రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం .. మీ దీవెనలుంటే విద్యా విప్లవం సృష్టిస్తాం : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విజయనగరంలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించారు. ఎన్నిక హామీలైన నవరత్నాలు అమలులో భాగంగా విజయనగరంలో 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని ప్రారంభించిన జగన్ వసతి దీవెన సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా విజయనగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. రాక్షసులతో తాను యుద్ధం చేస్తున్నానని చెప్పారు . పేదల జీవితాలలో మార్పు తీసుకురావడానికి వసతి దీవెన అందిస్తున్నామని చెప్పారు.


ప్రజలు దీవిస్తే విద్యావిప్లవం సృష్టిస్తామన్న సీఎం జగన్
ప్రజలు దీవిస్తే విద్యావిప్లవం సృష్టిస్తామని చెప్పారు. మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే అని సీఎం తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విద్యా దీవెన పథకం కింద ఏడాదికి 3,700 కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇక ఈ రెండు పథకాలతోనే 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు సీఎం జగన్ . అమ్మ ఒడి పథకం ద్వారా 6,400 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నామన్నారు.
పేదల బతుకులు మారాలంటే పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్ష
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేదల బతుకు మారలేదని పేర్కొన్న సీఎం జగన్ నిరుపేదల జీవితాలలో మార్పులు రావాలని అందుకోసం తనవంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు . పేదల బతుకులు మారాలంటే వారి కుటుంబాలలో పిల్లలు ఉన్నత చదువులు చదవాలని , ఎవరో ఒకరు ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్ అవ్వాలని అప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఉంది ప్రతిపక్ష నాయకులు కాదు రాక్షసులన్న జగన్
ఇంటర్ తర్వాత కళాశాలలో చేరేవారి సంఖ్య, చదువును కొనసాగించే వారి సంఖ్య రష్యాలో 81 శాతం, బ్రెజిల్, చైనా దేశాలలో 50 శాతం ఉండగా ఇండియాలో కేవలం 23 శాతం మాత్రమే ఉందని అందుకే చదువుకు ఏపీ సర్కార్ చాలా ప్రాధాన్యతనిస్తుంది అని పేర్కొన్నారు. విద్యార్థులను చదివించలేని పరిస్థితిలో ఉంటే కుటుంబాలు పేదరికం నుంచి ఎలా బయటపడతాయని సీఎం జగన్ ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోయినా రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోందని పేర్కొన్న సీఎం జగన్ తాము చేసే యుద్ధానికి దేవుడి దయ, ప్రజల దీవెనలు కావాలన్నారు. రాష్ట్రంలో ఉంది.. ప్రతిపక్ష నాయకులు కాదని , రాక్షసులు అని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.