Unstoppable with NBK: పుష్ప స్పెషల్ ఎపిసోడ్‌కు బ్రేక్..అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్
అమరావతి: ప్రముఖ నటుడు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ యాంకర్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షో- అన్‌స్టాపబుల్. ఏ ముహూర్తంలో దీన్ని లాంచ్ చేశారో గానీ- అన్‌స్టాపబుల్ కాస్తా.. అన్నీ స్టాపబుల్‌గా తయారైంది. ఇదివరకు బాలకృష్ణ తన ఎడమ భుజానికి భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో కొంత బ్రేక్ పడింది. గ్రాండ్‌గా ప్రారంభమైన కొద్దిరోజులకే బ్రేక్ పడింది. కొంత విరామం తరువాత బాలకృష్ణ మళ్లీ సెట్లోకి అడుగు పెట్టారు. ఈ టాక్ షో గాడినపడింది.

అన్‌స్టాపబుల్‌లో స్పెషల్ ఎపిసోడ్.
ఇప్పుడు తాజాగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేలో ప్రసారం కావాల్సిన ప్రిస్టేజియస్ ఎపిసోడ్‌కు బ్రేక్ పడింది. క్రిస్మస్ పండగను పురస్కరించుకుని శనివారం ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కావాల్సి ఉంది. ఇప్పటికే దీని షూటింగ్ సైతం పూర్తయింది. అంతా సవ్యంగా ఉందనుకునే లోపే ఆ ఎపిసోడ్‌ను ప్రసారం చేయట్లేదని ఈ టాక్ షోను నిర్వహిస్తోన్న ఆహా యాజమాన్యం తెలిపింది. మళ్లీ ఎప్పుడు ప్రసారం చేస్తామనే విషయాన్ని వెల్లడించలేదు. ఫలితంగా- దీన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లేనని చెబుతున్నారు. కాకినాడలో నిర్వహించ తలపెట్టిన పుష్ప సక్సెస్ మీట్‌ను రద్దు చేసినట్లు నిర్మాతలు వెల్లడించిన కొద్ది సేపటికే ఈ ప్రకటన కూడా వెలువడింది.

విడుదలైన రోజు నుంచే..
అదే- పుష్ప స్పెషల్ ఎపిసోడ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక మందన జంటగా నటించిన సినిమా ఇది. సుకుమార్ దర్శకుడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో, చిత్తూరు జిల్లా యాసతో ఈ సినిమా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివైడెడ్ టాక్‌తో రన్ అవుతోంది. మూవీ విడుదలైన రోజే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. థియేటర్ల యాజమాన్యాలు బెనిఫిట్ షోను వేయకపోవడంతో అభిమానులు రచ్చరచ్చ చేశారు. చాలా చోట్ల థియేటర్ల అద్దాలను పగులగొట్టారు. లాఠీఛార్జీల వరకూ వెళ్లింది అప్పటి పరిస్థితులు.
షూటింగ్ ముగిసినా..
పుష్ప సినిమా డివైడెడ్ టాక్‌తో నడుస్తోండటంతో- దాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఆహా యాజమాన్యం ఈ పుష్ప స్పెషల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో మూడు రోజుల పాటు చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ ఎపిసోడ్‌ను శనివారం దీన్ని ప్రసారం చేయాల్సి ఉంది. ముందే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఎపిసోడ్‌ను ప్రసారం చేయట్లేదని స్పష్టం చేసింది. దీనికి గల కారణాలను వెల్లడించలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రసారం చేయట్లేదని స్పష్టం చేసింది.
బెటర్ అవుట్‌పుట్..
ఈ ఎపిసోడ్‌ను టెలికాస్ట్ చేయడంలో జాప్యం ఏర్పడిందని, మరింత బెటర్ అవుట్‌పుట్ కోసమే ఈ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది ఆహా యాజమాన్యం. ఎప్పుడు టెలికాస్ట్ చేస్తామనే విషయాన్ని వెల్లడించలేదు. కాగా- పుష్ప సినిమా సక్సెస్ మీట్ కూడా రద్దయింది. ఈ సాయంత్రం ఈ సక్సెస్ మీట్ కాకినాడలో నిర్వహించాల్సి ఉంది. దీన్ని రద్దు చేసినట్లు- ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. పుష్ప సినిమా విషయంలో ఒకేరోజు రెండు నెగెటివ్ వార్తలు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడం వల్లే కాకినాడ సక్సెస్ మీట్ రద్దయినట్లు చెబుతున్నారు.