వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐతే...తెలంగాణాలో కోదండ రాం పార్టీతో వైసిపి పొత్తా?...

|
Google Oneindia TeluguNews

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు...శాశ్వత శత్రువులు ఉండరని నానుడి. ఆ నానుడిని అక్షరాలా నిరూపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు. మొన్నటిదాకా
పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న టిడిపి, టిఆర్ఎస్ లు ఇప్పుడు మిత్ర పక్షాలుగా అవతరించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉద్యమం నాటి నుంచి టిఆర్ఎస్ వ్యూహకర్తగా వ్యవహరించిన కోదండ రాం తెంగాణాలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్రమంగా ఆ పార్టీకి ప్రధాన శత్రువుగా మారిపోయిన సంగతి అందరూ చూసిందే.

అలాగే గత ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలో టిఆర్ఎస్ పోటీ చేసే సమయం నుంచి ప్రభుత్వం ఏర్పడే నాటి వరకు వైసిపి అధినేత జగన్ కు పరోక్షంగా మద్దతు ఇస్తూ వచ్చిన టిఆర్ఎస్ కు...ఇప్పుడు జగన్ ఎంత మాత్రం మిత్రుడు కానే కాడని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్ని పరిణామాల నేపధ్యంలో సామాజిక సమీకరణాల నేపథ్యం కావచ్చు...లేక శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి అనుసారం కావచ్చు...తెలంగాణాలో కోదండరాం పెట్టే పార్టీ... తెలంగాణాలో తమ వైసిపి పార్టీ మనుగడ కోరుకుంటున్న జగన్...జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే వైసిపి తమ బల ప్రదర్శనకు సమాయత్త చర్యల్లో భాగంగా తెలంగాణాలో బస్సు యాత్ర చేపడుతోందని అభిప్రాయ పడుతున్నారు.

 కోదండరాం పార్టీ ఖాయం...మార్చి 10 న ప్రకటన...

కోదండరాం పార్టీ ఖాయం...మార్చి 10 న ప్రకటన...

తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు తెలిసింది. పార్టీ పేరు, నినాదాలు, విధివిధానాలు, గుర్తు తదితరాలు ప్రకటించేందుకు తేదీనీ ఖరారు చేయడం కూడా అయిపోయింది. మిలియన్‌ మార్చ్‌ జరిగిన మార్చి 10న భారీ బహిరంగసభ నిర్వహించి అట్టహాసంగా పార్టీని ప్రకటించాలని కోదండరాం నిర్ణయించారట. ముందు ఫిబ్రవరి రెండో వారంలోనే పార్టీ ప్రకటించాలని భావించినా జేఏసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ రోజునే ప్రకటన చేయడం బాగుంటుందని ఆలోచించి కోదండరాం ఈ నిర్ణయం తీసుకున్నారట. కోదండ రాం తమ పార్టీ పేరును తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) గా ఖరారు చేసినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

 తెలంగాణాలో...వైసిపి బస్సు యాత్ర అందుకేనా?

తెలంగాణాలో...వైసిపి బస్సు యాత్ర అందుకేనా?

మరోవైపు తెలంగాణాలో అతి త్వరలో వైసిపి బస్సుయాత్రకు సిద్ధమవుతోంది. ఏపిలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తున్న సమయంలోనే తెలంగాణా వైసిపి నేతలు ఈ బస్సుయాత్రకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. పార్టీ తెలంగాణా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణాలో ఎన్నికల హడావుడి మొదలైన నేపధ్యంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణాలో గత ఎన్నికల్లో వైసిపి తరపున నలుగురు ఎంఎల్ఏలు, ఒక ఎంపి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా వారందరూ టిఆర్ఎస్ లో చేరారు. దాంతో తెలంగాణాలో వైసిపికి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులే లేకుండా పోయారు. అయితే ఆ విషయాన్ని అప్పట్లో జగన్ కూడా అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణాలో పార్టీ పటిష్టానికి వైసిపి బస్సుయాత్ర చేస్తామని ప్రకటించడానికి కారణం ఏమిటి?

