వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యం హీరో: కిరణ్ రెడ్డి వర్సెస్ వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమైక్యవాదం ఛాంపియన్‌గా ముందుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రచ్చబండ కార్యక్రమంలో పనిగట్టుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గత రెండు రోజులుగా సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారు. కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చివరి వరకు ప్రయత్నాలు చేస్తానని చెబుతున్నారు. అవసరమైతే పదవీ త్యాగానికైనా సిద్ధపడుతానని ఆయన చెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనలకు అనుగుణంగానే రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యవహరిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని మించిన సమైక్యవాది లేరని, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను అడ్డుకుంటారని ఆయన చెప్పారు. సమైక్యవాదానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని, ఒక్కసారి కట్టుబడిన తర్వాత తన మాట తానే వినరని ఆయన అన్నారు.

Kiran Reddy vs YS Jagan

అదే రీతిలో కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యవాదం విషయంలో మంత్రి పార్థసారథి శనివారం ఒక్క మగాడిగా అభివర్ణించారు. కాంగ్రెసులోని విభజన వ్యతిరేకులు కిరణ్ కుమార్ రెడ్డిని నమ్ముకున్నట్లు కనిపిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్ వంటి మంత్రులు, సీమాంధ్ర శానససభ్యులు ఆయనతో నడవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. అదే సమయంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ గురించి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని, ప్రజల మద్దతు కావాలని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన అనివార్యమనే విషయాన్ని కాంగ్రెసు అధిష్టానం గట్టిగానే చెబుతోంది. 2014 ఎన్నికల లోపే తెలంగాణ ఏర్పడుతుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా చెప్పారు. ఈ స్థితిలో విభజనను కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకోగలరా అనేది ప్రశ్న. అయితే, ఆయన ఏం చేస్తారనేది మాత్రం వెల్లడి కావడం లేదు. ఆయన ఎవరి వద్ద తన అంతరంగాన్ని, తన భవిష్యత్తు కార్యక్రమాన్ని వెల్లడించడం లేదు.

అయితే, కిరణ్ కుమార్ రెడ్డికి పోటీగా పూర్తి స్థాయిలో సమైక్యవాదం ఛాంపియన్‌గా ముందుకు రావడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ఆయన తెలంగాణను వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఆయన సమైక్య శంఖారావం సభ నిర్వహించారు. దీక్ష చేపట్టారు. ఆయన సోదరి షర్మిల సమైక్య శంఖారావం యాత్ర చేపట్టగా, తల్లి వైయస్ విజయమ్మ సమైక్యం కోసం నిరాహార దీక్ష చేపట్టారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రస్తుతం జగన్ జాతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం ఆయన సిపిఐ, సిపిఎం నాయకులను కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఇతర జాతీయ పార్టీల నాయకులను కూడా కలిసేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూనే తన మీడియా ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారంటూ ప్రచారానికి పూనుకున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం వినిపిస్తూనే రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడానికి సహకరిస్తున్నారని జగన్‌కు చెందిన సాక్షి మీడియా శనివారం ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. విభజన ప్రక్రియను కిరణ్ రెడ్డి తుదిదశకు చేర్చారని వ్యాఖ్యానించింది. ఇంతకు ముందు హిట్ వికెట్ అంటూ ఆయనపై ఓ కథనాన్ని ఇచ్చింది.

కాగా, జగన్, కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు. చంద్రబాబు వల్లనే విభజన జరుగుతోందని వారు విమర్శిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి విభజనకు సహకరిస్తున్నారని వైయస్ జగన్ విమర్శలు చేస్తుంటే, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని వైయస్సార్ కాంగ్రెసు సూచించిందని కిరణ్ కుమార్ రెడ్డి తప్పు పడుతున్నారు.

మొత్తం మీద, సీమాంధ్ర ఛాంపియన్‌గా నిలిచేందుకు కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్ మధ్య పోరాటం తీవ్రంగానే జరుగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు జగన్‌ను కాంగ్రెసు దత్తపుత్రుడిగా అభివర్ణిస్తున్నారు. దత్తపుత్రుడి అండతోనే కాంగ్రెసు అధిష్టానం సొంత పార్టీని కూడా నాశనం చేస్తూ రాష్ట్ర విభజనకు పూనుకుందని లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులు విమర్శలు చేస్తున్నారు.

కాంగ్రెసు అధిష్టానం నాటకంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం వినిపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే, సమైక్యవాదం ఎజెండాతో సీమాంద్రలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసుకు అండగా నిలుస్తారా, జగన్ తోడ్పాటు ఇస్తారా అనేది చూడాల్సే ఉంది.

English summary
It is said that CM Kiran kumar Reddy and YSR Congress party president YS Jagan are competing to emerge as Seemandhra champoin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X