
చంద్రబాబునాయుడుకు వెన్నుపోటు పొడుస్తున్నవారెవరు??
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కొందరు నేతలు నమ్మించి వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ఆ పార్టీలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ మహానాడు, బాదుడే బాదుడుతోపాటు జిల్లాల పర్యటనలు, మినీ మహానాడులంటూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ చెమటోడుస్తున్న చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సింది పోయి మనకెందుకులే అనే ధోరణిలో కొందరు నేతలు ఉన్నారు. వీరంతా ఎవరెవరు? ఎందుకు దూరంగా ఉన్నారు? అనే విషయమై చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సీటు వస్తుందో? రాదో? గ్యారంటీ లేనప్పుడు ఖర్చు పెట్టడం ఎందుకు?
ఆ నివేదికల ప్రకారం.. తెలుగుదేశం పార్టీతో రాబోయే ఎన్నికల్లో జనసేన పొత్తు ఖాయమంటూ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల జనసేన మద్దతుదారులున్నారు. ఆయనకు మద్దతుగా నిలిచే సామాజికవర్గం ఉంది. అటువంటప్పుడు ఆయా నియోజకవర్గాల్లో మనం ఖర్చు పెట్టడం ఎందుకు? ఈ రెండు సంవత్సరాలంటే కోట్లరూపాయల ఖర్చు ఉంటుంది? ఖర్చు చేసిన తర్వాత సీటు వస్తుందో? రాదో? నమ్మకం లేదు. అటువంటప్పుడు పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందనే ఆలోచనలో కొందరు నేతలు ఉన్నారంట.

జనసేనకు ఇచ్చే సీట్లపై అవగాహన ఉందంట?
పార్టకి చెందిన కొందరు సీనియర్ నేతలకు జనసేనకు ఏయే సీట్లు కేటాయిస్తారు? అనే అంశంపై కూడా అవగాహన ఉందంట. ఆ ప్రకారం ఆయా నియోజకవర్గాల్లో ప్రచారానికి, పార్టీ బలోపేతానికి, పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకుండా దూరం జరుగుతున్నారంటూ చంద్రబాబునాయుడు తెప్పించుకున్న నివేదికల్లో వెల్లడైంది. ఖర్చు పెట్టడమనేది వృథా ప్రయాస అనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఈ విధమైన ఆలోచనలో ఉన్న నేతలు తమ పనితీరుతో తాజాగా బయటపడ్డారని తెలుస్తోంది.

అయినా వీరు మారడంలేదబ్బా?
ఉత్తరాంధ్ర పర్యటనకు చంద్రబాబునాయుడు వెళ్లినప్పుడు జనసేనకు ఏ సీట్లు కేటాయిస్తారు? అనే అవగాహన ఉన్న నియోజకవర్గాల నుంచి జన సమీకరణ జరగలేదు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం బలోపేతంగా ఉండాలి అని పార్టీ నేతలకు బాబు సూచిస్తున్నారు. అయినా వీరు మారడంలేదు.. కష్టపడటంలేదు.. పార్టీ ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు చంద్రబాబు జిల్లాల పర్యటనలకు, మినీ మహానాడులకు ఖర్చుపెట్టకుండా దూరం జరుగుతున్నవారందరికీ త్వరలోనే చంద్రబాబునాయుడు తనదైనశైలిలో గట్టి ఝలక్ ఇవ్వబోతున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.