• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జనసేన-బీజేపీ అభ్యర్థులను మద్దతివ్వండి, ఇక వైసీపీ దాష్టీకానికి ముగింపే: పవన్ కళ్యాణ్

|

అమరావతి: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసం 2014లో జనసేన పార్టీ స్థాపించానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. వేలకోట్లు, కులబలం ఉంటే తప్ప రాజకీయాలు చేయలేని పరిస్థితుల్లో... స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ నిరతిని స్ఫూర్తిగా తీసుకొని పార్టీని పెట్టడం జరిగిందన్నారు. సైద్ధాంతిక బలంతో, డబ్బు ప్రమేయం లేని, కులమతాల ప్రస్తావన లేని రాజకీయం రావాలనే ఉన్నతమైన ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.

భయపడే వైసీపీ దాడులు

భయపడే వైసీపీ దాడులు

మార్చి 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 27 శాతం ఓట్లను కైవసం చేసుకున్నాం. వందల సంఖ్యలో సర్పంచులు, అంతకుమించి ఉప సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నాం. పోటీ చేసిన 85 శాతం పంచాయతీల్లో దాదాపు 65 శాతం పంచాయతీల్లో ద్వితీయ స్థానానికి రావడం మార్పుకు సంకేతం. ఈ మార్పును చూసి ఓర్వలేకే, భయపడి వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను సమర్ధవంతంగా ఎలా ఎదుర్కోవాలో బాగా తెలిసిన వాళ్లం. రాజకీయాల్లో మార్పు రావాలని పార్టీ పెట్టారు... మీరు కోరుకునే మార్పు జరుగుతుందా? అని చాలా మంది అడి... నేను కోరుకునే మార్పు పంచాయతీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది' పవన్ అన్నారు.

బెదరింపులు, రక్తపాతం.. ఇదీ వైసీపీ దాష్టీకం: పవన్ కళ్యాణ్

బెదరింపులు, రక్తపాతం.. ఇదీ వైసీపీ దాష్టీకం: పవన్ కళ్యాణ్

12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎలాంటి దాష్టీకానికి పాల్పడ్డారో... దానికి పదింతల బీభత్సం మున్సిపల్ ఎన్నికల్లో సృష్టించారు. ప్రత్యర్ధులను నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదు. భయపెట్టారు, దాడులకు పాల్పడ్డారు. వీళ్ల ధాటికి కాకలు తీరిన రాజకీయ పార్టీలు సైతం నిలబడలేకపోయాయి. జనసేన అభ్యర్ధులను బెదిరించినా ఎదురొడ్డి ఎన్నికల బరిలో నిలబడ్డారు. వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి, యుద్ధం చేయగల రక్తం జనసైనికులది. ఆ యువ రక్తమే ఈ రోజు మున్సిపల్ ఎన్నికల బరిలో ఎన్ని బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనా నిలబడ్డారు. అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం... ఇవాళ ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్ముకునే పరిస్థితికి దిగజారింది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్ధులు నిలబడితే బెదిరింపులు.. కిడ్నాప్ లు.. ఎదురు తిరిగితే దాడులు... రక్తపాతం. వైసీపీని ఇలానే వదిలేస్తే వీళ్ళు ఇంకా పేట్రేగిపోతారు. ఎదిరించే వ్యక్తులు లేకపోతే వీళ్ల దాష్టీకానికి అంతు లేకుండాపోతుందన్నారు జనసేనాని.

మోడీ నాయకత్వంలోని పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

మోడీ నాయకత్వంలోని పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నడిచే భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ సంయుక్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. విభజన అనంతరం దిశానిర్దేశం లేకుండా పోయిన రాష్ట్రానికి మార్పు రావాలనే సంకల్పంతో ఈ కలయిక జరిగింది. రాష్ట్రంలో వైసీపీ దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచిపోరాడుతున్నాం. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం వచ్చాం. జనసేన, బీజేపీ పార్టీల ఆలోచన విధానంతో ప్రభుత్వాన్ని అతి త్వరలో స్థాపిస్తామనన్నారు పవన్ కళ్యాణ్.

చొక్కా పట్టుకొని నిలదీసే హక్కు మనకుంది

చొక్కా పట్టుకొని నిలదీసే హక్కు మనకుంది

సత్తెనపల్లి నియోజకవర్గం దుమ్మాలపాడు గ్రామంలో వైసీపీ అభ్యర్ధి డబ్బుల పంపిణీని అడ్డుకున్నాడని జనసేన కార్యకర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పాలకొల్లు నియోజకవర్గం ఏనుగువానిలంక గ్రామంలో విజయ్ భాస్కర్ అనే జనసైనికుడిపై స్థానిక వైసీపీ నాయకుడు ఇంటికెళ్లి విచక్షణారహితంగా కొట్టినా గానీ మేము నిలబడే ఉన్నాం. కారణం మార్పు రావాలనే బలమైన సంకల్పం. సమాజంలో మార్పు రావాలని కంకణం కట్టుకున్న యువ సమూహం జనసేన పార్టీ వైపు చాలా బలంగా ఉంది. అమలాపురంలో 80 ఏళ్ల బామ్మ.. మతి ముత్యాల మణి కుమారి జనసేన పార్టీకి అండగా నిలబడ్డారు. వైసీపీ దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలబడే సమూహం కావాలి. అందుకే జనసేన పార్టీ తరపున నా వంతు కృషి నేను చేస్తున్నానని ఆవిడ చెప్పారు. బామ్మగారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు పవన్.

పెన్షన్లు ఆపడానికి మీరెవరు?

పెన్షన్లు ఆపడానికి మీరెవరు?

