andhra pradesh chittoor guntur districts unanimous ys jagan peddireddy ramachandra reddy nimmagadda ramesh kumar ap news ap govt ysrcp tdp ఆంధ్రప్రదేశ్ చిత్తూరు గుంటూరు జిల్లాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ టీడీపీ politics
చిత్తూరు, గుంటూరు ఏకగ్రీవాల వెనుక- జగన్, పెద్దిరెడ్డి ప్రతిష్ట ? అందుకేనా ఎస్ఈసీ బ్రేక్
ఏపీలో ఏకగ్రీవ పంచాయతీల విషయంలో వైసీపీ సర్కారుకూ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కూ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ప్రభావం చివరికి గుంటూరు, చిత్తూరు జిల్లాలపై పడింది. అయితే ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాల విషయంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ? ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోనే ఏం జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అలాగ ఈ రెండు జిల్లాలపై కలెక్టర్లు ఇచ్చే నివేదికలు, వాటిని ఎస్ఈసీ పరిగణలోకి తీసుకుంటారా అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.
అసెంబ్లీ ముందుకు నిమ్మగడ్డ- త్వరలో ప్రివిలేజ్ కమిటీ సమన్లు ? రామోజీరావు కేసే ఆధారం

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తొలి విడత పంచాయతీ పోరుకు రంగం సిద్దమవుతుండగా.. అంతకు ముందే పలు జిలాల్లో అధికార పార్టీకి మద్దతుగా ఏకగ్రీవాలు జరిగాయి. ప్రభుత్వం కూడా ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్న వేళ ఇదంతా సాధారణమే అనుకున్నా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో గుంటూరు జిల్లాలోని తెనాలి రెవెన్యూ డివిజన్లో 337 పంచాయతీలు, 3442 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వాటిలో 67 పంచాయతీలు 1337 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన 67 సర్పంచ్ అభ్యర్ధుల్లో 63 వైసీపీ వారే. అలాగే చిత్తూరు జిల్లాలో 545 పంచాయతీలకు 112 ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో 95 వైసీపీకే దక్కాయి.

ఏకగ్రీవాలపై ఎస్ఈసీ విచారణ
గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ ఎత్తున పంచాయతీలు ఏకగ్రీవంగా మారిన నేపథ్యంలో వాటిపై విచారణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ విచారణకు ఆదేశించారు. అప్పటివరకూ సదరు పంచాయతీల ఫలితాలను నిలిపేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఆయా పంచాయతీల్లో ఏకగ్రీవాలపై విచారణ జరుగుతోంది. ఇందులో అధికారులు సహకరించినట్లు తేలితే వారిపైనా చర్యలు తప్పవని ఎస్ఈసీ హెచ్చరికలు చేశారు. దీంతో ఇప్పుడు ఈ పంచాయతీల్లో ఏకగ్రీవాలు కరెక్టేనని చెబితే ఎస్ఈసీ ఏమంటారో, కాదని చెబితే ప్రభుత్వం ఏం చేస్తుందో అన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. అందుకే జాగ్రత్తగా ఏకగ్రీవాలను విశ్లేషించే పనిలో వారు నిమ్మగ్నమయ్యారు.

అధికారులకు సర్కారు హెచ్చరికలు
పంచాయతీ పోరులో చిత్తూరు, గుంటూరు జిల్లాలో అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై ఎస్ఈసీ అధికారులతో విచారణ ప్రారంభంచిన తరుణంలో రిటర్నింగ్ అధికారులైన కలెక్టర్లకు ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోంది. ఎస్ఈసీ మాట విని ఏకగ్రీవాలపై ఏకపక్ష చర్యలు తీసుకుంటే నిమ్మగడ్డ రిటైర్ అయ్యాక మీపై చర్యలు తప్పవంటూ పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి బహిరంగంగానే వారిని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారబోతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే ఇప్పుడే ఎస్ఈసీ చర్యలు తీసుకుంటారు, వినకపోతే ప్రభుత్వం తర్వాత చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అధికారుల పాత్ర కీలకంగా మారింది.

జగన్, పెద్దిరెడ్డి కోసమేనా ఏకగ్రీవాలు ?
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన భారీ ఏకగ్రీవాల వెనుక ప్రభుత్వ పెద్దల ప్రతిష్ట ముడిపడి ఉందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ నివాసంతో పాటు క్యాంప్ ఆఫీసు కూడా ఉన్నాయి. అలాగే చిత్తూరు జిల్లాను మంత్రి పెద్దిరెడ్డి తన కనుసన్నల్లో ఉంచుకున్నారు. అక్కడ పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఏమీ జరగదనే ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో పంచాయతీ పోరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం జగన్, పెద్దిరెడ్డి తమ జిల్లాల్లోనూ ఇతర జిల్లాల తరహాలోనే పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోలేకపోతే తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించారా లేక వైసీపీ నేతలే అలా ఊహించుకుని ఏకగ్రీవాలకు పావులు కదిపారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద జగన్, పెద్దిరెడ్డి కోసమే ఈ పంచాయతీల్లో అత్యధికం ఏకగ్రీవం అయిందన్న ప్రచారం సాగుతోంది.