విజయవాడలో బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్ల వీరంగం-పోలీస్, ఆర్పీఎఫ్ ఉమ్మడి పంజా-తనిఖీలు
విజయవాడలో రాత్రిపూట బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో పగటి పూట చైన్ స్నాచింగ్ లు కూడా పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు కొంతకాలంగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫలితం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ రైల్వే పోలీసులతో కలిసి నగర పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఇందులో నగర సీపీ కాంతి రాణా టాటాతో పాటు దక్షిణమధ్యరైల్వే సెక్యూరిటీ ఆఫీసర్ వలేశ్వర్ పాల్గొన్నారు.

విజయవాడలో పెరుగుతున్న నేరాలు
విజయవాడలో నేరాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా గతంతో పోలిస్తే కాల్ మనీ వంటి ఘటనలు తగ్గినట్లు కనిపిస్తున్నా మిగతా నేరాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలతో పాటు చైన్ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో మహిళలు రోడ్లపై తిరగాలంటే భయపడుతున్నారు. అలాగే రైల్వే ట్రాక్ ల పరిసర ప్రాంతాల్లో మాటువేసి ఉంటున్న నేరగాళ్లు ఎప్పుడేం చేస్తారో తెలియక జనం బెంబేలెత్తుతున్నారు. దీంతో వీరి ఆగడాలపై పోలీసులు మరోసారి దృష్టిసారించారు.

పోలీస్, రైల్వే జాయింట్ ఆపరేషన్
విజయవాడ నగర పరిధిలో అసాంఘిక శక్తులు,బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్ల కట్టడికి విజయవాడ పోలీస్, రైల్వే జీఆర్పీ జాయింట్ అపరేషన్ చేపట్టాయి. స్పెషల్ ట్రైన్లో ప్రత్యక్షంగా వెళ్లి రైల్వే స్టేషన్, ట్రాక్ పరిసర ప్రాంతాలను ఆర్పీయఫ్ డివిజనల్ రైల్వే సెక్యూరిటీ ఆఫీసర్ బీటీ వల్లేశ్వర్,నగర్ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా పరిశీలించారు. చైన్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలతో పాటు రైల్వే ట్రాక్ ల వెంట నిఘాను వీరు పరిశీలించారు. అనంతరం వీటిపై తీసుకోవాల్సిన చర్యలపై వారు దృష్టిసారించారు.

నేరాలపై ఇక ఉక్కుపాదం
రైల్వే ట్రాక్స్,లోకో షేడ్స్ ఆవాసాలుగా చేసుకొని నేరాలకు పాల్పడే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ లపై ఫోకస్ చేశామని నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. డీజీపీ ఆదేశాలతో రైల్వే పరిసర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నామన్నారు. నేరాలకు పాల్పడుతున్న రైల్వేస్టేషన్ పరిధిలో మొత్తం 15 ప్రాంతాలను గుర్తించామని సీపీ తెలిపారు. మద్యం,గంజాయి సేవిస్తూ దొంగతనాలకు పాల్పడే వారిపై ఇకపై ఉక్కు పాదం మోపుతామన్నారు.
రైల్వే పోలీసులకు అదనంగా నగర పోలీసు సిబ్బందిని అదనంగా ఇస్తామని సీపీ వెల్లడించారు. నేరాల కట్టడికి ఇకపై జియర్పితో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లను అరికట్టడం లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైల్వే ట్రాక్స్ పరిసర ప్రాంతాల్లో ఇకపై రైల్వే పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేయబోతున్నట్లు సీపీ టాటా వెల్లడించారు. అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపుతామన్నారు. స్టేషన్ పరిసరాల్లో రైల్వే పోలీసుల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మరోవైపు ప్రయాణికులు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై రైల్వే యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్స్ పరిసర ప్రాంతాల్లో ఇకపై కంబైన్డ్ ప్లాన్ ప్రిపేర్ చేయబోతున్నామన్నారు. లోకో షెడ్ తో పాటు ట్రాక్స్ వెంబడి గస్తీ పెంచామన్నారు.