ఇస్లామిక్ ఉగ్రవాదశక్తులకు ఏపీ ప్రభుత్వం మద్దతు: కేంద్రమంత్రి మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా, ఆత్మకూరు ఘటనపై ఏపీ బీజేపీ సీరియస్ తీసుకుంది. దీనిని అంత తేలిగ్గా వదిలి పెట్టేది లేదని హెచ్చరిస్తోంది. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు జాతీయస్థాయి నేతలను రంగంలోకి దించుతోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కడప జైలులో ఉన్న బీజేపీ కర్నూలు జిల్లా నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఏపీ ప్రభుత్వం మద్దతిస్తోందని సంచలన ఆరోపించారు.

ఉగ్రవాదులకు జగన్ ప్రభుత్వం మద్దతు
రాష్ట్రంలో అక్రమాలకు కేరాఫ్ ఆడ్రస్‌గా జగన్ సర్కార్ మారిందని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అల్లర్లకు సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కడప జైలులో ఉన్న నంద్యాల పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇతర నేతలను కేంద్ర మంత్రి మురళీధరన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు. శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని మరళీధరన్ హెచ్చరించారు.

శ్రీకాంత్ రెడ్డిని చంపేందుకు కుట్ర
ఆత్మకూరు ఘటనలో తమ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డిని చంపేందుకు కుట్ర జరిగిందని కేంద్ర మంత్రి మురళీధరన్ ఆరోపించారు. పోలీసులే శ్రీకాంత్ రెడ్డిని రక్షించారని, అదే పోలీసులు శ్రీకాంత్‌రెడ్డిపై 307 సెక్షన్ కింద కేసు పెట్టారని ఆక్షేపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆత్మకూరులో బీజేపీ నేతలను కూడా అనుమతి ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులను మాత్రం ఇష్టాను సారంగా తిరుగుతున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన
రాష్ట్రంలో మూర్ఖత్వపు రాజకీయాలు ఆపాలని మురళీధరన్ విరుచుకుపడ్డారు. ఆత్మకూరు ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడులు జరిగాయన్నారు. జరుగుతున్న పరిణామాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. బీజేపీ నేతలను ఆత్మకూరు పర్యటనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలనకు కాలం దగ్గరపడిందని దుయ్యబట్టారు. పాలన పక్కన పెట్టి ప్రతిపక్షాలపై దాడులు చేయడమే లక్ష్యం వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.