కొండెక్కి కూర్చున్న కూరగాయలు, చికెన్ ధరలు; ఏం తిని బ్రతకాలి.. సామాన్యులకు పెద్ద కష్టం!!
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు, చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు కొండెక్కి కూర్చున్న ధరలతో ఎలా బ్రతకాలో అర్ధం కాక ఉసూరుమంటున్నారు.

విపరీతంగా పెరిగిన కూరగాయలు, చికెన్ ధరలు
ఎండాకాలం కావడంతో పంట దిగుబడి సరిగ్గా రాక కూరగాయలకు డిమాండ్ కు తగ్గ సప్లై జరగటం లేదు. దీంతో కూరగాయల ధరలు బాగా పెరిగాయి. మరోవైపు వివాహాది శుభకార్యాల నేపథ్యంలో డిమాండ్ కు తగ్గ సరఫరా లేక కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. పెళ్ళిళ్ళ సీజన్ కావటంతో వ్యాపారులు అమాంతం ధరలను పెంచేశారు. ఇంకా ఇదే కోవలో చికెన్ ధరలు కూడా విపరీతంగా పెరగడం సామాన్యులకు ఇబ్బందిగా మారింది. రోజురోజుకు పెరిగిపోతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

పెరిగిన ధరలతో సామాన్యుల బతుకు భారం
అసలే నిత్యావసర వస్తువుల ధరలు, వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగి సరకులు కొనాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు, పెరిగిపోయిన కూరగాయల ధరలు, చికెన్ ధరలతో మరింత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఓ పక్క పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, మరోపక్క విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్యులకు ఊపిరాడనివ్వడం లేదు. ఇవి సరిపోదన్నట్టు విపరీతంగా పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుల బతుకులు మరింత భారంగా మారుస్తున్నాయి.

విపరీతంగా పెరిగిన ధరలు... తాజా కూరగాయల ధరల పరిస్థితి ఇలా
ప్రస్తుతం టమాటా కిలో ధర 80 రూపాయలుగా ఉంది. కొన్ని ప్రాంతాలలో కిలో టమాటా ధర 100 రూపాయలుగా ఉంది. ఇక మిగతా కూరగాయలు క్యారెట్, బీరకాయలు 60 రూపాయలు, వంకాయ, కాకరకాయ వంటి కూరగాయలు 50 రూపాయల వరకు ఉన్నాయి. మునక్కాయలు కొనుగోలు చేసేలా లేవు. 20 రూపాయలకు 2 మునక్కాయలు ఇస్తున్నారు. ఇక నిమ్మకాయల ధర గతంలో ఎన్నడూ లేనివిధంగా విపరీతంగా పెరిగాయి. పది రూపాయలకు ఒక నిమ్మకాయ వస్తున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు.

చికెన్, గ్రుడ్లు, మటన్ ధరలకు రెక్కలు
అల్లం కిలో 300 రూపాయలకు చేరుకుంది. టమాటాలు కేవలం 15 రోజుల్లోనే 15 రూపాయల నుండి 100 రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఇదే కోవలో మటన్, చికెన్, కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం కిలో చికెన్ ధర మూడు వందల రూపాయలకు చేరుకుంది. కోడిగ్రుడ్ల ధర ఒక్కొక్క గ్రుడ్డుకు 5 రూపాయలుగా ఉంది. ఇక మటన్ ధరలు కిలోకి 800 రూపాయలుగా ఉంది. నిత్యం ఏం కూర వండుకోవాలి అనుకున్నా జనాలు ఆలోచించాల్సి వస్తుంది.

ధరల ఘాతాన్ని తట్టుకోలేక లబోదిబోమంటున్న సామాన్యులు
ఏప్రిల్ నెలలో ఇంతో అంతో కొనుగోలు చేసేలా ఉన్న కూరగాయల ధరలు మే నెల వచ్చే సరికి విపరీతంగా పెరగడం ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా పెరిగిపోతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు ప్రభుత్వాలు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ధరల ఘాతాన్ని తట్టుకోవడం తమ వల్ల కాదని లబోదిబోమంటున్నారు. కానీ ప్రజల ఇబ్బందులపై ఏ ప్రభుత్వాలు దృష్టి పెడుతున్న దాఖలాలు లేవు.