నంద్యాల: వ్రతం చెడ్డ ఫలితం లేదు, అంతర్మథనంలో వైసీపీ

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపిని ఓడించాలని భావించిన వైసీపీ ఆశలు నిరాశే ఎదురైంది. ఊహించని విధంగా టిడిపికి భారీ మెజారిటీ రావడం వైసీపీకి మింగుడుపడడం లేదు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.
''ఆళ్ళగడ్డ అమ్మ, నంద్యాల నాన్న, శిల్పా గురించి తెలియకే జగన్ టిక్కెట్టు''
2019 ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికలు సెమీ ఫైనల్గా భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైంది. అయితే ఊహించిన దాని కంటే ఎక్కువ మెజారిటీతో టిడిపి విజయం సాధించడం వైసీపీకి మింగుడుపడడం లేదు.
నంద్యాలలో 13 రోజుల పాటు వైసీపీ చీఫ్ జగన్ ప్రచారం నిర్వహించినా కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఫలితాలు ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

అంతర్మథనంలో వైసీపీ
నంద్యాల ఉప ఎన్నికలో ఘోర పరాజయం పొందిన తర్వాత వైసీపీ అంత:ర్మథనంలో పడింది. నంద్యాల ఓటమికి గల కారణాలను వెతికే పనిలో పడింది. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై.. అందుబాటులో ఉన్న నాయకులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఫలితాలు ప్రతికూలంగా రావడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజల నాడిని పట్టుకోవడంలో పార్టీ విఫలమైందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ముందే డిసైడయ్యారని ఈ సమీక్షలో విశ్లేషించారు.

సానుభూతి కలిసివచ్చింది.
టిడిపి నేత భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం.. ఆయన మృతి పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి టీడీపీకి కలిసివచ్చిందని వైసీపీ నేతల భావనగా కన్పిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలకు ఉపఎన్నికలను ఎదుర్కోవడం సులభం. కానీ, విపక్ష వైసీపీకి ఇది కష్టసాధ్యమనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు భూమా మరణం తర్వాత ఆ కుటుంబానికే టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.ఉపఎన్నికల సమయంలో తల్లిదండ్రులు లేని పిల్లలమం. ఆళ్ళగడ్డ, నంద్యాల నియోజకవర్గ ప్రజలనే తన తల్లిదండ్రులుగా భావిస్తామని అఖిలప్రియ ప్రకటించుకొన్నారు.

ఫలితం దక్కలేదు
సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణిస్తే ....ఆ కుటుంబానికి చెందిన సభ్యులు పోటీచేస్తే ఇతర పార్టీలు ఆ ఎన్నికను ఏకగ్రీవంగా చేసే సాంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొనసాగుతోంది. కొన్ని అసాధారణ సందర్భాల్లో మినహ దాదాపుగా ఏకగ్రీవంగానే ఎన్నికలు ముగిశాయి. మరోవైపు ప్రధానంగా టీడీపీ తన ప్రచారంలో భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి మరణాన్ని తెరమీదకు తెచ్చింది. భూమా కుటుంబానికి చెందిన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని టీడీపీ సూచించింది. అయితే భూమా మృతిపై వైసీపీ మరో వాదాన్ని వినిపించింది. భూమా నాగిరెడ్డి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అని, ఈ సీటు తమకే ఇవ్వాలని వైసీపీ వాధించింది. ఎట్టకేలకు పోటీకి దిగి టీడీపీ చేతిలో వైసీపీ ఓడిపోయింది. ఉపఎన్నికను పురస్కరించుకొని పోటీకి దూరంగా ఉంటే గౌరవం దక్కేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, తమ సీటంటూ పోటీచేసి ఓటమిపాలైంది వైసీపీ. దీంతో వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు.

ఉపఎన్నికల్లో అధికారపార్టీకి ప్రయోజనం
సాధారణంగా ఉపఎన్నికలు వస్తే అధికార పార్టీకి కలిసివచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే నంద్యాల పట్టణంలో ఇటీవల కాలంలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు తమవైపుకు వచ్చారని అధికార పార్టీ నేతలు అభిప్రాయంతో ఉంది. ఇదే విషయాన్ని కూడ జగన్ ప్రస్తావించారు.అయితే ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలు 2019 ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయని చెప్పలేం. 2019 ఎన్నికల సమయం నాటికి రాష్ట్రంలో నెలకొనే రాజకీయ పరిస్థితులు కూడ ఎన్నికల్లో ప్రభఆవం చూపే అవకాశం లేకపోలేదు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!