చిరు మూడో కన్ను, పురంధేశ్వరి ఇంటికి: వెంకయ్య
విశాఖపట్నం: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరును భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు ఎండగట్టారు. ఆయన విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన మోడీ ఫర్ పిఎం సభలో మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు రెండు కళ్లు అయితే మూడో కన్ను సినీ నటుడు, కేంద్రమంత్రి చిరంజీవని వెంకయ్య నాయుడు కొనియాడారు. ఈ విషయంలో పార్టీ వేరైనా చిరంజీవిని పొగడాల్సిందేనని అన్నారు.
రాష్ట్ర విభజన బిల్లును రాజ్యసభలో పెట్టిన సమయంలో చిరంజీవి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారని వెంకయ్య అన్నారు. తమకు సమాచారం ఇవ్వకుండానే కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను చేపట్టిందని చిరంజీవి అన్నారని గుర్తు చేశారు. కేంద్రం తన ప్రభుత్వంలోని మంత్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా, వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా విభజన ప్రక్రియ ప్రారంభించిందని వెంకయ్య నాయుడు ఆరోపించారు.

మరో సీమాంధ్ర కేంద్రమంత్రి పురంధేశ్వరి కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామా చేశారని, విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేసేలా చూడాలని తన ఇంటికి వచ్చి కోరారని వెంకయ్య నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రతిపక్షంలో కొనసాగుతున్న తనను కలిసి న్యాయం చేయాలని కోరడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన అన్నారు. అంటే కేంద్రం సొంత పార్టీ కేంద్రమంత్రుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వలేదనే విషయం తేలిపోయిందని అన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ ఎంపీలు సబ్బంహరి, ఉండవల్లి అరుణ్ కుమార్లు కూడా తనను కలిశారని చెప్పారు.
రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీనే విలన్ అని వెంకయ్య నాయుడు ఆరోపించారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రాజీనామాలు చేసి రజీ పడితే.. తాము మాత్రం సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగే వరకు పోరాడమని అన్నారు. విభజనతో పెద్ద ఘోరమేమి జరిగిపోలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో తెలుగువారు జీవిస్తున్నారని చెప్పారు.
సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది గానీ, వారికి ఏం చేస్తే మేలు జరుగుతుందో ఆలోచించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలుగు ప్రజలపై ప్రేమలేదని విమర్శించారు. రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు మూడు నెలలు ఉందనగా రాష్ట్ర విభజనను చేపట్టిందని ఆరోపించారు. తెలంగాణలో వెయ్యిమంది ప్రాణత్యాగాలు చేసిన సమయంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని విమర్శించారు.
బిజెపిని తెలంగాణకు వ్యతిరేకిగా ఆ ప్రాంతంలో, విభజనకు కారణమని సీమాంధ్రలో ప్రచారం చేస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం దగ్గరపడిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్కు పోయే కాలం దగ్గరపడిందని, కమ్యూనిజానికి కాలం చెల్లిందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీమాంధ్రకు న్యాయం చేయడంతోపాటు హైదరాబాద్లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలకు భద్రత కల్పిస్తామని చెప్పారు.
సీమాంధ్ర బిజెపి నాయకుడు హరిబాబు మంత్రి కాకపోయినా సీమాంధ్ర కు న్యాయం చేయాలని బిజెపి అగ్రనేత అద్వానీని కలిశారని చెప్పారు. కర్ణాటకలోని గుల్బార్గా శుక్రవారం జరిగిన బహిరంగ సభలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సీమాంధ్రులకు తాము న్యాయం చేస్తామని చెప్పారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ఆడిన మాట తప్పరని ఆయన అన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా, ప్యాకేజి తమ పోరాటం వల్లే వచ్చాయని వెంకయ్య నాయుడు తెలిపారు.