
తూర్పుగోదావరి జిల్లాలో థియేటర్లన్నీ మూత.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా??
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లన్నీ త్వరలోనే మూతపడబోతున్నాయా? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. జులై ఒకటో తేదీ నుంచి అన్ని సినిమా థియేటర్లలో బుక్ అయ్యే టికెట్ల నగదు మొత్తం ప్రభుత్వ ఖాతాలోనే జమకానుంది. ఒక్కరోజు విరామంతో ఆ డబ్బులను ప్రభుత్వం తిరిగి థియేటర్ల యాజమాన్యానికి ఇచ్చేయబోతోంది. అయినప్పటికీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. తూర్పుగోదావరి జిల్లాలో థియేటర్లన్నీ మూసేయాలని ఆయా యాజమాన్యాలు నిర్ణయించాయి. జిల్లాలోని ఎగ్జిబిటర్లందరూ సమావేశమై ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
ముందు వారు మూసేస్తే మిగతా జిల్లాలవారు కూడా ఇదే బాట పట్టే అవకాశం కనపడుతోంది.
థియేటర్ టికెట్లన్నీ ఆన్ లైన్ ద్వారా జరగాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. బుక్ మై షో ఉంటుందని, నగదు ఒక్కరోజు తేడాతో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా థియేటర్ యాజమాన్యం ముందుకు రావడంలేదు. కొన్నాళ్ల నుంచి చిత్రపరిశ్రమతో ప్రభుత్వానికి విభేదాలు నడుస్తున్నాయని, రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడంలేదని, రకరకాల పన్నుల పేరుతో ఇప్పటికే చాలా కడుతున్నామని, విడుదలయ్యే సినిమాను బట్టి, అప్పటి సందర్భాన్ని బట్టి ప్రభుత్వం ఎలా నడుచుకుంటుందనే విషయం అర్థం కావడంలేదని, దీనికన్నా ఉన్న థియేటర్లను కొన్నాళ్లు మూసుకోవడం మంచిదనే అభిప్రాయంతో ఎగ్జిబిటర్లు ఉన్నారు.

ఫిల్మ్ చాంబర్ కూడా ఏపీ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పెట్టినప్పటికీ దాన్ని తిరస్కరించింది. కొన్ని మినహాయింపులు కూడా ఇస్తామని, ఇతర ఒప్పందాలు ఉంటాయని, ఎటువంటి గేట్వే ఛార్జెస్ ఉండవని ఎగ్జిబిటర్లకు ప్రభుత్వం నచ్చచెపుతోంది. కానీ వీరెవరూ ముందుకు రాకపోతుండటంతో అవసరమైతే సీజ్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. వీటన్నింటికన్నా థియేటర్లను మూసేసుకోవడం ఉత్తమమనే భావనలో ఎగ్జిబిటర్లు ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి..!!