దళితుడి ఇల్లు కూల్చడంలో ఎందుకంత పైశాచికానందం?జగన్ సర్కర్ కు బాబు సూటి ప్రశ్న.!
అమరావతి/హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం రాదనే అంశం ప్రతి రోజూ నిరూపణ అవుతుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దళితుల ఇళ్లను కూడా కూల్చి రాక్షసానందం పొందుతున్నారని జగన్ ప్రభుత్వంపై మండి పడ్డారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవళ్లిలో హనుమంత రాయుడు అనే దళితుని ఇల్లు కూల్చిన ఘటనను చంద్రబాబు ఖండించారు. ఒక సామాన్య దళిత వ్యక్తి ఇంటిని కూల్చి కుటుంబాన్ని రోడ్డున పడెయ్యడానికి ఎమ్మెల్యే, ఆర్డివో, పోలీసులతో పాటు అధికారుల వరకు అంతా కలిసి యుద్దం చెయ్యడం పై చంద్ర బాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు.

పేద కుటుంబం ఇల్లు కూల్చడమే లక్ష్యం అన్నట్లు పని చేసిన అధికారుల తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయ కక్షలతో వేధించే విష సంస్కృతిని వైసిపి డిఎన్ఏ లోనే ఉందని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ఇంత మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసి ఉంటే బాగుండేదని అన్నారు. ఇల్లు కూల్చివేతపై ఆవేదనతో హనుమంత రాయుడు, అతని భార్య అనితాలక్ష్మీ దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడంపై ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుందని ప్రశ్నించారు. గళం లేని వారని దళితులను అణగదొక్కే చర్యలను దళిత జాతి క్షమించదని చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి వెంటనే ఇంటిని మంజూరు చెయ్యడంతో పాటు, వారిని వేధనకు గురి చేసినందుకు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.