బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం- ఇంకో ఆవర్తనం: ఏపీలో భారీ వర్షాలకు ఛాన్స్
Heavy rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదివరకట్లాగే- మరో విడత రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీహోర్డింగ్స్ వద్ద ఉండకూడదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
తాజాగా ఏర్పడిన అల్పపీడనం.. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంపై విస్తరించి ఉంది. పశ్చిమ- మధ్య ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా కదులుతోంది. ఉత్తరాంధ్రతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాల తీరం దిశగా క్రమంగా ఇది విస్తరిస్తోంది. వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం.. ఛత్తీస్ గఢ్ తూర్ప ప్రాంత జిల్లాల గగనతలానికి చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీనికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది.

దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం ఏపీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేశారు.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, ఉత్తర కోస్తా జిల్లాలైన అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్లతో పాటు రాయలసీమ రీజియన్ లోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
గుంటూరు, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని అన్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండకూడదని సూచించారు.












Click it and Unblock the Notifications