుగంటల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నియామకంలో అర్హతలు విధానాలు మార్చుకోవాలని ప్రస్తుత కమిషనర్ పదవీకాలం ముగిసిన తర్వాత మాత్రమే అవకాశం ఉంటుందని పిటీషనర్ తరపున న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వం చేస్తున్న వాదన సమంజసంగా లేదని వారు తెచ్చిన ఆర్డినెన్స్ ద్వారా రమేష్ కుమార్‌ను తొలగించలేరంటూ పిటిషనర్లు తరపున లాయర్లు వాదించారు. ఇదే సమయంలో కోర్టు చేసిన వ్యాఖ్య కీలకంగా మారింది. రాష్ట్రంలో జిల్లా పరిషత్ పంచాయతీలతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సైతం నోటిఫికేషన్ విడుదలైంది. రెండిటికీ సంబంధించిన షెడ్యూలు నోటిఫికేషన్‌ను నాడు ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమారే విడుదల చేశారు. ఆతర్వాత కరోనా కారణంగా ఎన్నికలను నిర్వహించలేమని యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఆరువారాల పాటు వాయిదా వేశారు.

కోర్టు వ్యాఖ్యలు ఏంటి..?
అయితే పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డను తప్పించిన విషయాన్ని కోర్టు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు సైతం జరుగుతున్న సమయంలో మున్సిపల్ ఎన్నికల ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురాలేదని, మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారా అంటూ హైకోర్టు ప్రశ్నించినట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని పిటిషనర్ల తరపున న్యాయవాదులు సైతం స్పష్టం చేస్తున్నారు. విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో న్యాయస్థానం చేసినట్లుగా చెబుతున్న ఈ వ్యాఖ్యలు ప్రభుత్వానికి న్యాయపోరాటంలో సంకట పరిస్థితులను కల్పిస్తున్నాయని పిటిషనర్ల తరపున న్యాయవాదుల అభిప్రాయం. మరి దీనిపై ప్రభుత్వం రేపు జరిగే వాదనల్లో తమ నిర్ణయాలను ఏరకంగా సమర్థించుకుంటుంది, కోర్టు ఏ రకమైన మార్గదర్శకం చేస్తుందనేది అటూ బ్యూరోక్రసీలోనూ ఇటు పొలిటికల్ గాను ఉత్కంఠ కలిగిస్తోంది.