గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయపాటీ..పరిస్థితేంటీ? టీడీపీ తరఫున రేసులోకి వచ్చిన లగడపాటి

|
Google Oneindia TeluguNews

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ షాట్ గా గుర్తింపు ఉన్న తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ ఊగిసలాడుతోంది. రాయపాటికి టికెట్ ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. రాయపాటికి బదులుగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు టికెట్ ఇవ్వాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తనకు నరసరావు పేట టికెట్ ఖాయమంటూ రాయపాటి పదేపదే చెప్పుకోవడానికి కారణం ఇదేననే అభిప్రాయం వినిపిస్తోంది.

గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి సాంబశివరావు చాలాకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగారు. గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగుదఫాలు ఆయన విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ లో కొనసాగలేని పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని నరసరావు పేట్ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అయోధ్యా రామిరెడ్డిపై విజయం సాధించారు. తన కుమారుడికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు పనులను దక్కించుకోవడానికే రాయపాటి టీడీపీలో చేరారనే విమర్శలు అప్పట్లో చెలరేగాయి. దీనికి అనుగుణంగా.. ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు పోలవరం పనులను అప్పగించింది టీడీపీ ప్రభుత్వం.

will former congress mp lagadapati rajagopal eyes on narasaraopet lok sabha as tdp candidate?

కాగా, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా నరసరావు పేట స్థానం తనకే దక్కుతుందని రాయపాటి భావిస్తూ వచ్చారు. చివరి నిమిషంలో ఆయన ఆత్మ రక్షణలో పడ్డారు. దీనికి కారణం- తనకు బదులుగా లగడపాటి రాజగోపాల్ పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తుండటమే. పొరుగునే ఉన్న విజయవాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లగడపాటి.. వరుసగా రెండోసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. సర్వేలను నిర్వహించడంలో దిట్టగా పేరుపొందారు. రాయపాటిని తప్పించి, లగడపాటికి నరసరావుపేట లోక్ సభ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లగడపాటి కోసం నరసరావుపేటే ఎందుకు?

లగడపాటి రాజగోపాల్ కు నరసరావు పేట టికెట్ ను ఇవ్వాలని ఒకరిద్దరు మీడియా పెద్దలు కూడా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. నరసరావు పేట లోక్ సభ ఒక్కటే ప్రస్తుతం చంద్రబాబు వద్ద ఉన్న ప్రత్యామ్నాయం. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, విజయవాడతో పాటు గుంటూరు, నరసరావు పేటల్లో తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణకు కాదని రాయపాటిని బరిలోకి దించుతారని భావించడం అసాధ్యం.

బీసీ ఓటు బ్యాంకు బలంగా ఉన్న నియోజకవర్గం అది. అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయపాటికి టికెట్ ఇస్తే.. బీసీల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని తప్పించే ప్రయత్నం కూడా చంద్రబాబు చేయరు. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన రాయపాటి కోసం సొంత పార్టీకి చెందిన కేశినేనిని దూరం చేసుకోరు. ఇక గుంటూరులోనూ అదే పరిస్థితి. సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ కు ఇక్కడ టికెట్ ఖాయం. ఆయనను తప్ప మరొకరిని బరిలో దింపే రిస్క్ చంద్రబాబు చేయరని అంటున్నారు. ఇక మిగిలిన స్థానం నరసరావు పేట ఒక్కటే. అక్కడున్న రాయపాటిని తప్పించి, అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన లగడపాటిని బరిలో దింపడం సులభమేనని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాయపాటిపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందంటూ ఇదివరకే పార్టీ నాయకుల నుంచి అందిన నివేదికలను ఆధారంగా చేసుకుని, ఆయనను తప్పించి లగడపాటికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ముంగిట్లో చోటు చేసుకున్న ఈ పరిణామం రాయపాటిని కలవరానికి గురి చేస్తోంది. శనివారం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. నరసరావు పేట టికెట్ తనకే వస్తుందంటూ రాయపాటి పలుమార్లు చెప్పుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదేనని చెబుతున్నారు. అవసరం లేదనుకుంటే చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారనే విషయం రాయపాటి వ్యవహారంలో మరోసారి రుజువు అవుతందని రాయపాటి వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.

English summary
Former Congress Party leader, former Lok Sabha member elected twice from Vijayawada, Lagadapati Rajagopal all set to re entry in Politics as Telugu Desam candidate. He is showing keen interest to contest from Narasarao Pet Lok Sabha constituency as TDP candidate for upcoming elections. TDP President, Chief Minister of Andhra Pradesh N. Chandrababu Naidu also consider his name for Narasarao Pet Lok Sabha seat. Rayapati Sambasiva Rao, who elected from Narasarao Pet Lok Sabha as TDP candidate in 2014 elections, under threat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X