
చిదంబరం.. కర్మ బూమరాంగ్ అవుతుంది; అకృత్యాలకు మూల్యం తప్పదు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
సిబిఐ అధికారులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం ఇళ్లపై సోదాలు నిర్వహించిన ఘటన నేపథ్యంలో పలువురు చిదంబరం ను టార్గెట్ చేస్తున్నారు. అందులో ఏపీ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చిదంబరం పై సంచలన ఆరోపణలు చేశారు. చిదంబరాన్ని ఓ ఆర్థిక ఉగ్రవాదిగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఆయనను తక్షణం అరెస్టు చేయాలంటూ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.

ఆర్ధిక ఉగ్రవాది చిదంబరం..అకృత్యాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు
ట్విట్టర్ వేదికగా చిదంబరం ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు సంధించిన విజయసాయిరెడ్డి ఆర్థిక ఉగ్రవాది చిదంబరానికి అసలు నైతికత లేదని మండిపడ్డారు. లా కాలేజీలు చిదంబరాన్ని తమ కోర్సుల్లో కేస్ స్టడీగా పెట్టుకోవచ్చని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మనీలాండరింగ్ నుండి చైనీస్ పౌరులకు వీసా కోసం లంచం తీసుకోవడం వరకు, అతను క్యాబినెట్ మంత్రిగా తన అధికారాలను దుర్వినియోగం చేయడం ద్వారా ఐపీసీలోని అన్ని నేరాలకు పాల్పడ్డాడని మండిపడ్డారు. చిదంబరం చేసిన అకృత్యాలకు మూల్యం చెల్లించుకోవాల్సి సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

చిదంబరాన్ని తక్షణం అరెస్ట్ చెయ్యాలి
అంతేకాదు చిదంబరాన్ని తక్షణమే అరెస్టు చేసి, 2004-14 మధ్య కాలంలో ఆయన క్యాబినెట్ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు మరియు చర్యలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యర్థులపై కనికరం లేకుండా కేసులు బనాయించాడని మండిపడ్డారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది అని, కర్మ తిరిగి రివర్స్ కొడుతోందంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఏ విత్తు పాతితే ఆ పంటే వస్తుంది అంటూ సెటైర్లు వేశారు.

వైట్ కాలర్ నేరాలు, మోసం, పట్టపగలు దోపిడీలు చేసిన చిదంబరం
కేసులు తెరపైకి వస్తున్నందున, కోట్లాది డబ్బును అక్రమంగా కూడబెట్టేందుకు చిదంబరం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని స్పష్టమవుతోందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. వైట్ కాలర్ నేరాలు, మోసం, పట్టపగలు దోపిడీలు చేసి, ఆపై ఆర్థిక మరియు రాజకీయ సమస్యల గురించి మాట్లాడే ధైర్యాన్ని అతను ఎలా పొందాడో అర్థం చేసుకోలేకపోయాను అని పేర్కొన్న విజయసాయిరెడ్డి, చిదంబరం రాష్ట్రానికి శత్రువు. అతని చట్టవిరుద్ధమైన , నేరపూరిత చర్యలు ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించాయి అని వ్యాఖ్యానించారు.

పరారీలో ఉన్న మోసగాళ్ళకు చిదంబరం సహకారం
ధనవంతుల ఖర్చుతో పేదలపై భారం మోపాడు అని మండిపడ్డారు. ఇప్పుడు పరారీలో ఉన్న మోసగాళ్లకు ప్రభుత్వ బ్యాంకు లాకర్లను తెరిచారని ఆరోపించారు. చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో తెలిసిన ప్రతి స్కాంస్టర్తో రాజీ పడ్డాడని వ్యాఖ్యానించారు. దేశంలో పేదలు మరింత దరిద్రంలో కూరుకు పోయేలా చిదంబరం వ్యవహరించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

చిదంబరంతో పాటు కార్తీ చిదంబరం నివాసాలలో సీబీఐ సోదాలు
ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగై సహా దేశ వ్యాప్తంగా ఏడు చోట్ల సిబిఐ అధికారులు తనిఖీలు జరిపారు చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంపై నమోదైన కేసులకు సంబంధించిన వ్యవహారం భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది 2010 నుండి 2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణలున్నాయి కార్తీ చిదంబరం తన తండ్రి పి.చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 305 కోట్ల మేరకు విదేశీ నిధులు ఐఎన్ఎక్స్ మీడియా కు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియరెన్స్ కు సంబంధించిన కేసు తో సహా అనేక కేసుల్లో విచారణ జరుగుతుంది ఇక ఎఫ్ఐఆర్లో తన పేరు లేకున్నా సీబీఐ తన నివాసంలో సోదాలు చేపట్టిందని చిదంబరం మండిపడ్డారు. సిబిఐ సోదాలు చేపట్టిన సందర్భం, సమయం ఆసక్తికరంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.