• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొండపల్లి మైనింగ్ వివాదం బ్యాక్ గ్రౌండ్ ఇదే - టీడీపీ పట్టుదల-వైసీపీ భయం ఇందుకేనా ?

|

ఏపీలో ప్రస్తుతం కాకరేపుతున్న కొండపల్లి అటవీ ప్రాంతం మైనింగ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య బాహాబాహీకి, కేసులకూ కారణమవుతున్న ఈ వివాదం వెనుక పలు కారణాలు ఉన్నాయి. వీటిలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమ తవ్వకాలకు బాద్యుల్ని తేల్చాలన్న టీడీపీ పట్టుదలతో పాటు ఇప్పుడు టీడీపీని అనుమతిస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న వైసీపీ భయాలు కూడా కారణమవుతున్నాయి.

కొండపల్లిలో వైసీపీ వర్సెస్ టీడీపీ

కొండపల్లిలో వైసీపీ వర్సెస్ టీడీపీ

సాధారణంగా కృష్ణా జిల్లా కొండపల్లి పేరు చెబితే గుర్తుకొచ్చివి బొమ్మలు. ఇక్కడ పునికిచెట్టు కలపతో తయారయ్యే ఈ బొమ్మలకు అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు కొండపల్లి పేరు చెబితే మైనింగ్ గుర్తు కొచ్చేలా పరిస్ధితి తయారైంది. దీనికి ప్రధాన కారణం గత కొంతకాలంగా అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలే. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ గుట్టు చప్పుడు కాకుండా జరిగిన గ్రావెల్ మైనింగ్ తాజా వివాదాలకు కారణమవుతోంది. దీంతో వైసీపీ, టీడీపీ నేతలు ఇరువురూ దీనిపై ఎన్నడూ లేనంత పట్టుదలను ప్రదర్శిస్తున్నారు.

కొండపల్లి వివాదం నేపథ్యమిదీ

గతేడాది ఆగస్టులో కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం పరిధిలోకి వచ్చే కొండపల్లి అటవీ ప్రాంతంలో భారీగా గ్రావెల్ తవ్వకాలు వెలుగుచూశాయి. ఇక్కడి కొండలను తొలిచి అక్రమార్కులు భారీ ఎత్తున గ్రావెల్ ను తవ్వేశారు. ఈ విషయం తెలియగానే అటవీ అధికారులు స్పందించి 8 జేసీబీలు, 7 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో కడెం పోతవరం, లోయ గ్రామాల పరిధిలోని 500 ఎకరాల్లో ఈ అక్రమ మైనింగ్ సాగినట్లు తేలింది. ఇక్కడ రూ.100 కోట్ల విలువైన మైనింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి అటవీ అధికారుల పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో తవ్వకాలకు రెవెన్యూ అధికారులు ఎన్వోసీ జారీ చేయడం విశేషం. దీంతో అక్రమార్కులు అడవిని తవ్వేస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు.

గతేడాది సర్వేకు ఆదేశాలు

గతేడాది సర్వేకు ఆదేశాలు

గతంలో రెవెన్యూ అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకుని నేతలు గ్రావెల్ మైనింగ్ చేపట్టినా.. ఆ తర్వాత గనుల శాఖ అధికారులు లీజుల్ని రద్దు చేశారు. అప్పటికే భారీ ఎత్తున కొండల్ని తొలిచి కంకర, గ్రావెల్ తవ్వేసినట్లు గతేడాది ఆగస్టులో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అటవీ, రెవెన్యూ, గనుల శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. వాస్తవాలు నిగ్గు తేల్చాలని ఆదేశించింది.. ఈ కమిటీ సమగ్రంగా సర్వే చేసేలా ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటికీ సర్వే జరగలేదు. అయితే అటవీశాఖ అధికారులు కేసులు పెట్టడంతో పాటు కొందరు కిందిస్ధాయి సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. అయినా సర్వే మాత్రం ఇప్పటికీ చేపట్టలేదు. అదే అసలు టీడీపీ వర్సెస్ వైసీపీ వివాదానికి కారణమవుతోంది.

అక్రమాలు బయటికొస్తాయనే

అక్రమాలు బయటికొస్తాయనే

కొండపల్లి అటవీ ప్రాంతంలో 500 ఎకరాల మేర కంకర, గ్రావెల్ తవ్వేసిన వారంతా రాజకీయ నేపథ్యం ఉన్న వారే. వీరంతా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అక్రమ మార్గాల్లో తవ్వకాలు చేపట్టారు. వీరిపై కేసుల నమోదు తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో వైసీపీ నేతల ప్రమేయం ఉందన్న కారణంతో టీడీపీ ఇప్పుడు ఈ వ్యవహారాన్ని టార్గెట్ చేసింది. దీంతో ప్రభుత్వం కూడా డిఫెన్స్ లో పడుతోంది. టీడీపీ నేతల్ని అటవీ ప్రాంతంలోకి అనుమతిస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతోందోనని ప్రభుత్వం భయపడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా గత తప్పిదాలపై కనీసం చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు రావడం లేదు. దీంతో ఈ వివాదం కాస్తా వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. చివరికి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనలతో పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. దీంతో మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టు, క్రిమినల్ కేసులు పెట్టే వరకూ వెళ్లింది.

  Janasena Silence Over BJP's Fight Against AP Govt| YSRCP | Tippu Sultan | AP | Oneindia Telugu
  వైసీపీ, టీడీపీ పరస్పర ఆరోపణలు

  వైసీపీ, టీడీపీ పరస్పర ఆరోపణలు


  కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాల వ్యవహారం కాస్తా బజారుకెక్కడంతో ఇప్పుడు వైసీపీ, టీడీపీ పరస్పరం ఆరోపణలకు దిగుతున్నాయి. వైసీపీ హయాంలోనే ఈ తవ్వకాలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, అటు వైసీపీ మాత్రం టీడీపీ హయాంలోనే ఈ అక్రమ మైనింగ్ జరిగిందని ప్రత్యారోపణలు చేస్తోంది. అయితే తవ్వకాలు ఎప్పుడు జరిగాయన్న దానిపై అటవీ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో ఇరు పార్టీలు మైండ్ గేమ్ సాగిస్తున్నాయి. ఇప్పుడు టీడీపీని అటవీ ప్రాంతంలోకి అనుమతిస్తే మాత్రం ఈ వ్యవహారం రాజకీయంగా తమకు నష్టం చేయడం ఖాయమని వైసీపీ ప్రభుత్వం భయపడుతోంది. సరిగ్గా దీన్నే వాడుకుంటూ టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి స్ధాయిలో సర్వే జరిపిస్తే తప్ప వాస్తవాలు వెలుగుచూసే అవకాశాలు కనిపించడం లేదు. కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధపడకపోవడంతో నానాటికీ వివాదం ముదురుతోంది.

  English summary
  there are several reasons behind recent kondapalli foret mining row in andhrapradesh beween ysrcp and tdp.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X