పురంధేశ్వరి దారిలో ఇంకొందరు: కిషన్, జెఏసికి ఆఫర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులను తాము ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాజకీయ జెఏసి నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మరికొందరు ప్రముఖులు కూడా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.
తెలంగాణ రాజకీయ జెఏసి నాయకులు బిజెపిలోకి వస్తే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని కిషన్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిజెపితోనే సాధ్యమైందని ఆ పార్టీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. పార్లమెంటులో ప్రేక్షక పాత్ర వహించిన వారితో తెలంగాణ రాలేదని ఆయన చెప్పారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో కూర్చుని తెలంగాణ బిల్లుపై ఎలా చర్చ జరుగుతుందో చూసిన కొందరు తమవల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారని నాగం ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటులో బిజెపిది కీలక పాత్ర అని తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు.
పోలవరంపై ఉద్యమ కార్యాచరణ: కోదండరాం
పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తోందని తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య కళా నిలయంలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ పునర్నిర్మాణం-ప్రజల పాత్ర' అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి వలసపాలనలో వున్న తెలంగాణను ఆదుకోవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు ప్యాకేజీలు, ప్రత్యేక హోదా కల్పించడం దారుణమన్నారు.
మలిదశ ఉద్యమంలో న్యూడెమోక్రసి పాత్ర కీలకమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకటించడంలో కుట్ర జరిగిందని, దీని వల్ల పంపకాల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని కోదండరాం అన్నారు. ఇప్పటికి జెఏసి ఒక మైలు మాత్రమే ప్రయాణించిందని, ఇంకా 99 మైళ్లు ప్రయాణించాల్సి ఉందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications