ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు ఎవరు? పోలీసులకు అనుమానమే కలగడంలేదా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు కారులో సుబ్రహ్మణ్యం అనే యువకుడి మృతదేహం దొరికింది. తెల్లవారుజామున మరణించారంటూ కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాన్ని అప్పజెప్పే ప్రయత్నం చేశారు.. కానీ వారంతా అడ్డుకోవడంతో ఆయన మరో కారులో పారిపోయారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

పోలవరం ప్రాంతంలో రౌడీషీట్?
అసలీ అనంత ఉదయ్‌బాబు ఎవరు? అనే ప్రశ్న ప్రజల మెదళ్లను తొలిచేస్తోంది. పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో ఇతనిపై రౌడీషీట్ ఉందని పోలవరం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇతనిపై రౌడీషీట్ ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. చిన్నతనం నుంచే పలు అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనేవాడని, దాడులు, దౌర్జన్యాలతో పేరు తెచ్చుకున్నాడని స్థానిక టీడీపీ నాయకులు చెప్పారు. రాజకీయంగా అండ కావాలి కాబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడని, ఇటీవలే ఆయనకు ఎమ్మెల్సీ సీటిచ్చారని స్థానికులు తెలిపారు.

తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారు!!
ఉదయ్‌బాబుకు గతంలోనే ఎమ్మెల్సీ సీటిచ్చినప్పటికీ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం పెట్టడంతో ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా ఏమీకాదనే ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉందని, అందుకే వారిష్టమొచ్చినట్లు గా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.

రూ.30వేల కోసం చంపేస్తారా?
సుబ్రహ్మణ్యం ఉదయ్‌బాబు దగ్గర కొన్నాళ్లు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో రూ.30వేలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు సెటిల్మెంట్ కోసం అతన్ని తీసుకువెళ్లిన ఎమ్మెల్సీ మృతదేహాన్ని తీసుకొచ్చి అప్పగించారు. పుట్టినరోజు పార్టీ ఉందంటూ తీసుకెళ్లారంటున్నారు. సీసీ కెమెరాల్లో కూడా దృశ్యాలు నమోదయ్యాయి. యాక్సిడెంట్ అయి మరణించినట్లుగా చెప్పారంటూ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రమాదం జరిగితే ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లలేదు? కాళ్లు చేతులు ఎందుకు విరిగిపోయి ఉన్నాయి? ఉదయ్బాబే కాళ్లు చేతులు విరిచేసి కొట్టి చంపారని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీసులకు అనుమానమే కలగడంలేదు!!
ఇంత జరిగినా పోలీసులకు మాత్రం వీసమెత్తు కూడా అనుమానం రావడంలేదని, ఉదయ్బాబుపై కేసు నమోదు చేయలేదని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. మృతదేహాన్ని తెచ్చిన వ్యక్తిపై ఇంతవరకు కేసు కూడా నమోదుచేయలేదని మండిపడుతున్నారు. నిజాయితీగల అధికారితో కేసు దర్యాప్తు చేయించాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.