Weather: ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని సూచన
అమరావతి: నైరుతి రుతుపవనాల రాకకు మరో వారం రోజులు గడువు ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. మే 27న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించనున్న క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీలో రానున్న మూడ్రోజులపాటు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అధికార యంత్రాంగంతోపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అసని తుఫాను కారణంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మే 22 వరకు ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులు, ఈదారుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

కర్ణాటక, కేరళ, తమిళనాడులోనూ భారీ వర్షాలు
కర్ణాటక, కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్ జాం అవుతుండటంతో నగరవాసులు తిప్పలు తప్పడం లేదు. కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

అస్సాంను అతలాకుతలం చేసిన అతి భారీ వర్షాలు, వరదలు
అస్సాంలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైంది. వర్షాలు, వరదల కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది పశువులు మృతి చెందాయి. ఆరు లక్షల మందికిపైగా వరదలతో ప్రభావితమయ్యారు. వేలాది మంది తమ నివాసాలను విడిచిపెట్టి సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రోడ్లు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజా రవాణా అస్తవ్యస్తమైంది. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.