ఏపీలో కలిపిన వాటికి ఎమ్మెల్యేలు ఎవరు: ఎంపీ ప్రశ్న, వద్దన్నారని బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు మండలాలకు ఎమ్మెల్యేలు ఎవరని ఎంపీ సీతారాం నాయక్ సోమవారం ప్రశ్నించారు. ఏపీలో కలిపేటప్పుడు వాటి పైన ఆలోచించలేదన్నారు. భద్రాద్రి రాముడిని తెలంగాణకు ఇచ్చి, ఆస్తులను ఏపీలో కలిపారన్నారు.
గిరిజనుల బాధ్యత ఎవరు చూస్తారో చెప్పాలన్నారు. ఎటపాక, కన్నాయగూడెం, పురుషోత్తంపట్నాలను విలీనం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. ఈ గ్రామాల విలీనం పైన గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించాలన్నారు. త్వరలో దీని పైన సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
బంగారు తెలంగాణకు సహకరించాలి: కవిత

బంగారు తెలంగాణ ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కొత్తపేట అనన్య డెంటల్ కళాశాలలో వైద్య విద్య పూర్తి చేసిన వారికి కవిత సర్టిఫికేట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
రాజధాని నిర్మాణంలో రైతులకే తొలి ప్రాధాన్యం: చంద్రబాబు
రాజధాని నిర్మాణంలో తొలి ప్రాధాన్యం రైతులకే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ వైపు ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూనే ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. రాజధాని నిర్మాణం, ల్యాండ్ పూలింగ్ పైన ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా రాజధాని ఆప్రదేశంలో వద్దని అన్న వారే అన్నారు.
అడవులలో రాజధాని నిర్మాణం చేయాలని కూడా వారు సలహా ఇచ్చారన్నారు. 2004లో తాము అధికారం కోల్పోయాక అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా వెళ్లి హైదరాబాదులో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పడం తాము చేసిన అభివృద్ధికి నిదర్శనం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications