ఎన్టీఆర్ జిల్లాపై జగన్ నిర్ణయంతో: నాడు చంద్రబాబు ధీమా - ఏమన్నారు : బయటపెట్టిన వంశీ..!!
ఏపీలో ఒక వైపు ఉద్యోగుల పీఆర్సీ వివాదం..సమ్మె బాటతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇదే సమయంలో కొత్త జిల్లాల ప్రతిపాదనల పైన అక్కడక్కడా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత వీటి పైన తుది నిర్ణయం తీసుకుంటామని..ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. కొత్త జిల్లాల నిర్ణయాల్లో భాగంగా... క్రిష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా టీడీపీని ఇరుకున పెట్టే వ్యూహం అమలు చేస్తోంది. దీని పైన తొలి రోజున టీడీపీ నేతలు ఎవరూ స్పందించలేదు.

జగన్ నిర్ణయంపై వ్యూహాత్మక మౌనం
ఆ తరువాత స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరు ఎన్టీఆర్ ను గౌరవించినా తాము స్వాగతిస్తామని చెప్పారు. అదే సమయంలో ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు ఎందుకు రద్దు చేసారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే, జగన్ పాదయాత్ర సమయంలో ఎన్టీఆర్ స్వగ్రామంలో పర్యటించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వస్తే క్రిష్ణా జిల్లా కు ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చారు. ఆ వెంటనే జగన్ హామీ పైన టీడీపీలో చర్చ జరిగింది.

నాడు జగన్ హమీ పైన చంద్రబాబు ఏమన్నారు
కానీ, జగన్ హామీ పైన నాడు చంద్రబాబు ఏ విధంగా స్పందించారు..ఆయన ధీమా ఏంటనే విషయాన్ని టీడీపీ వీడి వైసీపీకి మద్దతుగా కొనసాగుతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనని వంశీ బయట పెట్టారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రకటించటం జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా వంశీ అభివర్ణించారు. ఎన్టీఆర్ అభిమానులుగా తాము, టీడీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఎంతో ఆనందపడుతున్నారని తెలిపారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. నాడు... గుడివాడ నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేస్తూ అధికారంలోకి రాగానే ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించగానే... తాము ఆ అంశాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించామని గుర్తు చేసారు. కానీ, ఆ సమయంలో చంద్రబాబు రియాక్ట్ అయిన విధానం గురించి బయట పెట్టారు.

వైసీపీ అధికారంలోకి రాదంటూ
మీకు రాజకీయాలు తెలియవు, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాదు, ఏం చేయాలో నాకు తెలుసు అంటూ తమతో వాదించారని ప్రస్తావించారని గుర్తు చేసారు. వైసీపీ అధికారంలోకి రాదనే ధీమాతో చంద్రబాబు చివరి వరకు ఉన్నారనే విషయం ఆయన ప్రసంగాల్లోనూ వ్యక్తం అయింది. ఇక, ఇప్పడు 26 జిల్లాల విషయంలో టీడీపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని వంశీ ఫైర్ అయ్యారు.
సోషల్ మీడియా వేదికగా జిల్లాల పెంపు అంశంపై దుష్ప్రచారం చేస్తున్నారని వల్లభనేని వంశీ దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదని, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీడియాలో డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు పెట్టిస్తోందని విమర్శించారు.

ఈ నిర్ణయం సాహసోపేతమైనదంటూ
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో జిల్లాల పేర్ల గురించి టీడీపీ బోగస్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు ఒక్క జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. జిల్లాల పేర్లను టీడీపీ సోషల్ మీడియా వేదికగా రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు.
విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టటంతో వైసీపీ నేతలే ఎన్టీఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి..ఆ నిర్ణయానికి మరింత మద్దతు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ నిర్ణయం పైన అక్కడక్కడా కొన్ని భిన్న వాదనలు వినిపించినా... జగన్ నిర్ణయం మాత్రం ప్రస్తుతం బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.