తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎప్పటికీ మాజీ ముఖ్యమంత్రే??
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగానే ఉండిపోతారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు జగన్‌ను ఓడించే సత్తా లేదని, ఎన్ని పార్టీలు కలిసి పోటీచేసినా విజయం మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.
చంద్రబాబునాయుడి జిమ్మిక్కులను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అధికారం కోసం ఆయన ఎంతకైనా దిగజారతానే విషయం తెలుసని, బీసీలకు రాజ్యసభ సీటిస్తే చంద్రబాబు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమకు చంద్రబాబునాయుడు ఏం చేశారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

కొద్దిరోజులుగా చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. స్పందన విశేషంగా ఉందని, ప్రభుత్వంపై ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ వర్గాలంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోను రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందంటున్నారు. చంద్రబాబు యాత్రకు ధీటుగా ముఖ్యమంత్రి జగన్ ఈనెల 26 నుంచి మూడురోజులపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో బస్సు యాత్ర చేపిస్తున్నారు. వెనకబడిన వర్గాలకు ప్రస్తుత ప్రభుత్వం చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి చెప్పడంతోపాటు చంద్రబాబు యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.