వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2004లో టి ఇస్తామన్లేదు, పద్ధతేది: సభలో ఏకేసిన వట్టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మంత్రి వట్టి వసంత్ కుమార్ శాసన సభలో ప్రసంగించారు. విభజన రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. విభజన జరిగితే సీమాంధ్ర అభివృద్ధికి ఐదు దశాబ్దాలు పడుతుందన్నారు. కేంద్రం విభజనపై ఎందుకు ముందుకెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. విభజించమని ఉత్తర ప్రదేశ్ తీర్మానం చేసినా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని, ఆంధ్ర ప్రదేశ్‌ను ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.

విభజనతో అన్ని రంగాలలో సీమాంధ్రకు అన్యాయమే అన్నారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా కేంద్రం దూకుడుగా వెళ్తోందన్నారు. సమైక్య రాష్ట్రంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని శ్రీకృష్ణ కమిటి చెప్పిందన్నారు. అసలు తీర్మానం లేకుండా విభజనపై ఎలా ముందుకెళ్తారని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి ఉన్న విదర్బ డిమాండును పట్టించుకోలేదని, తెలంగాణపై మాత్రం ముందుకెళ్తున్నారన్నారు.

Vatti Vasanth Kumar

తమను దోపిడీదారులు అనడం సరికాదన్నారు. తమను దోపిడీ దారులు అనడాన్ని శ్రీకృష్ణ కమిటీ తప్పు పట్టిందన్నారు. తాము లేదా తమ పూర్వీకులు చేసింది తప్పని నిరూపిస్తే సరిదిద్దుకుంటామన్నారు. తాను హైదరాబాదులో పుట్టి పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. తనకు హైదరాబాదులో ఎలాంటి ఆస్తులు లేవన్నారు. అయితే, ఇక్కడి నుండి అన్నీ వదులుకొని వెళ్లి పోవాలని చెప్పడమేమిటన్నారు.

హైదరాబాదే...

సమాఖ్య స్ఫూర్తిపై కేంద్రానికి గౌరవం లేనట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాదు చుట్టే ఉందన్నారు. విద్య, ఉపాధి అన్ని రాజధానిలోనే ఉన్నాయన్నారు. హైదరాబాదులో ఉన్న మౌలిక సదుపాయాలు కొత్త రాజధానిలో సాధ్యమా అని ప్రశ్నించారు. ఆదాయం, వనరుల అంశాలు బిల్లులో లేవన్నారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు కేంద్ర సంస్థలను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాదు నుండే 70 శాతం ఆదాయం వస్తుందని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. హైదరాబాదు ఆదాయం పంపిణీపై, కొత్త రాజధాని మౌలిక వసతులపై బిల్లులో ప్రస్తావించలేదని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఎలా సెంటిమెంట్ ఉందో తమకు కూడా సమైక్యాంధ్రపై అంతే సెంటిమెంట్ ఉందన్నారు. విభజన అంటే ఆంధ్రాలో పుట్టిన తనకే ఆవేదనగా ఉందని, ఇక సీమాంధ్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఎంత బాధ కలుగుతుందన్నారు.

మొదటి నుండి సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలే సమైక్యాంధ్ర కోసం పోరాడారన్నారు. అందరి మనోభావాలకు విరుద్ధంగా విభజన జరుగుతోందన్నారు. హైదరాబాద్ ఎపి రాజధాని కాబట్టే ఆర్థికంగా బాగా ఎదిగిందన్నారు. హైదరాబాదు కాకుండా ఇతర ప్రాంతాల్లో అమ్మకం పన్ను పదిహేను శాతమే ఉందన్నారు. సాఫ్టువేర్ తదితర రంగాల్లో హైదరాబాద్ ఎదిగిందన్నారు.

