కరోనా కలిపింది ఇద్దిరనీ: జగన్కు చెక్ పెట్టాల్సిందే: కమలనాథులతో చంద్రబాబు వ్యూహాత్మకంగా..ఇలా..!
నాడు ప్రధాని మోడీ..నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. టీడీపీతో బీజేపీ తెగ తెంపుల తరువాత ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన సంబాషణ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ..బీజేపీ మధ్య పొత్తులో కీలక భూమిక పోషించిన వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయిన తరువాత ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన సాయం పైన మినహా మిగిలిన అంశాలకు దూరంగా ఉన్నారు.
ఇక, 2019 ఎన్నికల ముందు బీజేపీ..టీడీపీ మధ్య రాజకీయంగా గ్యాప్ రావటం..ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీడీపీ అధినేత కాంగ్రెస్ తో జతకలిసి దేశ వ్యాప్తంగా పర్యటనలు చేశారు. దీంతో.. వెంకయ్య నాయుడు పూర్తిగా చంద్రబాబుతో సంబంధాలు కట్ అయ్యాయి. ఇక, ఇప్పుడు కరోనా వేళ..ఉప రాష్ట్రపతి వెంకయ్యా నాయుడు తమ మాజీ స్నేహితుడికి ఫోన్ చేశారు. వారిద్దరి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఇవి కేవలం పలకరింపులకే పరిమితమా..లేక బీజేపీకి తిరిగి దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత మార్గంగా మలుచుకుంటారా అనే చర్చ సైతం మొదలైంది.
అందులో కోత విధించమని ఏ చట్టం చెబుతోంది: సీఎం జగన్కు చంద్రబాబు సూటి ప్రశ్న

నాటి మిత్రులు నేడు చర్చలు
చాలా కాలం తరువాత పాత మిత్రులు మంతనాలు సాగించారు. దాదాపు రెండేళ్ల విరామం తరువాత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..టీడీపీ చీఫ్ చంద్రబాబుతో ఫోన్ లో చర్చలు జరిపారు. ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా ముఖ్య నేతలతో కరోనా సమయంలో ఫోన్లు చేస్తూ వారి యోగ క్షేమాలు వాకబు చేస్తున్నారు. అయితే, చంద్రబాబు తనంతట తానుగా ప్రధానికి ఫోన్ చేశారు. ఆ సమయంలో మోడీ అందుబాటులో లేక పోవటంతో..మర్నాడు చంద్రబాబుకు తిరిగి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే బయటకు చెప్పుకున్నారు.

చంద్రబాబుకు వెంకయ్య మంతనాలు..
ఇక, ఇప్పుడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం గత కొన్ని రోజులుగా అన్ని రాష్ట్రాల్లోని రాజ్యసభ సభ్యులతోపాటు దేశంలోని ప్రముఖ నేతలు అందరితో మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఆయన తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కూడా మాట్లాడారు. చంద్రబాబుతో చర్చల సందర్భంగా ఏపీలో కరోనా సమస్యతోపాటు పలు అంశాలు చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘మిషన్ కనెక్ట్' పేరుతో రాజ్యసభ ఛైర్మన్ కూడా అయిన వెంకయ్యనాయుడు ఇఫ్పటికే దేశంలోని రాజ్యసభ సభ్యులు అందరితో మాట్లాడారు. రాజ్యసభ సభ్యులతోపాటు ఆయన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులతోనూ చర్చలు జరిపి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకుంటున్నారు.

చంద్రబాబుకు కలిసిరాని 2019
2019 ఎన్నికల ముందు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయితే, ప్రత్యేక హోదా కోసం అంటూ ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. ఏకంగా కాంగ్రెస్ తో జత కట్టి. .రాహుల్ తో కలిసి చంద్రబాబు దేశ వ్యాప్తంగా అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక, మోడీ ఓటమి ఖాయమని ప్రచారం చేశారు. ఎన్నికల్లో అక్కడ కేంద్రంలో..ఇటు ఏపీలోనూ ఫలితాలు తారుమారయ్యాయి. ఇక, అప్పటికే వైసీపీ..బీజేపీ మధ్య అనధికార పొత్తు నడుస్తోంది. కొద్ది నెలల క్రితం జనసేనతో ఏపీలో బీజేపీ పొత్తు పెట్టుకున్నా..అది పెద్దగా ఫలితాలు ఇవ్వటం లేదు.

బీజేపీతో దూరం అయ్యాక..తొలిసారి..
ఇదే మయంలో టీడీపీ అధినేత స్వరంలోనూ మార్పు కనిపిస్తోంది. బీజేపీతో సఖ్యత లేని కారణంగానే గత ఎన్నికల్లో నష్టపోయామనే భావన పార్టీ నేతల్లో ఉంది. దీంతో..టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లినా..చంద్రబాబు పెద్దగా రియాక్ట్ కాలేదు. ఇక, కొద్ది రోజుల నుండి పరోక్షంగా బీజేపీ నిర్ణయాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఏపీలో జగన్ ను దెబ్బ తీయాలంటే ముందుగా బీజేపీతో ఆయన సంబంధాలను దూరం చేయాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, ఢిల్లీ పెద్దల నుండి చంద్రబాబు పైన అంత సానుకూలత కనిపించటం లేదు. రాజకీయంగా ఏ అవకాశం వచ్చినా..తనకు అనుకూలంగా మలచుకోవటంలో దిట్ట అయిన చంద్రబాబు..ఇప్పటి పరిస్థితులను సైతం అదే విధంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీ ఢిల్లీలో రివర్స్.. ఏపీ నుండే పావులు
అయితే, ఏపీలో జగన్ పైన వ్యతిరేకత కారణంగా..కొందరు బీజేపీ నేతలు చంద్రబాబుకు పరోక్ష మద్దతిస్తున్నారనే వాదన ఉంది. కానీ, పార్టీ అధినాయకత్వం మాత్రం చంద్రబాబుతో తిరిగి స్నేహానికి సిద్దంగా లేదన్నది ఢిల్లీ సమాచారం. చంద్రబాబు ఆలోచనలను అంచనా వేస్తున్న జగన్ సైతం తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. జనసేన అధినేత పవన్ సైతం ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. ఆయన టీడీపీ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. బీజేపీతో కలిసి రాజకీయంగా సాగుదామని భావించినా..సమయం కలిసి రావటం లేదు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని పవన్ తన అడుగులు వేస్తున్నారు. ఇక, ఇప్పుడు తిరిగి బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాల కోసం చంద్రబాబు ప్రయత్నాలు మరింతగా సాగిస్తారని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో..కరోనా లాక్ డౌన్ తరువాత బీజేపీ కేంద్రంగా ఏపీలో టీడీపీ ..వైసీపీ రాజకీయ వ్యూహాలు పదునెక్కే అవకాశం కనిపిస్తోంది.