వంగవీటి రాధా రెక్కీ ప్లాన్ బూమరాంగ్-కొడాలి నానికీ చుక్కెదురు-ఇప్పట్లో వైసీపీలో చేరిక లేనట్లే?
విజయవాడ రాజకీయాల్లో సంచలనం రేపిన వంగవీటి రాధా హత్యకు రెక్కీ ఆరోపణలు ఒట్టివేనని తేలిపోతున్నాయి. రాధా హత్యకు రెక్కీ ఆరోపణలు రాగానే వెంటనే భద్రత కల్పించి వైసీపీలోకి తెచ్చేందుకు మంత్రి కొడాలి వేసిన వ్యూహం కూడా ఫెయిలైంది. అంతిమంగా ఈ వ్యవహారంలో దేవినేని అవినాష్ అనుచరుడిపైకి ఎక్కుపెట్టిన బాణం కూడా పనిచేయకపోవడంతో ఇప్పుడు రాధా, కొడాలికి ఈ వ్యవహారంలో ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు.

రాధా రెక్కీ ఆరోపణలు
విజయవాడ రాజకీయాల్లో ఎప్పుడూ వార్తల్లో ఉండాలని భావించే టీడీపీ నేత వంగవీటి రాధా గతంలో తాను వదిలేసిన వైసీపీలోకి తిరిగి వస్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. అదే సమయంలో తన తండ్రి రంగా వర్ధంతి రోజు తన హత్యకు రెక్కీ నిర్వహించారనే ఆరోపణలు చేశారు. తద్వారా టీడీపీని వదిలి తిరిగి వైసీపీలోకి వెళ్లేందుకు రాధా రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది.
వైసీపీలోకి రాగానే ప్రస్తుతం విజయవాడ తూర్పు ఇన్ ఛార్జ్ గా ఉన్న దేవినేని అవినాష్ స్ధానంలో రాధాకు వచ్చే ఎన్నిక్లలో ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్లాన్ అంతా ఎదురుతిరిగినట్లు తెలుస్తోంది.

రాధా ప్లాన్ బూమరాంగ్
తన హత్యకు కొందరు రెక్కీ నిర్వహించారంటూ ఆరోపణలు చేయడం ద్వారా మరోసారి బెజవాడ రాజకీయాల్లో ఫోకస్ తనవైపు మళ్లించుకునేందుకు వంగవీటి రాధా ప్రయత్నించారు. అయితే ఇందుకు సాక్షాధారాల్ని మాత్రం బయటపెట్టలేకపోయారు. అలాగే ఇంత జరుగుతున్నా పోలీసులకు కనీసం ఫిర్యాదు కూడా చేయకపోవడంతో ఆయనపైనే అనుమానాలు ముసురుకున్నాయి.
మధ్యలో అవినాష్ అనుచరుడు అరవ సత్యం పేరుతో లీకులు ఇచ్చినా ఆయన ఆస్పత్రిలో చేరడంతో ఈ ప్లాన్ కూడా ఫలించలేదు. రెక్కీ ఆరోపణలు చేసి వారం దాటినా ఇప్పటివరకూ మిగతా విషయాలు బయటపెట్టకపోవడంతో రాజకీయ కారణాలతోనే ఈ ఆరోపణలు చేసినట్లు తేలిపోయింది. అలాగని రాజకీయంగా కూడా ఎత్తులు పారకపోవడంతో రాధా ప్లాన్ బూమరాంగ్ అయిందన్న ప్రచారం జరుగుతోంది.

కొడాలి ప్లాన్ బూమరాంగ్
రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్న మంత్రి కొడాలి నాని.. తన నియోజకవర్గం పరిధిలో రంగా విగ్రహం ఏర్పాటు చేయించి ఆయన వర్ధంతికి రాధాను ఆహ్వానించారు. రాధాను వైసీపీలోకి రప్పించేందుకు ఇంతకన్నా మంచి సమయం దొరకదని భావించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన రాధా.. కొడాలితో పాటు ఆయన మరో మిత్రుడు వంశీకి అంతుబట్టని విధంగా తన హత్యకు రెక్కీ జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో ఉలిక్కిపడ్డ కొడాలి వెంటనే తేరుకుని సీఎంతో మాట్లాడి భద్రత ఇప్పించారు. తద్వారా వైసీపీ ఆయనకు అనుకూలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ రాధా ఈ భద్రతను తిప్పి పంపారు. దీంతో కొడాలి ప్లాన్ కూడా బూమరాంగ్ అయింది.

అవినాష్ పై పనిచేయని కొడాలి ప్లాన్
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం దేవినేని అవినాష్ వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన మంత్రి కొడాలిపై గుడివాడలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అప్పటి నుంచి దేవినేని వారసుడిపై గుర్రుగా ఉన్న కొడాలి.... వంగవీటిని పార్టీలోకి రప్పించి విజయవాడ తూర్పు సీటు ఇప్పించి అవినాష్ ను డమ్మీని చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కొడాలి అనుకున్నట్లుగా రాధా వైసీపీలోకి రాకపోవడంతో ఆ ప్లాన్ కూడా బూమరాంగ్ అయింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో సేఫ్ గా మిగిలింది మాత్రం దేవినేని అవినాషే.