సుప్రీం తీర్పుతో డైలమాలో సర్కారు, ఉద్యోగులు- ఎస్ఈసీకి సహకారం ? కీలక చర్చలు
ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటివరకూ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న జగన్ సర్కారు పూర్తిగా డైలమాలో పడిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించేందుకు ఇప్పటివరకూ నేతలు నిరాకరిస్తుండగా.. ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేఫథ్యంలో ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతోంది, ఇందులో ఉద్యోగ సంఘాల పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.

సుప్రీంతీర్పుపై జగన్ సర్కారు అంతర్మథనం
ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని తెలిసి కూడా మొండిగా ఎస్ఈసీకి సహాయ నిరాకరణకు దిగిన ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. సుప్రీం తీర్పు తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై వైసీపీ కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ప్రభుత్వంలో కీలక అధికారులతో పాటు నేతలతో చర్చించాక ఎన్నికలకు సహకరించే అంశంపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.

నిమ్మగడ్డకు జగన్ సహకరిస్తారా ?
సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ప్రభుత్వం తప్పనిసరిగా సహకరించాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇవాళ తాము దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే న్యాయస్ధానం ప్రభుత్వం, ఉద్యోగుల వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. దీంతో ఇప్పుడు నిమ్మగడ్డకు సహకరించకపోతే కోర్టు ధిక్కార చర్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో నిమ్మగడ్డకు సహకరించడమే మంచిదన్న ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

సుప్రీంతీర్పుతో ఉద్యోగులు చల్లబడతారా ?
సుప్రీంకోర్టులో ఎన్నికలకు వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన పిటిషన్, అందులో వాడిన భాషపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉద్యోగులు కూడా ఆత్మరక్షణలో పడ్డారు. రెండు రోజుల క్రితం వరకూ సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని చెబుతూ వచ్చిన ఉద్యోగులు.. ఆ తర్వాత టోన్ మార్చి సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే మెరుపుసమ్మె చేపడతామని, ఎన్నికలకు సహకరించబోమన్న ఉద్యోగులు ఇప్పుడు షాక్‌కు గురయ్యారు. ఇంకా ఎన్నికలకు సహకరించకపోతే సుప్రీం చర్యలకు గురవుతామన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఇప్పటికే సర్కారుకు గుడ్డిగా మద్దతిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారు ఎన్నికలకు సహకరించే అవకాశాలే కనిపిస్తున్నాయి.