‘బాబే సీఎం’ అనే సినిమా తీసుకోండి: టీడీపీపై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'పచ్చ' మందకు పైత్యం బాగా ముదిరిపోయిందని నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా ఈ మేరకు టీడీపీపై తీవ్రంగా స్పందించారు.
''పచ్చ' మందకు పైత్యం బాగా ముదిరిపోయింది. ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయిందంట. వరల్డ్ మ్యాప్ లోంచి ఏపీ అదృశ్యమైందంట! 5 కోట్ల మంది వీళ్లకు మనుషుల్లా కనిపించడం లేదా? అధికారం పోగొట్టుకుని పొర్లిపొర్లి ఏడుస్తున్నారు. మా బాబే సీఎం అని గ్రాండ్‌గా ఒక సినిమా తీసుకుని మురిసిపోండి. వేరే మార్గం లేదు' అని అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, తెలుగుదేశం పార్టీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందిందని తమ్మినేని సీతారాం ఆరోపించారు. చంద్రబాబు ప్రజల విశ్వాసానని కోల్పోయారన్నారు. ఓటీఎస్‌పై టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే పట్టాలిస్తామంటున్న టీడీపీ నేతలు.. అధికారంలో ఉండగా కుంభకర్ణుడిలా నిద్రపోయారంటూ ఎద్దేవా చేశారు తమ్మినేని సీతారాం. ప్రతిపక్ష నేతలు సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు ఏపీ స్పీకర్.
ప్రజలే న్యాయ నిర్ణేతలు.. ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. అన్నీ ఫ్రీ అని చెప్పిన బాబును ప్రజలు తిరస్కరించారని తమ్మినేని సీతారాం అన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంచటం కసమే సంపూర్ణ హక్కు పథకం తీసుకొచ్చామని తమ్మినేని సీతారాం తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం మంచిది కాదని తమ్మినేని టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.