జగన్ ఆఫర్ కు అదానీ నో -రాజ్యసభ సీటు తిరస్కరణ వెనుక ఏం జరిగింది ? అసలు రీజన్ ఇదే!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టి పోర్టులతో పాటు పలు కీలక డీల్స్ కుదుర్చుకున్న అదానీ గ్రూప్ వైసీపీ ఇవ్వచూపిన రాజ్యసభ సీటును మాత్రం తిరస్కరించింది. వైసీపీ కోటాలో ఈసారి లభించే నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక దాన్ని అదానీ భార్యకు ఇస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేసుకుంది. దీంతో అంబానీ, అదానీ కుటుంబాలు సైతం వైసీపీ రాజ్యసభ సీట్ల కోసం ఎగబడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చివరికి ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన అదానీ గ్రూప్ రాజ్యసభసీటుపై ఆసక్తి లేదని తేల్చేసింది.

అదానీకి రాజ్యసభ సీటు ఆఫర్
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీకి లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సీటు కేటాయించబోతోందని ఆరు నెలల నుంచి విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాజెక్టుల్ని చేజిక్కించుకున్న అదానీ గ్రూప్ కు జగన్ ఈ ఆఫర్ ఇవ్వడం ద్వారా మరింత దగ్గర చేసుకుంటున్నారని అంతా అనుకున్నారు. చివరికి రాజ్యసభ ఎన్నికల సమయం రానే వచ్చింది. దీంతో అదానీ ఫ్యామిలీకి రాజ్యసభ సీటు ఖాయమనే ప్రచారాన్ని వైసీపీ వర్గాలు మరింత ముమ్మరం చేశాయి. కానీ అక్కడే భారీ ట్విస్ట్ ఎదురైంది.

జగన్ ఆఫర్ తిరస్కరించిన అదానీ
అదానీ కుటుంబానికి వైసీపీ ఇవ్వచూపిన రాజ్యసభ సీటును అదానీ గ్రూప్ తిరస్కరించింది. తమకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని స్పష్టం చేసేసింది. వైసీపీ ఏపీ నుంచి తమకు రాజ్యసభ సీటు ఇవ్వబోతోందనే ప్రచారాన్ని కూడా ఖండించింది. ఇలాంటి ఊహాజనిత మీడియా కథనాలల్లోకి కొందరు స్వార్థపరులు మా పేర్లను లాగడం దురదృష్టకరం.
గౌతమ్ అదానీ లేదా ప్రీతి అదానీ లేదా అదానీ కుటుంబ సభ్యులెవరికీ కూడా రాజకీయ జీవితంపై గానీ, రాజకీయ పార్టీ చేరాలనే ఆసక్తి లేదు'' అని అదానీ గ్రూప్ ప్రకటనలో పేర్కొంది. దీంతో వైసీపీ ఒక్కసారిగా కంగుతింది. అదానీ గ్రూప్ చేసిన ప్రకటనపై వైసీపీ వర్గాలు ఒక్కసారిగా మౌనం వహించాయి.

అదానీ తిరస్కరణ వెనుక?
అదానీ గ్రూప్ వైసీపీ తమకు ఇవ్వజూపిన రాజ్యసభ సీటును వివిధ కారణాలతో సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో ప్రధాన పోర్టుల్ని అదానీ గ్రూప్ నేరుగానే దక్కించుకుంది. ఇతరత్రా ప్రాజెక్టులు తీసుకోవాలన్నా బిడ్డింగ్ లో పోటీ పడి వాటిని దక్కించుకునే స్ధాయి అదానీ గ్రూప్ కు ఉంది. కేంద్రంతో పాటు బీజేపీ అధిష్ఠానంలో ఉన్న పలుకుబడి నేపథ్యంలో ఏపీలో తమ వ్యాపారాలకు వచ్చిన ఇబ్బందులేవీ లేవు.
అలాంటి సమయంలో ఏపీలో వైసీపీ నుంచి రాజ్యసభ సీటు తీసుకోవడం వల్ల అదానీ ఫ్యామిలీకే కాదు అదానీ గ్రూప్ కు సైతం ఎలాంటి అదనపు ప్రయోజనం లేదు. మరోవైపు వైసీపీ నుంచి రాజ్యసభ సీటు తీసుకోవాలంటే పార్టీ కండువా కప్పుకోవాల్సిందే. అది ఎలాగో అదానీ కుటుంబానికి ఇష్టం లేదు. దీంతో అదానీ గ్రూప్ ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

వైసీపీ సన్నాయినొక్కులు
ఏపీలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్ధానాల్లో ఒకటి అదానీ కుటుంబానికి ఇస్తున్నట్లు ఇన్నాళ్లూ వైసీపీ వర్గాలు చెప్తూ వచ్చాయి. ఇదే విషయం దాదాపు అన్ని ప్రధాన మీడియాల్లోనూ కథనాల రూపంలో కనిపించింది. ఇప్పుడు అదానీ గ్రూప్ ఇచ్చిన ప్రకటనతో ఒక్కసారిగా వైసీపీ వర్గాలు కంగుతున్నాయి. దీంతో ఇప్పుడు అసలు తాము అదానీ కుటుంబానికి రాజ్యసభ ఆఫర్ ఇవ్వలేదని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదంతా మళ్లీ మీడియా సృష్టేనంటున్నారు. తమవైపు నుంచి దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా ఇవ్వలేదని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.

అసలేం జరిగింది?
ఎప్పుడైతే రిలయన్స్ గ్రూప్ కు చెందిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వాలని నేరుగా గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ ఏపీకి వచ్చి జగన్ ను కలిసి వెళ్లారో అప్పటి నుంచి పారిశ్రామిక వేత్తలపై జగన్ కన్ను పడింది. దీంతో ఆ తర్వాత నత్వానీకి రాజ్యసభ సీటు కేటాయించిన జగన్.. ఆ తర్వాత తనను కలిసిన అదానీకి కూడా రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది.
దీనిపై ఆయన చూద్దాం అన్న సంకేతం మాత్రమే ఇచ్చి వెళ్లారు. దీంతో అదానీ కుటుంబంలో ఒకరు రాజ్యసభ సీటు తప్పకుండా తీసుకుంటారని భావించిన వైసీపీ.. ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. తద్వారా పార్టీకీ, జగన్ కు ఉన్న పరపతి ప్రచారం చేసుకోవాలని భావించింది.
దీనిపై ఎలాంటి ఖండనలు రాకపోవడంతో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేవరకూ ఈ ప్రచారం సాగింది. ఇంకా ముమ్మరమైంది. షెడ్యూల్ వచ్చేసరికి ఇది కాస్తా అదానీల వరకూ వెళ్లింది. దీంతో రాజ్యసభ సీటుపై తమకెలాంటి ఆసక్తి లేదని వారు కుండబద్దలు కొట్టేసారు.