వైసీపీకి వాసుపల్లి గణేశ్ షాక్-విశాఖ దక్షిణ ఇన్ ఛార్జ్ పదవికి గుడ్ బై-మళ్లీ టీడీపీకి వెళ్లిపోతారా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఫిరాయించారు. వీరిలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యేవాసుపల్లి గణేశ్ కూడా ఒకరు. అయితే కొంతకాలంగా వైసీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్న గణేశ్.. ఇవాళ వైసీపీ ఇచ్చిన విశాఖ దక్షిణ వైసీపీ ఇన్ ఛార్జ్ పదవికి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు పార్టీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డికి ఓ లేఖ రాశారు.
గతంలో కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్నప్పుడు తాను ఎలా పనిచేశానో, ఆ తర్వాత వైసీపీ పాలనలో జగన్ పనితీరు నచ్చి ఎలా పార్టీలో చేరానన్న విషయాల్ని సుబ్బారెడ్డికి లేఖలో వివరించారు. తాజాగా వైవీ సుబ్బారెడ్డి విశాఖకు వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఈ లేఖలో పలు విషయాలు చెప్పారు. సుబ్బారెడ్డి పర్యటన సందర్భంా తనకు శల్య పరీక్ష పెట్టడం, బల పరీక్షపెట్టడం సరికాదని వాసువల్లి గణేశ్ తెలిపారు. ఇది తన గౌరవానికి భంగం కలిగించినట్లుందని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో విశాఖ దక్షణ నియోజకవర్గం వైసిపి సమన్వయ కర్త స్థానం నుంచి వైదొలగినట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రకటించారు. టీడీపీలో తనను గౌరవముతో చూసుకున్నారని, కానీ జగన్ సంక్షేమ పథకాలు అమలు చూసి వైసిపి లో పని చెశానని లేఖలో గణేశ్ గుర్తుచేశారు. కానీ ఈ అవమానం భరించలేక సమన్వయ కర్తగా తప్పుకుంటున్నట్లు వాసుపల్లి తన లేఖలో సుబ్బారెడ్డికి వివరించారు. ఇఫ్పటికే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వంశీ, కరణం వంటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ కు ఇది మరో సమస్య కానుంది.