ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు-జగన్‌తో గోపూజ-బాబుతో హిందూత్వం- బీజేపీ ఎఫెక్ట్
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాక ముందు దూకుడుగా రాజకీయాలు చేసేందుకు బీజేపీకి అవకాశం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే వైసీపీకి, ఆ పార్టీ అధినేత కమ్ సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌కు ఉన్న క్రైస్తవ ముద్ర చర్చనీయాంశంగా మారుతుందో అప్పుడు బీజేపీకి కూడా దూకుడుగా రాజకీయాలు చేసేందుకు అవకాశం కలుగుతోంది. దీంతో అనివార్యంగా అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ కూడా తమ అజెండాలను కూడా అంతే వేగంగా మార్చుకోక తప్పడం లేదు. మారిన పరిస్ధితుల్లో బీజేపీ ఇటు జగన్‌తో గోపూజ చేయిస్తుండగా.. చంద్రబాబుతో హిందూత్వ అజెండా అమలు చేసేలా ఒత్తిడి పెంచుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


రంగు మారుతున్న ఏపీ రాజకీయం
ఏపీలో నిన్న మొన్నటి వరకూ బీజేపీని అంటరాని పార్టీగా చూస్తూ తక్కువ అంచనా వేసిన వైసీపీ, టీడీపీ ఇప్పుడు అనివార్యంగా కాషాయ రంగు పులుముకోవాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. ఏడాది కాలంలో రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆలయాల ఘటనలను చూసీ చూడనట్లుగా వదిలేసిన వైసీపీ ఇప్పుడు అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంటోంది. తనతో పాటు సెక్యులర్ పార్టీగా ముద్ర ఉన్న టీడీపీని సైతం ఇరుకునపెడుతోంది. దీంతో ఇప్పుడు ఈ రెండు పార్టీలు బీజేపీ బాటలోనే నడవాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా ప్రస్తుతం ఏపీలో బీజేపీ ట్రాప్‌లో వైసీపీ, టీడీపీ పూర్తిగా పడిపోయాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

తొలిసారి హిందూత్వ అజెండాతో చంద్రబాబు
గతంలో వాజ్‌పేయ్ హయాంలో బీజేపీతో జట్టు కట్టిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అభివృద్ధి మంత్రం జపించేది. మతతత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీతో జత కలిసినా అప్పట్లో టీడీపీకి ఆ మరకలు అంటలేదు. మోడీ తొలిసారి కేంద్రంలో అధికారం చేపట్టినప్పుడు బీజేపీతో రెండోసారి జత కట్టినప్పుడు కూడా టీడీపీకి మత రాజకీయాల ముద్ర పడలేదు. కానీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బీజేపీతో జట్టు కోసం ప్రయత్నిస్తున్న టీడీపీకి మాత్రం ఆ ముద్ర పడుతోంది. బీజేపీతో స్నేహం కోసం ఉన్న అన్ని అవకాశాలను ఇప్పటికే వాడేసిన టీడీపీ... ఇక చివరిగా తనకు అలవాటు లేని హిందూత్వ అజెండాతో కాషాయ నేతలను మెప్పించే ప్రయత్నం చేస్తోంది.

గుళ్లు, గోపూజల బాట పట్టిన జగన్
ఏపీలో ఓవైపు బీజేపీ, మరోవైపు టీడీపీ హిందూత్వ అజెండాతో విసురుతున్న సవాల్‌తో భారీ మెజారిటీతో, సుస్ధిర ప్రభుత్వంతో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ కూడా ఆత్మరక్షణలో పడిపోవాల్సిన పరిస్ధితి. ముఖ్యంగా విగ్రహాలపై దాడులను తొలుత లైట్ తీసుకున్న జగన్ సర్కారు.. బీజేపీ, టీడీపీ ముప్పేట దాడితో దర్యాప్తుల పేరుతో హంగామా చేయాల్సిన పరిస్దితి ఏర్పడింది. చివరికి వీరిద్దరితో పోటీ పడుతూ గుళ్ల దర్శనాలకు, గోపూజలకూ జగన్ సిద్ధమైపోతున్నారు. గతంలో టీటీటీ ఆలయాలకే పరిమితమైన గోపూజలను సీఎం జగన్ ఇప్పుడు రాష్ట్రంలోని మరెన్నో దేవాలయాలకూ విస్తరించడమే కాకుండా స్వయంగా తానే గోపూజలో పాల్గొంటుండటం బీజేపీ ప్రభావమే అని చెప్పక తప్పదు.

జగన్, చంద్రబాబు అజెండాల మార్పు..
రాష్ట్రంలో బీజేపీ దూకుడుతో జగన్, చంద్రబాబు వేగంగా తమ అజెండాలు మార్చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీని మెప్పించడమే లక్ష్యంగా ఈ అజెండాల మార్పు సాగుతుందా అనే స్దాయిలో జగన్, చంద్రబాబు వ్యవహారం ఉందనే చర్చ రాష్ట్రంలో సాగుతోంది. గతంలో సెక్యులర్ పార్టీలుగా తమకున్న ముద్రను, తమ ఓటు బ్యాంకును కూడా వదిలిపెట్టి మరీ బీజేపీని మెప్పించేందుకు జగన్, చంద్రబాబు పడుతున్న తపన చూస్తుంటే సగటు ఓటరు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అయినా ప్రస్తుతం ఇవేవీ పట్టించుకునే పరిస్దితుల్లో వీరిద్దరూ లేనట్లుగానే కనిపిస్తోంది.

బీజేపీని ఆహ్వానిస్తున్న జగన్, చంద్రబాబు
గత ఎన్నికల సమయంలో బీజేపీకి ఏపీ రాజకీయాల్లో చోటు లేకుండా చేయగలగడంలో సక్సెస్ అయిన వైసీపీ, టీడీపీ ఇప్పుడు మారిన పరిస్దితుల్లో ఆ పార్టీని నెత్తికెత్తుకునేందుకు దేనికైనా తెగించేందుకు సిద్ధపడుతున్నాయి. కేంద్రంలో బీజేపీతో జట్టు కట్టే విషయంలోనూ గతంలో చంద్రబాబు కానీ, జగన్ కానీ ఆమడ దూరంగా ఉండిపోయేవారు. వాజ్‌పేయ్ హయాంలో కేంద్రంలో చేరితో బీజేపీ ముద్ర తమ ఓటు బ్యాంకుపై పడుతుందన్న భయంతో కేవలం మద్దతుతో సరిపెట్టిన చంద్రబాబు.. ఆ తర్వాత మోడీ హయాంలో మాత్రం రెండు కేంద్రమంత్రి పదవులు తీసుకుని, తన కేబినెట్లోనూ ఇద్దరు కాషాయ మంత్రులకు చోటిచ్చారు. జగన్ అయితే ఇప్పటికీ కేంద్రంలో చేరితే తన ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందని భయపడుతున్నారు. కానీ కేసుల వల్లో, మరే ఇతర భయాలతోనో కానీ ఇరువురూ బీజేపీకి అనివార్యంగా రాష్ట్రంలో స్వాగతం పలికే పరిస్దితుల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మద్దతు కోసం ఎదురుచూస్తున్నారు.