సినీ పరిశ్రమ కూడా హైదరాబాదులోనే కేంద్రీకృతమైందన్నారు. విభజన జరిగితే సీమాంధ్ర యాభై ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. రాజధాని కనుకే ఫార్మా సహా ఎన్నో సంస్థలు హైదరాబాదుకు వచ్చాయన్నారు. ఒక రాష్ట్ర ఆదాయాన్ని ఇంకో రాష్ట్రం పంచుకునే విధానం రాజ్యాంగంలో లేదన్నారు. హైదరాబాదు అభివృద్ధిలో సింహభాగం సీమాంధ్రదే, మన రాజధాని అనుకున్నారు కాబట్టే సీమాంధ్ర వ్యాపారులు పెట్టుబడులు పెట్టారన్నారు. కేంద్రం సీమాంధ్రపై ఎందుకు కక్ష కట్టిందో అర్థం కావడం లేదన్నారు.

నదీ జలాలు

విభజనతో నదీ జలాల సమస్య వస్తుందన్నారు. రాయలసీమ ఆంధ్రా పైన ఆధారపడవల్సి వస్తుందన్నారు. కర్నూలు నుండి ఏలూరు వరకు రైతులకు నీటి కష్టాలు తప్పవన్నారు. నదీ జలాల సమస్యను పరిష్కరించడం అంత సులువు కాదన్నారు.

తెలంగాణను ఆంధ్రా ప్రాంతంలో బలవంతంగా కలిపారని చెప్పడం సరికాదన్నారు. మొదటి ఎస్సార్సీ ప్రకారం భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. విభజన బిల్లుతో కోస్తాంధ్ర యాభై ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. బిల్లుపై తెలంగాణవాళ్లు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ బిల్లు చూస్తే కొత్త రాష్ట్రం ఎలా బతికి బయట కట్టుతుందో అర్థం కావడం లేదన్నారు. గత ఎన్నికల్లో 22 మందిని గెలిపించి ఇవ్వడమే మేం చేసినా పాపమా అన్నారు.

తెలంగాణపై అకస్మాత్తుగా, హఠాత్తుగా ఎలా రాజకీయ నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్రమంత్రివర్గం ఏ ప్రతిపాదనతో ఈ నిర్ణయం తీసుకుందన్నారు. విభజనపై నోట్ చదివి అభిప్రాయం చెబుతామని కేంద్రమంత్రివర్గంలో ఓ మంత్రి అంటే లెక్క చేయలేదని, నోట్ చదివినా చదవకపోయినా నిర్ణయం జరిగిపోయిందన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనకు శాసన సభ తీర్మానం అవసరమని అద్వానీ గతంలో చెప్పారన్నారు.

ప్రక్రియ తెలియదా?

2000లో సిడబ్ల్యూసిలో రెండో ఎస్సార్సీ తీర్మానం చేసిన కాంగ్రెసుకు ప్రక్రియ తెలియదా అన్నారు. 2009లో తెలంగాణ ప్రకటన చేసిన సమయంలోను చిదంబరం శాసన సభ తీర్మానం గురించి చెప్పారన్నారు. ఆర్టికల్ 3ను ఉఫయోగించినప్పుడు కేంద్రం సరైన ప్రాతిపదికతో ముందుకు పోవాలన్నారు. విభజన అంశాన్ని టేబుల్ ఐటంగా తీసుకొని హడావుడి చేశారన్నారు. ఆర్టికల్ 371 డి రద్దు లేదా రెండు రాష్ట్రాల్లో అమలుకు రాజ్యాంగ సవరణ అవసరమన్నారు.

కల్వకుంట్ల కవిత, పొన్నంపై ఆగ్రహం

కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కరీంనగర్ వస్తే హెలికాప్టర్ పేల్చుతామని చెప్పడం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత... ముఖ్యమంత్రి బ్యాటింగ్ చేయాలనుకుంటే తాము బంతులకు బదులు బాంబులు విసురుతామని చెప్పడమేమిటని ప్రశ్నించారు.

2004లో ఏం చెప్పామంటే..

2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తున్నామని, రెండో ఎస్సార్సీ వేస్తామని మాత్రమే చెప్పామన్నారు. తన అభిప్రాయాన్ని తాను రాతపూర్వకంగా సమర్పిస్తున్నానని చెప్పారు.

English summary
Seemandhra Minister Vatti Vasanth Kumar speech on Telangana Draft Bill in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X