నరసరావుపేట నియోజకవర్గం పమిడిపాడు గ్రామంలో జనసేన పార్టీ తరపున ముస్లిం మైనార్టీ మహిళ మతి గౌసియా బేగం సర్పంచ్ గా గెలుపొందారు. గెలుపును ఓర్వలేక స్థానిక వైసీపీ నాయకులు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి 150 మంది వృద్ధుల పెన్షన్లు రాకుండా ఆపేశారు. వైసీపీ నాయకులకు ఎదురొడ్డి ఎవరూ పోరాటం చేసినా వాళ్లకు పెన్షన్లు, సంక్షేమ పథకాలు ఆపేసే పరిస్థితి. వైసీపీ నాయకులు గుర్తించుకోవాల్సింది మీకు మద్దతు తెలిపింది కేవలం 40 శాతం మంది ప్రజలే. ఇంకా 60 శాతం మంది ప్రజలు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నారు. మనందరం ఉమ్మడిగా ట్యాక్సులు కడితే మనందరి సంపాధనను తీసుకెళ్లి వైసీపీ నాయకులు వాళ్ల ఓటు బ్యాంకుగా భావించే కొంతమందికే ఇచ్చే పరిస్థితి. మన పెన్షన్లు ఆపడానికి వీళ్ళెవరు? వాళ్ల జేబుల్లో డబ్బులో, మైనింగ్ వ్యాపారాల్లో వచ్చిన డబ్బులో, కాంట్రాక్టుల్లో మిగిలిన డబ్బులో మనకు ఇవ్వడం లేదు. మనందరం ఉమ్మడిగా కట్టిన ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బుతో ఇస్తున్నారు. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. కేంద్ర నుంచి వచ్చే పథకాలను నిలిపివేయడానికి వీళ్లెవరు? దీనిని ప్రతి ఒక్కరు బలంగా ఎదుర్కోకపోతే యాచించే పరిస్థితి వస్తుంది. యాచించే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి రాకపోతే వైసీపీ దాష్టీకానికి అంతుండదు. ఎంతసేపూ బానిసలు మాదిరే బతకాల్సిన పరిస్థితి వస్తుంది. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప. మనం ట్యాక్సులు కట్టిన డబ్బును చొక్కా పట్టుకొని అడిగే హక్కు మనకుంది. ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యబద్ధంగా తిరగబడాలి. ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి. ఓటు అనే బోటుతో తీరం దాటిన వైసీపీ నాయకులు... మళ్లీ ఓట్ల కోసం మీ దగ్గరకు వస్తున్నారు. దయచేసి ఓటును వైసీపీ నాయకులకు వేయకండి. వాళ్లు ఇచ్చే నోట్లకు ఆశపడి ఓట్లు వేస్తే మనల్ని యాచించే స్థాయికి తీసుకెళ్తారు.

హిట్లర్ లాంటి ఉన్మాదులను చూసిన ప్రపంచం ఇది

హిట్లర్ లాంటి ఉన్మాదులను చూసిన ప్రపంచం ఇది

ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది. మీరు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లం కాదు. మీ దాష్టీకాలు ఆపకపోతే మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలిసిన వాళ్లం. మా జనసైనికులను కానీ, ఆడపడుచులను కానీ, మా నాయకులను గానీ బెదిరిస్తే చూస్తూ ఊరుకోం. కుటిల రాజకీయాలు చేసిన వాళ్లు మట్టిలో కలిసిపోవడం ఈ ప్రపంచం కళ్లారా చూసింది. హిట్లర్ లాంటి ఎందరో ఉన్మాదులు మట్టికరుచుకుపోయారు మీరెంత? మీ బతుకులెంత? గ్రామాల్లో దాష్టికాన్ని ఆపకపోతే మటుకు ప్రజలే మిమ్మల్ని తన్ని తరిమేసే రోజులు వస్తాయి గుర్తుపెట్టుకోండి. అలాగే అధికార యంత్రాగానికి కూడా నా విన్నపం. మీరు బలంగా ప్రజల పక్షాన నిలబడకపోతే మీరు కూడా తప్పు చేసిన వాళ్లవుతారు. మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వంటి మహానుభావుల ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తే సరిపోదు. ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా నిలబడాలి. అది మీ నైతిక బాధ్యత. అలా చేయకపోతే మర్యాద కోల్పోయిన వారవుతారన్నారు పవన్.

జనసేన-బీజేపీకి మద్దతివ్వండి..

జనసేన-బీజేపీకి మద్దతివ్వండి..

వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే సంక్షేమ పథకాలు తీసేస్తామని అన్ని గ్రామాల్లో బెదిరిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులకు నా విన్నపం. మీరు చదువుకున్న వ్యక్తులు. భారత రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రమాణం చేసిన వ్యక్తులు. మీరు కూడా ప్రభుత్వాల ఒత్తిళ్లకు లొంగిపోతే రోడ్లపై విప్లవాలు వస్తాయి. మీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఈ రోజు రేషన్ పంపిణిలో జరుగుతున్న అవినీతి రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. ఖాళీ సమయంలో రేషన్ డిపోలకు వెళ్లి తెచ్చుకునే ఆడపడుచులను రోడ్ల మీద పడేశారు. రేషన్ పంపిణీ వ్యవస్థను అస్తవ్యస్థం చేశారు. వైసీపీ దాష్టీకానికి, అవినీతికి, గూండాయిజానికి ఎదురొడ్డి నిలబడేది జనసేన, బీజేపీ పార్టీలు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వండి. మేము మీకు అండగా ఉంటామని" పవన్ అన్నారు.

English summary
vote for Janasena-bjp candidates: pawan kalyan on municipal elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X