టిలో హంగ్, చంద్రబాబుదే: జగన్ బరితెగింపని వెంకయ్య
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బరితెగించి ఎన్నికల సమయంలో డబ్బులు పంచిందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు బుధవారం మండిపడ్డారు. సీమాంధ్రలో టిడిపి, బిజెపి కూటమిదే అధికారమన్నారు. తెలంగాణలో హంగ్ ఏర్పడవచ్చునని చెప్పారు.
బిజెపి తన మిత్ర పక్షాలతో కలసి 300 సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి కనిపించలేదని ఎద్దేవా చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రెండంకెల స్థాయిని కూడా చేరుకోలేదని, ఆ స్థాయి వైఫల్యానికి కారణమేంటో ఆ పార్టీ సమీక్షించుకోవాలన్నారు.

తమది మూడు సూత్రాల అజెండా అన్నారు. అభివృద్ధి సాధనే తమ లక్ష్యమని చెప్పారు. కోడ్ ఉల్లంఘన తర్వాత యూపీఏ తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తామన్నారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కేటాయింపుపై పార్టీలో నేతలంతా చర్చించిన తరువాతే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మీడియా కథనాలు ఊహాగానాలేనని, వాస్తవాలు కాదన్నారు.
కొన్ని పార్టీలు ఫలితాలు ప్రకటించక ముందే ప్రమాణ స్వీకారాన్ని ప్రకటించాయని విమర్శించారు. రాజకీయ నాయకులు ఎప్పుడైనా అహంకారంతో మాట్లాడవచ్చు కానీ మీడియా పోటీ కోసం సంచలనాల హెడ్డింగ్స్ కోసం ఏదో రాస్తుందని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
అభివృద్ధికే పట్టం: కంభంపాటి
సీమాంధ్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అందుకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని టిడిపి నేత కంభంపాటి రామ్మోహన్ రావు వేరుగా అన్నారు. సీమాంధ్ర నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్మారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా టిడిపి విజయం సాధిస్తుందని చెప్పారు. ప్రజలను ఎవరు ఎన్ని విధాలుగా మభ్య పెట్టినా, సర్వేలు ఎన్ని రకాలుగా వెల్లడించినా ప్రజలు తెలుగుదేశం వైపే ఉన్నారని, దీనికి కారణం టిడిపి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే అన్నారు.
తాజా ఎన్నికలు అభివృద్ధికి - అవినీతికి జరిగాయని, ప్రజలు అభివృద్ధి వైపే చూస్తున్నారని ఎన్నికల ఫలితాలబట్టి తెలుస్తుందని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 70 శాతం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 65 శాతం టీడీపీ కైవసం చేసుకుందని కంభంపాటి వెల్లడించారు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ ప్రధాని కావాలని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు.
మంచి భవిష్యత్తు కోసమే: సోమిరెడ్డి
ఉజ్వల భవిష్యత్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించారని సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వేరుగా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపికి మంచి విజయం లభించిందన్నారు. అలాగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా క్లీన్‌స్వీప్ చేస్తామన్నారు. కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు.












Click it and Unblock the Notifications