పవర్ పోయాక బీసీలకు పదవులిస్తే ఎవరూ నమ్మరు చంద్రబాబు .. విజయసాయి సెటైర్
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు టిడిపిని టార్గెట్ చేశారు. తాజాగా టిడిపి లో కీలకమైన సంస్థాగత పదవులు ప్రకటనపై ట్విట్టర్ వేదికగా బాబు పై సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి. అధికారులతో విర్రవీగిన రోజుల్లో చంద్రబాబు బీసీలను ఈసడించుకున్నారు అని, ఇప్పుడు అధికారం లేనప్పుడు బీసీలకు పార్టీ పదవులు ఇస్తే మాత్రం నమ్ముతారా అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా బీసీల అభివృద్ధిపై దృష్టి సారించని చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చుని వారిని తెగ ఉద్దరిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు .
మహిళల భద్రతపై చంద్రబాబు మాటలు .. దెయ్యాలు వేదాలు వల్లించినట్టే : విజయసాయి ఫైర్

అధికారంతో విర్రవీగిన రోజుల్లో బీసీలను ఈసడించి ఇప్పుడిలా ..
ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి అధికారంతో విర్రవీగిన రోజుల్లో అంతు చూస్తా, తోక కోస్తా అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరు నమ్మరు బాబు గారు అంటూ తాజాగా బీసీలకు పదవులిస్తే మాత్రం నిన్ను నమ్ముతున్నారనుకుంటున్నావా అన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు . విస్తరిలో వడ్డించినప్పుడు ఆకలి మంటలు గుర్తించాలి. వాటిని ఎత్తేసేటప్పుడు కాదు అంటూ చంద్రబాబుని టార్గెట్ చేసిన సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి.

భ్రమల్లో నుండి బయటకు రాడు... మిగతా వారిని భ్రష్టు పట్టించేదాకా వదలడు
అంతేకాదు తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అనే సామెత చక్కగా సరిపోతుంది అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గెలుపోటములు నిర్ణయించేది ప్రజలని, వారి విశ్వాసాన్ని కోల్పోతే ఏ వ్యవస్థ తనను దొడ్డిదారిన అధికార పీఠంపై కూర్చోబెట్టలేదు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి ఆయన భ్రమలో నుంచి బయటకు రాడు . మిగతా వారిని భ్రష్టు పట్టించేవరకు వదలడు అంటూ చంద్రబాబు భ్రమల్లో బ్రతుకుతూ ఉన్నారని, పార్టీలోని మిగతా నేతలను కూడా భ్రష్టు పట్టిస్తారని పోస్ట్ చేశారు.

జగన్ కు చంద్రబాబుకు చాలా తేడా
అంతకు ముందు పోస్ట్ లో చంద్రబాబుకు, వైయస్ జగన్మోహన్ రెడ్డి చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుతో బీసీలకు జగన్ సర్కార్ ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో వచ్చే డబ్బులు తమ ప్రభుత్వం ముట్టుకోదని సీఎం జగన్ ప్రకటించారని, అక్కడి ప్రతి పైసా ప్రజలకే చెందాలని పేర్కొన్నారని, సంస్థల సొమ్మును సొంత ప్రయోజనాలకు దారి మళ్లించిన బాబుకి, సంస్థలను స్వయంసమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయిస్తున్న జగన్ గారికి ఎంత తేడా అంటూ బాబుపై విమర్శలు గుప్పించారు.
ఏపీలో ప్రతిపక్షాలపై మాటల దాడి చేసే వారిలో మొదటి వరుసలో ఉంటారు విజయసాయి రెడ్డి . ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే సోషల్ మీడియాలో చెలరేగిపోతారు.