జగన్ కు కరకట్ట సవాల్-రైతులే అండగా చంద్రబాబు గేమ్ ప్లాన్- 5 కోట్ల డిమాండ్ వెనుక?
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో అమరావతి వ్యవహారం ఎప్పుడూ ఆసక్తికరమే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిగా ఎంపికైన అమరావతికి మద్దతు పలికి, ఆ తర్వాత ప్లేటు మార్చిన వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. దీంతో అమరావతిలో భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ఇప్పుడు వాటిని సాకుగా చూపుతూ విజయవాడకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి కరకట్ట విస్తరణ కోసం భూముల్ని సేకరించేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు చెక్ పెడుతున్నట్లు తెలుస్దోంది.

ఉండవల్లి కరకట్ట విస్తరణ
విజయవాడ ప్రకాశం బ్యారేజీ పక్కన కృష్ణానదీ పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఉండవల్లి కరకట్టను విస్తరించాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. ఇందుకోసం రూ.150 కోట్ల రూపాయలతో ఓ భారీ ప్లాన్ రూపొందించింది. అయితే ఇక్కడ రైతుల నుంచి భూసేరరణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.
అయితే ఇక్కడ టీడీపీ హయాంలో భారీగా రేట్లు పలికిన భూముల్ని వదులుకునేందుకు రైతులు సిద్ధపడటం లేదు. మరోవైపు సీఆర్డీయే భూసేకరణ చేపట్టకుండానే కరకట్ట పనులు మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తే రైతులు అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక సీఆర్డీయే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది.

సీఆర్డీయే ఆఫర్ ఇదే
ఉండవల్లి కరకట్ట విస్తరణ కోసం తీసుకునే భూముల కోసం సీఆర్డీయే ఎకరాలకు రూ.2.5 కోట్లు ఇస్తామని ప్రతిపాదిస్తోంది. ఇందుకు అంగీకరించి రైతులు తమ భూముల్ని కరకట్ట విస్తరణ కోసం అప్పగించాల్సిందిగా కోరుతోంది. ఈ మేరకు భూసేకరణ నోటిపికేషన్ కూడా జారీ చేసింది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకూ భూసేకరణ కూడా లేకుండానే తమ పొలాల్ని ఆక్రమించుకునేందుకు సిద్ధమైన సీఆర్డీయే ఇప్పుడు తక్కువ రేట్లకు భూముల్ని కాజేయాలని చూస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.5 కోట్లు ఇవ్వాలని రైతుల డిమాండ్
ఉండవల్లి కరకట్ట విస్తరణ కోసం భూములు ఇవ్వాలంటే తమ పొలాల్లో ఎకరాకు రూ.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో రాజధానిగా ఎంపికైన అమరావతిలో భాగంగా ఉన్న తమ పొలాల్ని ఇప్పుడు సీఆర్డీయే కారు చౌకగా కాజేయాలని చూస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము కోరిన విధంగా ఎకరానికి రూ.5 కోట్లు ఇస్తేనే భూములిస్తామని రైతులంతా ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్డీయే కూడా ఆత్మరక్షణలో పడింది. ప్రభుత్వానికి రైతుల డిమాండ్ నివేదించేందుకు సిద్దమవుతోంది.

చంద్రబాబు గేమ్ ప్లాన్ ఫలిస్తుందా?
అమరావతిని రాజధాని స్ధానంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చాక ఉండవల్లి కరకట్టతో పాటు చుట్టు పక్కన ప్రాంతాల్లోనూ అన్ని పనులు నిలిచిపోయాయి. అంతకు ముందు ఈ కరకట్టపైనే ఉన్న ప్రజా వేదికను అక్రమ కట్టడమంటూ ప్రభుత్వం కూల్చివేసింది. ఇక మిగిలింది చంద్రబాబు ఇల్లును టార్గెట్ చేయడమే.
ఇప్పుడు చంద్రబాబు ఇల్లే లక్ష్యంగా ఉండవల్లి కరకట్ట విస్తరణకు వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని టీడీపీ అనుమానిస్తోంది. దీంతో స్ధానికంగా ఉన్న రైతులకు అండగా నిలుస్తోంది. వారు కూడా టీడీపీ మద్దతుతో సీఆర్డీయేను ఎకరానికి రూ.5 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరి దీన్ని అధిగమించి జగన్ కరకట్టను విస్తరిస్తారా లేక బలప్రయోగానికి సిద్ధపడి కోర్టుల దాకా తెచ్చుకుంటారా అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.