 బల ప్రదర్శన...సీట్ల సమీకరణాలు...అందుకేనా?...

బల ప్రదర్శన...సీట్ల సమీకరణాలు...అందుకేనా?...

తెలంగాణాలో అన్నీ జిల్లాలను కవర్ చేస్తూ బస్సుయాత్ర ఉంటుందని తెలంగాణా వైసిపి అధ్యక్షుడు గట్టు చెప్పారు. బస్సుయాత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తెలంగాణాలో చేసిన సేవలను, అభివృద్ధిని వివరిస్తామని చెప్పారు. అదే విధంగా తెలంగాణా అభివృద్ధి కోసం తమ పార్టీ తరపున చేపట్టబోయే కార్యాచరణను కూడా వివరిస్తామన్నారు. మార్చి 13వ తేదీన జిల్లాల అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు తదితరులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అంతేకాదు టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని గట్టు తెలిపారు. ఇదంతా ఎందుకు?...ఈ బస్సు యాత్ర ద్వారా తమ పార్టీ బల ప్రదర్శన చేసి ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చెయ్యడంతో పాటు రేపు కోదండరాం పార్టీ తో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే సీట్ల విషయంలో తమకు ఆమోదయోగ్యమైన సంఖ్య కోసం ఒత్తిడి తెచ్చేందుకు ఈ బస్సు యాత్ర, తదనంతరం పార్టీ చేపట్టే కార్యక్రమాలు ఉపయోగపడతాయనేది వైసిపి వ్యూహంగా తెలుస్తోంది.

 సాధ్యమేనా?...వట్టి ఊహాగానాలేనా?...

సాధ్యమేనా?...వట్టి ఊహాగానాలేనా?...

అయితే కోదండ రాం పార్టీతో వైసిపి పొత్తా అని ముందు ఆశ్చర్యపోయినా...తరువాత తెలుగు రాష్ట్రాల రాజకీయాల తీరు అవలోకనం చేసుకున్నాక ఇలా జరిగే అవకాశం ఉందని అంగీకరిస్తున్నారట...ఈ రెండు పార్టీలు తమ పొత్తు ద్వారా ఒకరి లోపాలను మరొకరు అధిగమించే ప్రయత్నం చెయ్యొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణాలో కోదండ రాం కు ఉన్న పేరు ప్రఖ్యాతులు, స్థానికత, సామాజిక సమీకరణాలు, ప్రభుత్వ వ్యతిరేకత, టిఆర్ ఎస్, కేసిఆర్ వ్యతిరేకులు...ఇలా వివిధ వర్గాలు కోదండ రాంతో కలసి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వైసిపి తమ మైనస్ లు పూడ్చుకోవచ్చని యోచిస్తోందట. ప్రధానంగా స్థానికత సమస్య, తమ పార్టీ తరుపున గెలిచిన ప్రజాప్రతినిధులను నిలుపుకోవడం వంటి అంశాల దృష్ట్యా దూరదృష్టితో వైసిపి ఈ దిశలో ఆలోచన చేస్తోందట. అవసరమైతే గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీగా తమ అనుభవాన్ని, అలాగే అవసరమైన ఆర్థికపరమైన మద్దతును కోదండ రాం పార్టీకి అందజేసి తద్వారా ఆ పార్టీ పాగా వేసేందుకుచ తద్వారా తాము లబ్ది పొందేందుకు వైసిపి వ్యూహం పన్నుతోందని అంటున్నారు...ఏదేమైనా ఈ విషయంలోను అతి త్వరలోనే తెలుగు ప్రజలకు స్పష్టత లభించే అవకాశం ఉందని కూడా రాజకీయ పరిశీలకులు జోస్యం చెప్పేస్తున్నారు.

English summary
Will YCP join with Kondada Ram party in Telangana?...Is it possible? ... but political observers says that it is possible ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X