హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ రిలీజ్: చౌరస్తాలో సీమాంధ్ర లీడర్స్, వేరుదారేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంపై కాంగ్రెసు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ బెయిల్‌ను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. పలువురు నేతలు వేరుదారి చూసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జగన్‌‍కు బెయిల్ రావడంతో పలువురు సీమాంధ్ర పార్టీ నాయకుల్లో కొత్త పార్టీ ఆలోచన మరింత బలపడుతోందంటున్నారు.

జగన్‌కు బెయిల్ రావడం వెనుక అధిష్టానం ఉందని పలువురు అనుమానిస్తున్నారట. ఇన్నాళ్లు తాము పార్టీ కోసం పని చేస్తే ఇప్పుడు జగన్‌‍కు అధిష్టానం మద్దతుగా నిలబడటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటున్నారు. ఓ వైపు సమైక్య సెగలు, మరోవైపు జగన్‌కు బెయిల్ రావడంతో కొత్త పార్టీ ఆలోచనలు మరింత ఊపందుకున్నాయంటున్నారు. జగన్ బెయిల్ మంజూరు పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు.

YS Jagan

సమైక్యవాది అయిన జగన్ బెయిల్ పైన విడుదల కావడం సంతోషకరమని, సమైక్యవాదులు ఎవరైనా తాను స్వాగతిస్తానని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన చేసి అటు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇటు సీమాంధ్రలో వైయస్ జగన్ ఉంటే చాలని తమ పార్టీ అధిష్టానం భావిస్తోందని రామచంద్రపురం కాంగ్రెస్ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి శంకర రావు మాట్లాడుతూ.. జగన్ కాంగ్రెసు పార్టీతో కలిసి పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ విడుదలలో తమ పార్టీ అధిష్టానం పాత్ర లేదని చెప్పారు.

కాగా, ఇప్పటి వరకు చాలామంది కాంగ్రెస్ నేతలు సీమాంధ్రలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ, సొంత పార్టీకి దన్నుగా ఉంటూ, జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అయితే ఇటు తెలంగాణలో తెరాసను విలీనం చేసుకుని, సీమాంధ్రలో జగన్‌తో పొత్తు కుదుర్చుకుని కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా విభజనను తెరపైకి తెచ్చినట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి.

సిబిఐ చకచకా చార్జిషీట్లు దాఖలు చేయడం, దర్యాప్తు ముగిసిందని కోర్టుకు చెప్పడం, సోమవారం జగన్‌కు బెయిలు రావడంతో ప్రతిపక్షం ఇది కుమ్మక్కేనని ఆరోపిస్తోంది. ఈ పరిణామాలు పలువురు కాంగ్రెసు నేతలను కూడా విస్మయానికి గురి చేస్తున్నాయంటున్నారు. అధిష్టానానికి అండగా ఉండి, ఇన్నాళ్లు జగన్‌పై ఘాటైన విమర్శలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు చౌరస్తాలో ఉన్నట్లుగానే భావించవచ్చునని అంటున్నారు. అయితే, ఈ కొత్త పార్టీ కోసం ముందుకు వచ్చేదెవరనే చర్చ కూడా సీమాంధ్ర కాంగ్రెసులో సాగుతోంది.

English summary
It is said that Seemandhra Congress Party leaders are thinking about New Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X